గేట్స్-మెలిందా విడాకులకు కారణం అతనేనా?
posted on May 10, 2021 @ 7:00PM
ప్రపంచంలోకే రిచెస్ట్ కపుల్స్. 27 ఏళ్ల వైవాహిక అనుబంధం. బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్‌తో 4 లక్షల కోట్ల దాతృత్వ కార్యక్రమాలకు కర్తలు. 1994లో వివాహం. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. ఆ అన్యోన్య దంపతులు ఇటీవల విడిపోతున్నట్టు ఉమ్మడిగా ప్రకటించారు. యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
ఇంతకీ బిల్‌గేట్స్-మెలిందా కపుల్స్ ఎందుకు విడిపోతున్నట్టు? 27 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని ఎందుకిలా తెగదెంపులు చేసుకుంటున్నట్టు? వారి మధ్య మనస్పర్థలకు కారణమేంటి? విడాకులు తీసుకునేంత పెద్ద సమస్య ఎందుకొచ్చింది? కొన్ని రోజులుగా ఇదే చర్చ.
గేట్స్-మెలిందా దంపతుల విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదట. ఏడాదిన్నర కాలంగా గేట్స్ దంపతులు విడాకులపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపారట. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్ సంబంధాలు నెరపడం నచ్చక పోవడం వల్లే.. మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు "వాల్ స్ట్రీట్ జర్నల్" కథనం.
తమ దాంపత్య బంధం ‘తిరిగి కొనసాగించలేని విధంగా ముక్కలైంది’ అని చెబుతూ మెలిందా 2019 అక్టోబరులోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. మహమ్మారి విజృంభణ సమయంలో దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం విడాకులపై పరస్పర నిర్ణయానికి వచ్చారంటూ "వాల్ స్ట్రీట్ జర్నల్" కథనం రాసుకొచ్చింది.
లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్ కథనం తెలిపింది. 2013లో ఓ దాతృత్వ కార్యక్రమం కోసం గేట్స్ దంపతులు ఎప్‌స్టీన్‌ను కలిశారు. అయితే అతడి ప్రవర్తనతో తాను సౌకర్యంగా లేనని మెలిందా అప్పుడే గేట్స్‌కు చెప్పారు. కానీ ఆమె అభ్యంతరాన్ని విస్మరించి గేట్స్, కంపెనీ ఉద్యోగులు కొందరు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించారు. గేట్స్, ఎప్‌స్టీన్ పలుమార్లు కలిశారని, ఒక రాత్రంతా గేట్స్ అతడి నివాసంలోనే ఉన్నాడని 2019లో అమెరికా పత్రికలు కథనాలు రాశాయి. అయితే తనని కలిసిన మాట వాస్తవమేనని, కానీ తమ మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు, స్నేహ బంధాలు లేవని అప్పట్లో గేట్స్ చెప్పారు. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య గొడవలు వచ్చి.. అవి ముదిరి.. విడాకులకు దారితీసినట్లు వాల్‌స్ట్రీట్ తన కథనంలో తెలిపింది.
వృత్తిపరంగా ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్.. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతుండగానే అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన చనిపోయినా.. జెఫ్రీ బతికున్నప్పుడు అతనితో బిల్‌గేట్స్ డీలింగ్స్ జరపడాన్ని అంగీకరించలేకపోయింది మెలిందా. దీంతో.. ఆ ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకుని.. విడాకులు తీసుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇలా, ఆ 27 ఏళ్ల బంధం ముగిసిందంటూ అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ "వాల్ స్ట్రీట్ జర్నల్" స్పెషల్ స్టోరీ ప్రచురించింది.