మునుగోడుతో కేసీఆర్ పతనానికి శ్రీకారం.. అమిత్ షా
posted on Aug 21, 2022 @ 11:35PM
మునుగోడులో బీజేపీ ఆదివారం (ఆగస్ట 21) నిర్వహించిన సమరభేరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మునుగోడులో శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల వర్షం కురిపిస్తే.. ఆదివారం నాటి సమర భేరి సభలో అమిత్ షా కేసీఆర్ ను విమర్శలతో చెరిగేశారు.
మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది అన్నారు. సమరభేరి సభా వేదికపై అమిత్ షా ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీజేపీ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని చెప్పిన అమిత్ షా రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోక తప్పదని మునుగోడు సభను చూస్తుంటే అర్ధమౌతోందని అన్నారు. రాజగోపాలరెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకే తాను మునుగోడు వచ్చినట్లు చెప్పిన అమిత్ షా కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదని విమర్శించారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అమిత్ షా చెప్పారు.
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా?తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన సీఎం చేశారా? మళ్లీ టీఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని ప్రశ్నించారు.
దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్ షా నిలదీశారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నోటి కొచ్చిన హామీ ఇవ్వడం, అమలు చేయకపోవడం కేసీఆర్ నైజమని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలనతో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని అమిత్ షా విమర్శించారు.