కొవిడ్ రోగి ఎక్కడైనా ఆసుపత్రిలో చేరొచ్చు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
posted on May 10, 2021 @ 3:31PM
దేశంలో కల్లోలం స్పష్టిస్తున్న కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త సమస్యలు తీసుకువస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు ఘర్షణలు పడుతున్నాయి. లాక్ డౌన్ అంశంలోనే పలు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొవిడ్ రోగులకు చికిత్స విషయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. హాస్పిటల్స్ లో బెడ్లు లేకపోవడంతో రాష్ట్రాలన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో ఇతర రాష్ట్రాల కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయి. అంబులెన్సులను తమ సరిహద్దుల్లోని నిలిపివేస్తున్నాయి.
ఏపీ నుంచి వస్తున్న కొవిడ్ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దుమారం రేపింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ దగ్గర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ పోలీసుల ఆంక్షలతో ఏపీ నుంచి అంబులెన్సుల్లో వచ్చిన కోవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కొవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చింది. కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, కొవిడ్ పాజిటివ్ టెస్టు రిపోర్టు లేకపోయినా కరోనా రోగిని చేర్చుకోబోమని ఏ ఆసుపత్రి నిరాకరించరాదని స్పష్టం చేసింది. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులు ఈ మేరకు నడుచుకోవాలని పేర్కొంది.
కొవిడ్ నిర్ధారణ అయిన, కొవిడ్ అనుమానితుల అంశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడంచెల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాయలని సూచించినట్టు తన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో పరిమితంగానే వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నందున ఒక్క విడతలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు చేయలేకపోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించడం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.