ముఖ్యమంత్రా, రాక్షసుడా?.. జగన్ పై చంద్ర నిప్పులు

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడినీ, ఆయన కుమారుడినీ అరెస్టు పేర ఈడ్చుకుంటూ వెళ్లడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. జగన్ ముఖ్యమంత్రా, రాక్షసుడా అంటూ ఫైర్ అయ్యారు. గోడలు దూకి, తలుపులు పగులగొట్టి మాజీ మంత్రిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ తీరులో ఒక బీసీ నాయకుడిని అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (నవంబర్ 3)న విలేకరుల సమావేశంలో చంద్రబాబు జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని వేధింపులతో వెంటాడుతోందని విమర్శించారు.  ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు...అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.   వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అక్రమం గా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.

హద్దుమీరిన ఆకతాయితనం

స్నేహితులు సరదాగా మాటలు అనుకోవచ్చు, కొట్టుకోవచ్చు.  సరదాలు పట్టించడానికి కూడా ఒక హద్దు ఉంటుందనేది ఈరోజుల్లో కుర్రాళ్లకు చెప్పలేని ఆకతాయితనం గమనిస్తున్నాం. చిన్నపాటి సరదాలు కొట్లాట్లకు, ప్రమాదాలకు  దారి తీస్తున్నాయి. మొన్న దీపావళి రోజున ఓ కుర్రాడు టపాసును తన స్నేహి తుడి మర్మాంగం దగ్గర పెట్టి కాల్చాడు.  ఆ  కుర్రాడు గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. ఇంతటి దారుణం సరదా ఎలా అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కుర్రాళ్లు ఇంతటి అన్యాయమయిన వికృత చేష్ట లను సరదా అని ఎలా అనుకుంటారో తెలీదు. అదే తీవ్ర గాయాలయి మరణిస్తే ఏమయ్యేది అనే ఆలోచనతో ఇప్పుడు భయపడవచ్చు.  ఉత్తరప్రదేశ్ భిషన్పురా కి చెందిన కుర్రాడు తన స్నేహితులతో  కలిసి దీపావళి  టపాసులు కాల్చ డంలో  ఎంతో సరదాగా గడుపుతున్నాడు. అంతా  కేరింతలు, ఆనందం .. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ  వారిలో ఎవరికో ఒక ఛండాలమైన ఆలోచన వచ్చింది. వెంటనే ఒక టపాసును బిషన్ పురా కుర్రాడి మర్మాంగం దగ్గరగా పెట్టే కాల్చాడు.  ఆ కుర్రాడు విపరీత గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇది తెలు సుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. వారు బిషన్ పురాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మేడ్చల్ పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయమై దర్యాప్తు చేయమని కోరారు. పోలీసులు ఆ పనిలో పడ్డారు.  పిల్లలు పిల్లల్లా ఉండాలి, స్నేహంతో సరదాల కంటే ఇలాంటి వెర్రి వేషాలు ఎంతో ప్రమాదకరం.  వారికి ప్రమాదాల తీవ్రత తెలియకపోవడమేకాదు, కనీసం కామన్ సెన్స్ లేకుండా ఉండడమే ఆశ్చర్యకరం. చదువులు, తల్లిదండ్రుల భయం లేకపోతే పిల్లల ఆకతాయితనానికి అంతే ఉండదు. 

తెలుగుజాతి సంతకాన్ని చెరిపేసే ప్రయత్నం!?

