నదిలో 48 డెడ్‌బాడీస్.. కరోనా భయమేనా?
posted on May 10, 2021 @ 3:43PM
నదిలో మృతదేహాలు తేలుతున్నాయి. ఒకటి, రెండు కాదు.. పదుల సంఖ్యలో డెడ్‌బాడీస్ నీటిలో కొట్టుకొస్తున్నాయి. పవిత్ర గంగా, యమునా నదులు ఇప్పుడు మృతదేహాల దిబ్బలుగా మారాయి. బిహార్‌లోని బక్సర్ జిల్లాలో మృతదేహాల కలకలం చెలరేగింది. గంగా నదిలో కిలోమీటర్ పరిధిలో 48 డెడ్‌బాడీస్ కనిపించాయి. మృతదేహాలను చూసి స్థానికులు ఒక్కసారిగా బెదిరిపోయారు. వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు.
మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్ జిల్లాలో నదిలో మృతదేహాలు తేలియాడుతుండటం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. హామిర్‌పుర్, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని అంటున్నారు.
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి భయపడి.. ఇలా నదిలో వదిలేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కరోనా మృతులకు దహన సంస్కారాలు చేయాల్సిన కొందరు సిబ్బంది సైతం ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ నదిలో పడేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
యూపీలోని హామిర్‌పుర్, కాన్పుర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరు. వాటిని నదిలో వదిలేస్తారు. అందుకే, యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయన్నారు. అయితే, ఓవైపు కరోనా కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరగడం.. మరోవైపు, కొవిడ్ భయంతో అంత్యక్రియలు చేయకుండా చాలామంది మృతదేహాలను ఇలా నదిలో వదలడం వల్ల.. ఇటు గంగా నదిలో, అటు యమునా నదిలో ఇలా డెడ్‌బాడీస్ తేలుతూ కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే, గంగలో కేవలం ఒక కిలోమీటర్ పరిధిలోనే 48 మృతదేహాలు తేలుతూ ఉండటం కలకలం రేపుతోంది.