వాజ్ పేయి, అద్వానీల వల్లే బీజేపీకి ఈ అధికారం.. గడ్కరీ
posted on Aug 22, 2022 @ 10:30AM
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగిందంటే అందుకు మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ ఉప ప్రధాని అద్వానీలే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వారి వల్లే బీజేపీ నేడు ఈ స్థాయికి ఎదిగిందన్నారు. గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికిన తరువాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగపూర్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీజేపీ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి వాజ్ పేయి, అద్వానీ వంటి వారే కారణమన్నారు.
లోక్ సభలో కేవలం రెండు స్థానాలున్న బీజేపీ ఈ రోజు జాతీయ స్థాయిలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కంచుకోగలిగిందంటేఅందుకు వారి కృషే కారణమనిపేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ముంబైలో ఒక సదస్సులో వాజ్ పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తించారు. ‘చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందని వాజ్ పేయి అన్నారనీ, ఆ రోజు ఆ సదస్సులో తానూ ఉన్నాననీ గుర్తు చేసుకున్నారు.
నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. 1980లో ముంబైలో బీజేపీ నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారితోపాటు కార్యకర్తల కృషి కారణంగానే నేడు మోదీ నాయకత్వంలో పార్టీ అధికారంలో ఉందని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని.. అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజిక, ఆర్థిక సంస్కర్తలు దూరదృష్టితో ఆలోచిస్తారనీ, వారి విజన్ శతాబ్దం మేలు గురించి కూడా ఆలోచిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.