ఏపీలో తెలుగుజాతి సంతకం ఎన్టీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నానికి జగన్ సర్కార్ తెరలేపిందా? అంటే ఔననే సమాధానమే వచ్చేలా పరిస్థితులు ఉన్నాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేసిన జగన్ రెడ్డి.. ఆ మార్పునకు గవర్నర్ ఆమోదముద్ర పడీ పడటంతోనే వర్సిటీలో ఎక్కడా ఎన్టీఆర్ ఆనవాలే లేకుండా చేసేశారు. చివరాఖరికి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించేసి ఆ స్థానంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు శరవేగంగా ప్రారంభమైపోయాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించిన క్షణం నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరికి ఈ నిర్ణయంపై సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమైనా జగన్ ఖాతరు చేయలేదు. మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేసి తీరాల్సిందేనని భీష్మించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఆయనే కర్త, కర్మ, క్రియగా ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించాలన్న నిర్ణయం తీసుకోవడమే దారుణమని జనం భావిస్తుంటే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదముద్ర ఇలా వచ్చీ రావడంతోనే రాత్రికి రాత్రి యూనివర్సిటీ మొత్తం ప్రాంగణంలో ఎక్కడా ఎన్టీఆర్ పేరు కనిపించకుండా చెరిపేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అన్న పేరు ఉన్న బోర్డు రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఆ స్థానంలో వైఎస్సార్ హెల్త్ వర్సిటీ అన్న బోర్డు వెలిసింది. అలాగే వర్సిటీ వెబ్ సైట్లలోనూ రాత్రికి రాత్రే పేరు మారిపోయింది. ఇక శిలాఫలకాల మీద, లెటర్ హెడ్ లమీద కూడా రాత్రికి రాత్రి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు వచ్చి చేరింది.కొత్తగా  డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ అన్న డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. వర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేసి ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించేశారు. సాధారణంగా ఎవరూ ఉన్న విగ్రహాన్ని తొలగించి వేరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయరు. ఉన్న విగ్రహాన్ని అలాగే ఉంచి.. ఆ పక్కనో, లేదా కొంచం దూరంగానో వేరేవారివిగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ జగన్ సర్కార్ రూటే సెపరేటు. మహనీయుల పట్ల సర్కార్ కు గౌరవం లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న జంకు లేదు. మూర్ఖత్వమో మరొకటో తెలియదు కానీ.. సర్వ విలువలకూ, సంప్రదాయాలకూ తిలోదకాలిచ్చేసైనా సరే తాము అనుకున్నది చేసేయడమే అన్నది జగన్ సర్కార్ తీరుగా మారిపోయింది. వైపరీత్యం కాకపోతే.. వైసీపీ సర్కార్ వర్గాలు ఇప్పటి వరకూ వర్సిటీ పేరు మీద జారీ అయిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసి.. వాటి స్థానంలో వైఎస్సార్ హెల్త్ వర్సిటీ పేరుమీద వాటిని మళ్లీ జారీ చేస్తామని చెబుతున్నారని తెలుస్తోంది. అయితే ఇందుకు మెడికల్ కౌన్సిల్ అనుమతిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

రాణూ... వదిలి వెళిపోయావా!

పిల్లలతోపాటు పిల్లినో, కుక్కనో పెంచుకోవడం చాలామందికి సరదా. కానీ చాలా గ్రామాల్లో గేదెల్ని, ఆవుల్ని కూడా తమ సంతానంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. వాటితో పనిచేయించుకోవడమే కాకుండా వాటి నుంచి లబ్ధి పొందడమే కాకుండా వాటి సంరక్షణ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుం టూంటారు. దానికి ఏ మాత్రం ఆరోగ్యం సరిగా లేదని తెలిసినా వెంటనే సంబంధిత డాక్టర్ ని పిలిపించ డమూ వైద్యం చేయించడంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. వాటికి పండగల్లో బొట్లు పెట్టి పూజలు చేయడం అన్నీ మామూలే.  అలా సొంత బిడ్డలా చూసుకుంటూండడంలో వాటికీ ఆ యజమాని పట్ల ఏర్పడే బంధం కూడా చిత్రంగా ఉంటుంది. ఆయనో లేదా ఆ యింటివారు కాకుండా ఎవరు దగ్గరికి వచ్చినా అంగీకరించదు. పొడవ డానికి ప్రయత్నిస్తుంది. యజమాని పక్కనే ఉంటే చాలా మంచిగా వ్యవహరిస్తుంది. ఇదేనా నిన్న పొడవ బోయింది అనిపిస్తుంది. అదుగో అంతగా ఉండే బంధం తెగిపోతే యజమానితో పాటు ఆయన తోటివారు, చుట్టుపక్కలవారూ ఎంతో బాధపడతారు.   మధ్యప్రదేశ్ షాజాన్ పూర్ కి ఛెందిన భన్వర్ గత ఇరవయ్యేళ్లుగా ఒక ఆవును పెంచుకుంటున్నాడు. దానికి రాణూ అని పేరు పెట్టి పిలుస్తుండేవాడు. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. మొన్న హఠాత్తుగా ఆ రాణూ మరణించింది. భన్వర్ దుఖానికి అంతులేదు. ఇన్నాళ్లూ తనకు తోడుగా ఉన్న రాణూ మర ణించిందని తెగ బాధపడ్డాడు. దాని అంత్య క్రియలు ఊరి వారంతా కలిసి ఎంతో ఘనంగానే చేశారు. ఏకంగా ఇరవై చీరలు దాని పై కప్పి ఘనంగా ఊరేగిస్తూ తీసికెళ్లారు. రాణూ గురించి ఇక భన్వర్ కి ఉంది చిన్నపాటి గుర్తులే. వాటినే అందరితో ప్రస్తుతం పంచుకుంటున్నాడు,    

