ఈటలకు సపోర్ట్ ఇచ్చేదెవరు? హ్యాండిచ్చేదెవరు?
posted on May 10, 2021 @ 6:00PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రిపదవి నుంచి అవమానకరంగా తొలగించాలని భావిస్తున్న ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించారు. అయితే తన అనచరులు, నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపిన రాజేందర్... రాజీనామాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సమయం కొంత లేటైనా ఈటల రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనచురులు చెబుతున్నారు. జనాలంతా కరోనా భయంలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయడం సరికాదనే భావనలో రాజేందర్ ఉన్నారంటున్నారు.
ఈటల అనుచరుల వాదన ఎలా ఉన్నా.. ఆయన భవిష్యత్ కార్యాచరణపై మాత్రం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొత్త పార్టీ పెట్టాలని దాదాపు నిర్ణయించిన రాజేందర్... కొత్త పార్టీ పెడితే తనతో కలిసి వచ్చేవారెవరు అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. బీసీ ఎజెండాగా జనంలోకి వెళ్లాలా లేక తెలంగాణ ఉద్యమకారుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పోవాలా అన్న సందిగ్ధంలో ఉన్నారంటున్నారు. బీసీ ఎజెండాతో పార్టీ పెట్టాలని ఆయనపై బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయని అంటున్నారు. అయితే ఈటలకు మాత్రం రెడ్డి వర్గం నేతల నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుందని అంటున్నారు. దీంతో ఏం చేయాలన్న అంశంపై తన అంతరంగీకులతో ఈటల సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.
కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇటీవలే ఈటలను కలిశారు. కొత్త పార్టీపైనే ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది. ఈటల పార్టీ పెడితే తాను మద్దతు ఇస్తానని గతంలోనే ప్రకటించారు రాజేందర్. టీఆర్ఎస్ లో ఉన్న కొందరు అసంతృప్త నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలను కలిసి మద్దతు తెలిపారు. మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలను కలవడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. హరీష్ రావు వర్గంగా చెప్పుకునే నేతలంతా రాజేందర్ తో టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో కొంత కాలంగా హరీష్ రావు సన్నిహిత నేతలను పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ఈటలతో ఏనుగు సమావేశం తర్వాత మరో చర్చ కూడా జరుగుతోంది. హరీష్ రావు డైరెక్షన్ లోనే ఈటలను రవీందర్ రెడ్డి కలిశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈటలకు మద్దతుగా ఉన్నారంటున్నారు. మొదటి నుంచి ఈటల మనిషిగా పేరున్న సదరు ఎమ్మెల్యే ప్రస్తుతానికి బహిరంగంగా ప్రకటన చేయకపోయినా... కొత్త పార్టీ పెడితే మాత్రం మద్దతు ఇవ్వడం ఖాయమంటున్నారు. సీఎం కేసీఆర్ సొంత గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఈటలతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కొందరు సీనియర్ నేతలు రాజేందర్ తో రాయబారం నడుపుతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ లో గౌరవం లేదని భావిస్తున్న వరంగల్ జిల్లాలోని ఉద్యమ నేతలు కూడా ఈటల కొత్త పార్టీ పెడితే చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ నేతలంతా ఈటలకు మద్దతుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ సెకండ్ కేడర్ నుంచి ఈటలకు భారీగా సపోర్ట్ వస్తుందని అంటున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మధ్య ఆదిపత్య పోరు తీవ్రంగా ఉంది. బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం వలసొచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాత టీఆర్ఎస్ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాంటి నేతలంతా ఈటల కొత్త పార్టీ పెడితే... అతనితో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు ఇప్పటికే తమ అనుచరుల ద్వారా రాజేందర్ కు సంకేతం ఇచ్చారని అంటున్నారు.
మరోవైపు ఈటల రాజేందర్ పై నిఘా పెట్టిన అధికార పార్టీ... ఆయనను ఎవరు కలుస్తున్నారన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. ఈటల పార్టీ పెడితే ఆయనతో వెళ్లేవారెవరు అన్న దానిపై గులాబీ నేతలు ఫోకస్ చేశారంటున్నారు. ఈటలను కలుస్తున్న నేతలను తమదారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ముందుగా ఈటల నియోజకవర్గం హుజురాబాద్ నుంచే ఆపరేషన్ ఈటల స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించిన తర్వాత ఆయనకు మద్దతుగా మాట్లాడిన నేతలకు తాయిలాలలతో ఎరవేస్తున్నారని చెబుతున్నారు. పదవుల్లో ఉన్న నేతలకైతే .. పదవి పోతుందని హెచ్చరిస్తున్నారట. ఆయినా దారికి రాకపోతే ఏదో ఒక కేసులో ఇరికిందే లొంగ దీసుకునే ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని పోలీసు, రెవిన్యూ శాఖల్లో అధికారులను బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నేతల చర్యలతో... గతంలో ఈటలకు మద్దతుగా నిలిచిన కొందరు నేతలు ఇప్పుడు వెనకాడుతున్నారని తెలుస్తోంది.