అమెరికా వెళ్లిన కల్వకుంట్ల కవిత.. కారణమిదేనా?
posted on Oct 10, 2022 @ 2:55PM
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హఠాత్తుగా అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం రాత్రి ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వినామనం ఎక్కారు. ఇంత హఠాత్తుగా కవిత అమెరికా పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాలలో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తన నాటి నుంచి ఆమె ప్రతి అడుగూ, ప్రతి చర్యా ఆమె ఒకింత గందరగోళంలో ఉన్నట్లు తేటతెల్లం చేస్తూనే ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పిన ఆమె ఆ తరువాత కోర్టుకు వెళ్లి పరువునష్టం దావా వేయకుండా తనపై ఎవరూ ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ తరువాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కూడా ఒక దశలో వార్తలు వినవచ్చాయి. అయితే వాటిని కవిత ఖండించారు. అయితే ఆమె సన్నిహితులకు ఈడీ నోటీసులు జారీ చేయడమే కాకుండా వారి నివాసాలలో సోదాలు కూడా నిర్వహించింది.
అదలా ఉంచితే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి తెలంగాణలో తొలి అరెస్టు జరిగింది. అదీ కవితకు సన్నిహితుడిగా చెప్పే బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ సోమవారం ( అక్టోబర్ 10) అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అభిషేక్ ను అరెస్టు చేసిన సీబీఐ ఆయనను ఢిల్లీకి తరలించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ, సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత హఠాత్తుగా అమెరికా వెళ్లడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అదీ బోయిన పల్లి అభిషేక్ అరెస్టుకు ఒక రోజు ముందే ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈడీ, సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకే ఆమె చెప్పా పెట్టకుండా అమెరికా పర్యటన పెట్టుకుని దేశం విడిచి వెళ్లారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
ఈ నేపథ్యంలోనే అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. అలాగే ఇప్పటికే హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ లోని ఒక రెసిడెన్సీలో నివాసం ఉంటున్ కవిత వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే కవిత అమెరికా యాత్ర పట్ల రాజకీయవర్గాలలో సందేహాలూ, అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.