జగన్ రెడ్డి పాలనలో జనానికే కాదు .. దేవుళ్ళకూ వాతలే
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం, గడచిన మూడేళ్ళలో ఓ చేత్తో తాయిలాలు పంచుతూ మరో చేత్తో భారీగా వడ్డనలు సాగిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి, రెండు సార్లు కాదు, ఏకంగా ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచింది. మూడు సార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచింది. చివరకు బహుశా దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగనన్న సర్కార్ చెత్త పన్ను వేసి ‘చెత్త’ చరిత్ర సృష్టించింది.
ఇక మద్యం ధరల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఎన్నిసార్లు పెంచిందో, ఎంతెంత పెంచిందో లెక్కే లేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే బీరు ధర మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధికారులే చెపుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మద్యం పై వచ్చే ఆదాయం మూడేళ్ళలో నాలుగు రెట్లు పెరిగి రూ. 25,023 కోట్లకు చేరింది. అన్నిటినీ మించి అంచెల వారీగా మధ్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం, ‘ముందు’ చూపుతో మద్యం అదాయాన్ని రాబడిగా చూపించి, ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ద్వారా రూ. 8,300 కోట్లు అప్పు చేసింది. ఆ అప్పు, దానిపై వడ్డీ కట్టేందుకు 2025 సంవత్సరం వరకు ప్రజలు నిత్యం మద్యం తాగుతూనే ఉండాలి, అప్పు చెల్లిస్తూనే ఉండాలి.
అలాగే ప్రభుత్వం మరో రూ.25 వేల కోట్ల రుణం కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసే ఆలోచన చేస్తోంది. అది ఎంత వరకు వచ్చిందో ఏమో కానీ, అది కూడా కలిస్తే, మరి కొన్నేళ్ళపాటు, మందుబాబులు ప్రభుత్వాన్ని పోషించక తప్పదు. సరే ప్రజలను పీక్కుతింటున్నవైనం అట్లా ఉంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం దేవుళ్ళను కూడా వదిలి పెట్టడం లేదు. అఫ్కోర్స్ దేవుళ్లంటే అందరు దేవుళ్లు, అన్ని మతాల దేవుళ్ళు కాదు ఓన్లీ హిందూ దేవుళ్లు, దేవాలయాల ఆదాయం పైనే జగన్ రెడ్డి ప్రభుత్వం కన్ను పడింది. భక్తుల జేబుల కత్తిరించేందుకు సిద్దమైంది.
మద్యం ధరలు పెంచి, తాగుబోతుల సంఖ్యను తగ్గించామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, అదే విధంగా హిందువులు దేవాలయాల వైపు కన్నెత్తి చూడకుండా చేసేందుకా అన్నట్లుగా అర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ధరలను అడ్డగోలుగా పెంచుతోందని భక్తులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. కొద్ది రోజుల క్రితం కాణిపాకం వరరసిద్ధి వినాయకుని దేవాలయంలో నిత్యం జరిగే, పంచామృత అభిషేకం టికెట్ ధరను ఒక్క సారిగా, రూ. 750 నుంచి రూ.5000లకు పెంచారు. అయితే భక్తులు హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగడంతో, అబ్బే అదేమీ లేదు అలా పెంచితే ఎలా ఉంటుందని భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే బోర్డు పెట్టామని, అధికారులు సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే అధికారులు చెబుతున్నదే నిజం అయితే దేవాలయం ఈఓను ఎందుకు బదిలీ చేశారు అనే ప్రశ్నకు సమాధానం లేదు.
అదలా ఉంటే, ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సర్కార్ స్వాములు సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడంతో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనానికి దూరమవుతున్నారు. అయితే ఇది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం వస్తున్నదే అని భక్తులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. గత సంవత్సం దర్శనం టికెట్ ధరలు రూ.50, రూ.100 ఉండగా.. దసరాలో వీఐపీ టికెట్ అంటూ రూ.300 పెట్టారు.ఆ తర్వాత దసరా ముగిసినా.. టికెట్ మాత్రం తగ్గించలేదు. అంతరాలయం రూ.100 టికెట్‌ను రూ.300కు ఒకేసారి రెండు రెట్లు పెంచేశారు. రూ.50 టికెట్ తీసేసి.. రూ.100 చేశారు.
దానిపైనే తీవ్ర విమర్శలు రావడం, అప్పటి పాలకమండలి సభ్యులు సైతం వ్యతిరేకించడంతో ఇదిగో తగ్గిస్తాం.. అదిగో తగ్గిస్తామంటూ అప్పటి ఈవో కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.300 టిక్కెటే భారంగా మారిందని భక్తులు బాధపడుతుంటే, ఈ సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా టికెట్ ధరను ఏకంగా రూ.500కు పెంచేశారు. మరో వంక రూ.30 విలువ చేసే రెండు లడ్డూల ధరను ఒకేసారి రూ.200కు పెంచారు. అంటే భక్తులకు అమ్మ దర్శనమే కాదు, ప్రసాద భాగ్యం లేకుండా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి ఒక కాణిపాకం, ఒక విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం అని మాత్రమే కాదు, తిరుమల వెంకన్న దేవుడు మొదలు రాష్టంలోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయ వనరులుగానే చూస్తోందని, మరో వంక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల సహా అన్ని ప్రముఖ ఆలయాలలో అన్యమత జోక్యం పెరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ముడుపులు కట్టి స్వామి వారలకు సంర్పించుకుంటున్న కోట్లాది రూపాయల సొమ్ములను జగన్ రెడ్డి ప్రభుత్వం కొల్ల గొడుతోందని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. హిందూ ధార్మిక కార్యక్రమాలు, హిందూధర్మ ప్రచారం కోసం ఖర్చు చేయవలసిన స్వామి వారి సొమ్మును, అన్యమత ప్రచారానికి, పాస్టర్లు, ఇమాములలకు నెల జీతాలు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, తగ్గేదే ..లే అంటూ దేవుని సొమ్మును యదేచ్చగా కైంకర్యం చేస్తునే వుంది, గుడిని గుడిలో లింగాన్ని మింగే చర్యలకు పాల్పడుతోంది. అయితే ఏదో ఒక రోజు ఆ దేవునికే లెక్కలు చెప్పవలసి వస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు.