పొదల్లో దొరికిన పెద్దామె!
posted on Aug 22, 2022 @ 10:41AM
పిల్లాడు పెరట్లో ఆడుతూంటే చెట్టు దగ్గర మట్టిలో స్టీలు స్పూను కనిపించింది. అమాంతం దాన్ని తీసుకుని తల్లి దగ్గరికి వెళ్లాడు. దీనికోసం రెండ్రోజులుగా వెతుకుతున్నా ఎలా దొరికింది అంటే పిల్లాడు వివరంగా చెప్పాడు. ఇది తప్పకుండా పనిపిల్ల పనే అని విసుక్కుంది, మరో ఇంట్లో దాదాపు ఇలానే ఒక గిన్నె కని పించింది. ఆ ఇంటి ఇల్లాలు వాళ్ల పనిపిల్ల పనే అనుకుని తిట్టి తరిమేసింది. ఇలాంటివి సర్వసాధారణం. కానీ ఈథన్ అనే రెండేళ్ల పిల్లాడికి ఏకంగా ఒక పెద్దామె కనిపించింది!
జార్జియాకి చెందిన బ్రిటానీ మూర్, ఆమె పిల్లాడు రెండేళ్ల ఈథన్‌ని ఇంటి పెరట్లో ఆడిస్తోంది. బంతి విసి రితే వాడు తెస్తున్నాడు. కొంత సేపయ్యాక ఆటలో భాగంగా బంతికోసం పెరట్లో ఓ మూలగా పొదల మాటు న ఏదో కదులుతున్న అనుమానం వచ్చి అలా చూస్తుండిపోయాడు. చెట్లు కదులుతున్నాయని వాడికి అమితాశ్యర్యమేసిందేమో! ముందుకు వెనక్కి కదిలి అక్కడికి వెళ్లాలా వద్దా అని సంశయించాడు. ఆఖరికి బాగా దగ్గరికి వెళ్లి చూశాడు. వాడికి మనిషి పాదాలు కనిపించి గట్టిగా అరిచాడు. తల్లి పరుగున వెళ్లింది. అక్కడేదో కరిచిందో, కుట్టిందో అని. తీరా చూస్తే మనిషి పాదాలు కనిపించాయి. ఆమె కూడా భయం భయంగానే పొదలు తొలగించి చూస్తే ఓ పెద్దామె స్పృహ లేకుండా పడి ఉంది.
వెంటనే భర్తని పిలిచి ఆమెను ఇంట్లోకి తీసికెళ్లింది. ఆమె పై దుమ్ము ధూళీ తుడిచి మొహం మీద నీళ్లు చల్లితే ఆ పెద్దామె తేరుకుంది. చుట్టూ ఉన్నవారిని పరికించి చూసింది. వీళ్లెవరో కొత్తవారిలా ఉన్నారు, తననెందుకో ఇక్కడికి పట్టుకొచ్చారనే అనుకుంది. మీరెవరు, నన్నెందుకు ఇక్కడికి తీసుకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాననీ హెచ్చరించింది. అమ్మ.. మసలావిడా.. పొదల్లో పడి ఉందని లోపలికి తీసుకొచ్చి సేవలు చేస్తే ఎంత మాటంటోంది వదినా.. అన్నది బ్రిటానీ తన పక్కింటావిడతో!
కొంతసేపటికి బ్రిటానీ భర్త పోలీసుల్ని పిలిచాడు. ఆమెను పరిశీలించి, ఆమె బంధువుల గురించి అడి గారు. ఇంత చేస్తే ఆమె నాలుగయిదు వీధుల అవతల ఉండే పెద్దావిడ అని తేలింది. ఆమె బంధువు, ముని మనవరాలూ వచ్చి అందరికి సారీ చెప్పింది. ఆమెకు దారుణమైన మతిమరుపు. అలా తిరుగుతూ ఎవరింట్లోకో వెళ్లి కబుర్లు చెబుతూనే ఉండిపోతూంటుందిట. మరి వీళ్ల ఇంట్లో పెరట్లోకి ఎలా వచ్చిందనే ఇప్పటికీ అనుమానమే. ఏమైనప్పటికీ ఆ 86 ఏళ్ల పెద్దామె పేరు నీనా.
కానీ ఆమెను రక్షించి బయటికి తీసుకొచ్చిన రెండ ఏళ్ల ఈథన్ ని మాత్రం ఆ ఇంటివాళ్లంతా ఎంతో సత్క రించారు. పక్కింటాళ్లంతా బుగ్గలు గిల్లారు, పోలీసులు శభాష్ బేటా అన్నారు. నీనా మాత్రం నవ్వి ఊరుకుంది.