ఇంకా పాదయాత్రలు, గర్జనలు ఎందుకు?.. హైకోర్టు వ్యాఖ్య

అమరావతే ఏపీ రాజధాని అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విస్పష్టంగా తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఇంకా పాదయాత్రలు, గర్జనలు ఎందుకని హైకోర్టు వ్యాఖ్యానించింది. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ రైతాంగ సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అమరావతి రాజధాని కావాలంటూ రైతులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారని, కర్నూలులో హైకోర్టు కావాలని అక్కడ వాళ్లు చేస్తున్నారని, విశాఖలోనూ గర్జనలు చేస్తున్నారని.. తీర్పు తరువాత కూడా ఇవన్నీ ఎందకు జరుగుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.   రాజధాని అమరావతేనని తీర్పు ఇచ్చిన తరువాత కూడా  ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని, కర్నూలులో ర్యాలీలను ప్రోత్సహిస్తోందని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత, మూడు రాజధానులకు అనుకూలంగా, మరోవైపు అమరావతికి అనుకూలంగా యాత్రలు, గర్జనలు  సరికాదని వ్యాఖ్యానించింది.  అంతే కాకుండా  దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్ ను పరిశీలించాలని నిర్ణయించింది. మరో వైపు అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని   నిర్ణయించినట్లు  ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. రైతులు షరతులు ఉల్లంఘిస్తున్నందునే పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని.. ఆ పిటిషన్ లో డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. 

జనసేనాని పవన్ హత్యకు కుట్ర.. నివాసం వద్ద రెక్కీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా? ఇందు కోసం ఆయన నివాసం వద్ద రెక్కీ జరిగిందా అంటే ఔననే అంటున్నారు ఆయన రక్షణ సిబ్బంది. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో పవన్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద మంత్రుల వాహనాలపై దాడి సంఘటన అనంతరం పవన్ పై హత్యకు కుట్ర పన్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఘటన తరువాత జపనసేన కార్యాలయం వద్ద కూడా అనుమానాస్పద వ్యక్తులు సంచరించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.   తాజాగా   పవన్​ నివాసం వద్ద కొందరు యువకులు సోమవారం అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారనీ, ప్రశ్నించిన రక్షణ సిబ్బందిని దూషించి గొడవపడ్డారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసినట్లు చెప్పారు.   పవన్​   రాకపోకలను గమనిస్తూ కారు, బైక్ లపై ఫాలో అవుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ నివాసం వద్ద బందోబస్తును పోలీసులు పటిష్ఠం చేశారు. 

