కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గుర్తింపు సాధ్యమేనా?
posted on Oct 10, 2022 @ 2:43PM
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అన్నారు అప్పట్లో శ్రీశ్రీ.. కొంచం అటూ ఇటూగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఇది వర్తిస్తుంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి కొత్త జాతీయ పార్టీ స్థాపించేశానని ఆయన సంబరపడిపోతున్నారు. సభలు చేసేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందే కానీ అది ఇంకా ప్రాంతీయ పార్టీయే. రంగూ, రుచీ, వాసనా అంతా ప్రాంతీయమే.
అసలు ముందుగా బీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బీఆర్ఎస్ పేరుతో రెండు రాజకీయ పార్టీలు రిజస్టర్ అయి ఉన్నాయి. వాటిలో ఒకటి బహుజన రాష్ట్ర సమితి(బీఆర్ఎస్). ఈ పార్టీ కేంద్ర కార్యాలయం వెస్ట్ మారేడ్ పల్లిలోని లలితా నగర్ లో ఉంది. బహుజన సమాజ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది. అలాగే దేశంలో బీఆర్ఎస్ పేరు మీద మరో పార్టీ కూడా రిజిస్టర్ అయి ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేర కేసీఆర్ స్థాపించిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తూ ఒక తీర్మానం ఆమోదించేసి.. గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపేయగానే పార్టీకి గుర్తింపు వచ్చేసినట్లు కాదని పరిశీలకులు అంటున్నారు.
తెరాస సర్వ సభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానం తో పాటు తెరాసను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ రాసిన లేఖను తీసుకుని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి హస్తిన వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించి వచ్చారు. బీఆర్ఎస్ విషయంలో ఇప్పటి వరకూ పడిన అడుగు ఇదొక్కటే. అంత మాత్రానే జాతీయ పార్టీ ఆవిర్బవించేసిందనీ, ఇక జాతీయ స్థాయిలో చక్రం తప్పిడమే తరువాయి అన్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న హడావుడి.. ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ఒక పార్టీ పేరు మార్చుకోవడానికి పెద్ద అభ్యంతరాలేమీ ఉండవని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ పేరు మార్పుతోనే జాతీయ గుర్తింపు వచ్చేసినట్లు కాదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ గుర్తింపు రావాలంటే అందుకు అవసరమైన ఓట్ల శాతం, సీట్ల సంఖ్య ఉండాలని అప్పుడే జాతీయ గుర్తింపు వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో మరో రెండు పార్టీలు ఉండటంతో కేసీఆర్ బీఆర్ఎస్ కు గుర్తింపు లభిస్తుందా అన్న విషయంలో తెరాస వర్గాలలో సైతం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అయితే పార్టీ పేరు వేరు, అబ్రివేషన్ వేరు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు అయితే లభించే అవకాశాలు లేవనీ, నిబంధనల ప్రకారం అన్ని పారామీటర్స్ కు అనుగుణంగా ఉంటేనే బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.