తాతా అమ్మమ్మ ఇక తన వెంటే!
posted on Oct 10, 2022 @ 12:50PM
జీతు తన లవర్ పేరు టాటూ వేయించుకున్నాడు, అమితా తన భర్తపేరుని, నాని వాళ్ల నాన్న పేరునీ టాటూ వేయించుకుని తెగమురిసిపోయారు..విట్జెల్ మాత్రం తన అమ్మమ్మతాతయ్యల పేర్లు వేయించు కుంది! అది తెలిస్తే మన దేశంలో ప్రభాస్, చింటూలు అబ్బే ఈ పిల్ల మన ఫ్రెండు కావడానికి అర్హురాలు కాదనే వారేమో! విట్జెల్ మాత్రం ఆ పెద్దవాళ్ల అపార ప్రేమను బహుమతిగా పొందింది.
ఇంట్లో తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్లూ ఉండవచ్చు. అందరితోనూ మంచి ప్రేమానుబంధాలూ ఉండవ చ్చు. కానీ ఎంతో జీవితానుభవం ఉన్న అమ్మమ్మతాతయ్యలతో స్నేహంగా ఉండేవారెందరు? ఈ ప్రశ్నకు చాలామంది హాల్లోనో, వేరే గదిలోనో పేపరు చదువుతూనో, టీవీ చూస్తూనో, కబర్లు చెప్పుకుంటూనో ఉండే పెద్దవాళ్లిద్దరు కనపడవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లతో అనుబంధం, స్నేహబంధం ఓ చిత్రమైన శక్తినిస్తుంద న్నది గ్రహించడం చాలా తక్కువమందిలోనే ఈ రోజుల్లో ఉంటోంది. ఇది ఓ సర్వే చెప్పిన సంగతి. సర్వే మాట ఎలా ఉన్నా వాస్తవంగానూ చిన్నపుడు తాత, అమ్మమ్మల సాంగత్యంతో పొందిన ఆనందం కేవలం నెమరేసుకునే జ్ఞాపకం మాత్రమే కాదు..అది పురాతన ఫోటో చెప్పే కథలసారం.
ఇంట్లో పెద్దవాళ్లు వేరే లోకంలో ఏమీ ఉండరు.. మీతోనే కలవాలని పిల్లలు అనుకోవాలి..అనుకుంటున్న వారు ఎంతమంది అనే ప్రశ్న తలెత్తుతోంది. పిల్లలకు వారి అనుభవాల వివరాలు వారు చెప్పే విధానాలు ఎంతో నేర్పుతాయన్నది ఖాయం. ఒక్కసారి ఆ లోకంలోకి వెళితే బావుంటుంది. ఎంతో ఆనందాన్నిస్తుంది, అంతకు మించి ఎన్నో రెట్ల ప్రేమని పంచుతుంది. వీటికి అగస్టినా వెట్జల్ ఓ ఉదాహరణ!
అవును ఆమె తన అమ్మమ్మ తాతల ప్రేమ నిత్యం టాటూగా ఉండాలన్న ఆలోచన చేసింది. మామూలుగా అడిగితే, అదేవిటే పిచ్చి ఆలోచనా అంటారని అనుకుంది. అందుకే వారితో చిన్న అబద్ధమాడింది. యూనివర్సిటీలో ప్రాజెక్టు వర్క్ కోసం అక్కడి అధికారులు అడిగారని వారి పేర్లు రాసిమ్మని కాయితం ఇచ్చిందిట. వారు సంతకాలు చేసిచ్చారు. అంతే ఈమె వెంటనే టాటూ దుకాణానికి వెళ్లి చేతిమీద టాటూ వేయించుకుంది!
దాన్ని చెరపలేరు, చెరపమని అడగనూ లేరు.. అప్పటికీ కోపగిస్తే రెండు రోజులు కనపడకుండా తిరగ డమే అనుకుంది. ఆ ముచ్చటా అయింది. ఆనక పెద్దవాళ్లిద్దరూ మనవరాలి తెలివికి మెచ్చుకుని నవ్వుకు న్నారు. పిలిచి మొట్టికాయ వేసి భడవా! అన్నారంతే. ఆమె మనసులోకి కొండంత ప్రేమ ఇంకింది!