నా హత్యకు కుట్ర..ఈటల ఆరోపణ

ఈటల రాజేందర్ పై హత్యాయత్నం జరిగిందా.. మునుగోడులో ఈటల కాన్వాయ్ పై దాడి అదేనా? అంటు బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఔననే అంటున్నారు. తనపై హత్యకు కుట్ర జరిగిందనీ, మునుగోడులో తనపై పక్కా ప్రణాళిక మేరకే దాడి జరిగిందనీ ఆయన ఆరోపించారు. తనకు ఏం జరిగినా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. తనను హత్య చేయాలని కుట్ర జరుగుతోందనీ, అందుకే హుజురాబాద్ లో అవసరం లేకున్నా పెద్ద సంఖ్యలో గన్ లైసెన్సులు ఇచ్చారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తాను  గెలిచినప్పటి నుంచీ కేసీఆర్ తనపై పగబట్టారని ఈటల అన్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో మరోసారి టీఆర్ఎస్ ఘోరంగా పరాజయం పాలు కాబోతున్నదని ఈటల అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అర్దరాత్రుళ్లు కూడా నిర్భయంగా బయట తిరిగే వాళ్లమనీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పట్టపగలు బయటకు వెళ్లి తిరిగి వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందనీ ఈటల అన్నారు.   పథకం ప్రకారం తన కాన్వాయ్ పై దాడి చేశారనీ,  పలివేల గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారనీ ఈటల పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏమి చేస్తోందని నిలదీశారు. 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో పాటూ కుమారుడు అరెస్ట్

 తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు గురువారం (నవంబర్3) తెల్లవారుజామున అరెస్టు చేశారు. నర్సీపట్నంలో అయ్యన్నతో పాటూ కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు  సెక్షన్ సీఆర్పీసీ 50ఎ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు గా పేర్కొంటూ  నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇరువురినీ గురువారం (నవంబర్ 3)ఏలూరు కోర్టులో హాజరుపరుస్తారు. వీరిరువురిపైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు దొంగల్లా గోడ దూకి దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారనీ, తలుపులు పగులగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నించారనీ అయ్యన్న పాత్రుడి కోడలు, రాజేష్ భార్య పద్మావతి ఆరోపించారు. తన భర్త రాజేష్ తలుపులు తీసి ఎందుకు వచ్చారని ప్రశ్నిచారనీ, అయితే అందుకు సమాధానం చెప్పకుండా ఈడ్చుకుపోయారనీ ఆమె ఆరోపించారు. తెల్లవార జామున తమ నివాసంపై దాడి చేసిన పోలీసులు తాగి ఉన్నారనీ, దుర్భాషలాడారని ఆమె పేర్కొన్నారు. తన భర్త రాజేష్, మామ అయ్యన్న పాత్రుడులను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్టు చేశారని ఆమె పేర్కొన్నారు. గతంలో అయ్యన్నపాత్రుడి నివాసం దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం రేగిన సంగతి విదితమే. అయ్యన్న పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. అనంతరం హైకోర్టులో పిటిషన్ వేయగా అయ్యన్న కుటుంబానికి ఊరట దొరికింది. మళ్లీ అదే కేసులో ఫోర్జరీ డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారనే అభియోగాలపై ఇప్పుడు అయ్యన్నపాత్రుడితో పాటూ ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

తీవ్ర అనారోగ్యానికి గురైన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి బుధవారం (నవంబర్ 2) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. నంద్యాల జిల్లాలోని అవుకులోని తన స్వగృహంలో ఆదివారం చల్లా భగీరథరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర మైన దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులకు గురైన చల్లా భగీరథరెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూశారు. భగీరథరెడ్డి మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన రాజకీయ వారసుడిగా భగీరథరెడ్డి తెరపైకి వచ్చారు. వైసీపీ ఆయనను తండ్రి స్థానంలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.

వర్షం తో  ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్ లో భారత్ విజయం

చివరి ఓవర్ వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్  చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నంతగా సాగింది. చివరి రెండు ఓవర్లలో బంగ్లాను పరుగులు పెద్దగా చేయకుండా భారత్ బౌలర్లు నిలువరించడంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం మాత్రం మంచి పట్టుగా సాగుతున్న మ్యాచ్ కి వర్షం పెద్ద గండంగా మారింది. బుధవారం మొదటి మ్యాచ్ సమయానికి వర్షం లేకపోవడంతో ఈ రెండో మ్యాచ్ ఎలాంటి అవాంతరం లేకుండా సాగుతుందనే అనుకున్నారు. కానీ  బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం తో కొంత సమయం ఆట నిలిపివేయవలసి వచ్చింది. భారత్ తమ ఇన్నింగ్స్  లో కోహ్లీ, సూర్యకుమార్ ధనాధన్ బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 184 పరుగులు చేసి బంగ్లాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టారు. కానీ వర్షం పడిన కారణంగా బంగ్లాదేశ్ లక్స్యం 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యం విధించారు.   కానీ  ఊహించిన దానికంటే బంగ్లా ఓపెనర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లింటన్ దాస్ భారత్ పేసర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతను కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ చేయడంలో అతని బ్యాటింగ్ సత్తాను రుజువుచేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిన సమయానికి బంగ్లాదేశ్ డి ఎల్ ఎస్ విధానానికి మౌలిక రన్ రేట్ కి 17 పరుగులు ముందంజలో నిలిచింది.  మ్యాచ్ మళ్లీ ఆరంభమయ్యే సమయానికి బంగ్లా 9 ఓవర్లలో 85 పరుగులు చేయలసి వచ్చింది. అంటే రన్ రేట్ 9.44 ఉంది. 8 ఓవర్లో అశ్విన్ బంతిని మిడ్ వికెట్ లోకి అవతలి బ్యాటర్ శాంతన్ ఫోర్ కోసం షాట్ కొట్టాడు. కానీ అక్కడ రాహుల్ బంతిని అందుకుని చక్కటి త్రో చేశాడు. అది నేరుగా స్టంప్ కి తగలడంతో పరుగు కోసం బోర్లా పడిన లిటన్ దాస్ వెనుదిరగాల్సి వచ్చింది. అలా లిట్టన్ దూకుడికి కళ్లెం పడింది.  లిట్టన్ దాస్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 60 పరుగులు చేశాడు. తొలి ఓవర్లలో సరిగా ఆకట్టుకోలేకపోయిన అర్ష్ దీప్ 12 వ ఓవర్లో అద్భుతంగా చేసి కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో అప్పటికే మంచి ఫామ్ లో ఉండి స్కోర్ చేయగల సత్తా ఉన్న షకీబుల్ ను పెవిలియన్ దారి పట్టించడం ఎంతో హర్షణీయం. అప్పటికి అతను 2 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినట్టయింది.  కింగ్ కోహ్లీ మళ్లీ మెరుపులు మెరిపించాడు. బుధవారం గ్రూప్ 2 లో బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 12 విభాగం నాలుగో మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ కి  కోహ్లీ దారులు వేశాడు.  టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ కు ముందుగా బ్యాట్ చేసే అవకాశం ఇచ్చాడు.  భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  భారత్ తొలి దశలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ నుంచి ఈమ్యాచ్ లో మంచి స్కోర్ అభిమానులు ఎంతో ఆశించారు. రోహిత్ 2 పరుగులకే ఔట్‌గా వెనుదిరిగాడు. హసన్ మహ్ముద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి యాసిర్ అలీకి రోహిత్ క్యాచ్‌గా చిక్కడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ నిలదొక్కుకుని మిడిలార్డర్‌పై భారం పడకుండా చూడాల్సిన మ్యాచ్‌లో రోహిత్ పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు. రోహిత్ పెవిలియన్ చేరగానే రంగంలోకి దిగిన కోహ్లీ  అప్పటికే నిలకడగా ఆడుతున్న కె.ఎల్.రాహు ల్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టడంతో పాటు స్కోర్ ను పరుగులెత్తించాడు.  వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.  కానీ వెంటనే వెనుదిరిగాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ దూకుడుగా ఆడుతున్న సూర్యను షకీబ్ అల్ హసన్ ఔట్ చేశాడు. అప్పటి వరకూ కోహ్లీ తో కలిసిన యాదవ్ ధాటికి బంగ్లా బౌలర్లు దాసోహం పలికారనే అనాలి. కింగ్ 44 బంతుల్లో 64 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు.  అడెలైడ్ లో మ్యాచ్ కి వరుణుడి గండం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ వరుణుడి కంటే బంగ్లాను కోహ్లీయే భయపెట్టాడు. అతని ధాటికి బౌలర్లు బెంబేలెత్తారు. ఆసీస్ లో మొన్నటి హోటల్ సంఘటన అతని మీద ఎలాంటి ప్రభావం చూపలేదనే అనాలి. ఆట, జట్టును గెలిపించడం మాత్రమే ప్రధానంగా తీసుకోవడాన్ని తన పరుగులవరదతో తెలియ జేశాడు.   ఈ మ్యాచ్ కి రెండు జట్లలోనూ మార్పులు చేర్పులు జరిగాయి. దీపక్ హుడా స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి అవకాశం కల్పించారు. అయితే ఈ మ్యాచ్ లోనయినా అవకాశం ఇస్తారనుకున్న కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ని మాత్రం మళ్లీ బెంచ్ కే పరిమితం చేశారు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతున్న కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కోలుకున్నాడని, అతని అవసరం గుర్తించి పంత్ కు సారీ చెప్పారు. ఈ పర్యాయం ప్రపంచకప్ పోటీల్లో వరుసగా నాలుగో మ్యాచ్ లో పంత్ బెంచ్ కే పరిమితం చేయడం పంత్ వీరాభిమానులు ఎంతో నిరాశచెందారు.  కోహ్లీ రాహుల్ కలిసి 25 బంతుల్లో 38 పరుగులు, ఆ తర్వాత కోహ్లీ కార్తిక్ 12 బంతుల్లో 20 పరుగులు, చివర్లో కోహ్లీ అశ్విన్లు 11 బంతుల్లో 27 పరుగులు చేశారు. అదే బంగ్లా ఇన్నింగ్స్ లో లిట్టన్ దాస్, హసన్ లు మొదటి వికెట్ కి 44 బంతుల్లో 66 పరుగులు చేశారు. 

విశాఖ రాజధానికి మద్దతుగా తీర్పులు.. న్యాయమూర్తులకు తమ్మినేని వినతి

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు రాజధానితోనే చెక్ పడుతుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.  ఏపీకి ఏకైక రాజధాని విశాఖే అని మంత్రి ధర్మాన అన్నమాటలనే ఇప్పుడు తమ్మినేని మరో డిక్షన్ తో చెప్పారు. మూడు రాజధానులంటూ ఇంత కాలం వైసీపీ సర్కార్ ఆడిందంతా డ్రామానే అని మరో సారి చెప్పకనే చెప్పాశారు. అంతే కాకుండా ఒక  అడుగు ముందుకు వేసి విశాఖ రాజధానికి అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వాలని బహిరంగ విజ్ణప్తి కూడా చేసేశారు. ఇప్పటికే మూడు రాజధానులు కాదు విశాఖే ఏకైక రాజధాని అని ధర్మాన వరుస ప్రకటనలు చేయగా, అందకు తగ్గట్టుగానే తాను ఎక్కడ నుంచి పాలన చేస్తే అదే రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇప్పుడు అదే బాటలో తమ్మినేని సీతారాం కూడా చేరాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వసలలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ రాజధాని సాధన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బుధవారం (అక్టోబర్2) ఆయన మాట్లాడారు. విశాఖపట్నం రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోయి అభివృద్ధి చెందుతుందని తమ్మినేని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని గమనించినందువల్లే జగన్ అధికార వికేంద్రీకరణ అంటున్నారని పేర్కొన్నారు. ఇంత కాలం మూడు ప్రాంతాలకూ ఒక్కో రాజధాని అంటూ వచ్చిన వైసీపీ ఇక ముసుగు పూర్తిగా తొలగించేసింది. ఒకే రాజధాని అదీ విశాఖే అంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులు ఒకరి తరువాత ఒకరుగా చెబుతున్నారు. అమరావతి రాజధాని కోసం అంటూ 30 వేల ఎకరాల సమీకరణ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని తమ్మినేని విమర్శలు గుప్పించారు.  ఈ విషయాన్ని గుర్తించి ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

లోకం గెలిచిన వీరుడు..కోహ్లీ!

కింగ్ కోహ్లీ బుధవారం మ్యాచ్ లో గొప్ప రికార్డు నెలకొల్పాడు. ఐసిసి టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన సూపర్ బ్యాటర్ గా నిలిచాడు. బంగ్లా తో జరుగుతున్న మ్యాచ్ లో తన వ్యక్తి గత స్కోర్ 16 దాటగానే ఆ అద్బుత రికార్డు నెలకొల్పిన సూపర్ ఫాస్ట్ బ్యాటర్ గా అందరి మన్ననలు అందుకున్నాడు. కింగ్ ఆల్వేస్ కింగ్ అనిపించు కున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని విధంగా పెవిలియన్ చేరగానే కింగ్ రంగంలోకి దిగాడు.  వస్తూనే ధాటిగా బ్యాట్ చేస్తూ స్కోర్ పరిగెత్తించాడు. తన మహత్తర బ్యాటింగ్ సత్తా ప్రదర్శించడంలో కోహ్లీ అన్ని వత్తి డులను  అధిగమించాడు. ప్రపంచ కప్ లో  రికార్డు పరుగుల ప్రయాణంలో లంక మాజీ కెప్టెన్ మహెలా జయవర్దనే  ని అధిగమించాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లో 1,016 పరుగులు చేశాడు. కోహ్లీ ఆ రికార్డును తన 25 వ ఇన్నింగ్ లోనే అధిగమించి కింగ్ అనిపించుకున్నాడు. 2014, 2016 ప్రపంచకప్ పోటీల్లోనూ కోహ్లీ తన సత్తా రుచుచూపిన సంగతి తెలిసిందే. 2014 కప్ లో అత్యధిక పరుగులు తీసిన బ్యాటర్ గా నిలిచాడు. అప్పటి 316 పరుగుల స్వైర విహారంతో భారత్ ను ఫైనల్స్ తీసికెళ్లాడు. కానీ ఫైనల్లో లంక చేతిలోనే ఓడిపోయింది.  2016లో అత్యధిక పరుగులుచేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ప్రస్తుత రికార్డు ప్రదర్శన  అతని కెరీర్ లో మరో మైలు రాయిగా  నిలుస్తుంది. కోహ్లీ అద్బుత రికార్డు సాధన పట్ల బీసీసీ ఐ శుభాకాంక్షలు తెలిపింది. 

వైఎస్ఆర్ అవార్డులు.. సొమ్మొకరిది.. ప్రచారం వేరొకరిదీనా!?

చేసే ప్రతి పనిలోనూ తాము రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకునే నాయకులు అధికారంలో ఉంటే ఇలా కాకుండా ఇంకెలా జరుగుతుందనే విమర్శలు రావడం సహజం. తాత్కాలికంగా అయినా తమకు ప్రయోజనమే కలగాలని నేతలు కోరుకునే తీరును పలువురు వేలెత్తి చూపిస్తుంటారు. ఇలాంటి స్వార్థపూరిత చర్యకు జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ పాల్పడిందంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ పేరు మీద జగన్ సర్కార్ ఇచ్చిన అవార్డుల వ్యవహారం చూస్తే.. ఇలాంటి రాజకీయ ప్రయోజనమే చూసుకున్నట్లు అర్థం అవుతోందంటున్నారు. సొమ్మేమో రాష్ట్ర జనానిది.. ప్రచారం మాత్రం వైఎస్సార్ కా అని ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఇన్ స్టెంట్ రాజకీయ ప్రయోజనాల కోసం తపించే రాజకీయ నేతల్లో ఏపీ సీఎం జగన్ కూడా నిలుస్తారని చెబుతారు. జగన్ రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తారు. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. గడచిన మూడున్నరేళ్ల పాలనలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పుకుంటారాయన. అయితే.. రాష్ట్రానికి శాశ్వత మేలు చేకూర్చే ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన పూర్తి చేయని వైనాన్ని జనం ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటున్నారు. అవార్డు కోసం ప్రభుత్వం ఎవరినైనా ఎంపిక చేసిందంటేనే అది ఆయా వ్యక్తుల సేవలకు ఇచ్చే గౌరవంగా భావిస్తారు. అదే తమకు ప్రభుత్వం చేసే ఎనలేని సత్కారం అనుకుంటారు. భారత రత్న, పద్మ అవార్డులు, సైన్యంలోని వీరులకు ఇచ్చే గ్యాలంటరీ అవార్డులు, శాంతిస్థాపన కోసం చేసే ఎనలేని కృషికి ఆయా వ్యక్తులకు ఇచ్చే గాంధీ పీస్ అవార్డు ఇలాంటివే. ఆయా అవార్డులకు ఎంపిక అవడమే కోట్లు ఇచ్చినా రానంత గుర్తింపు వస్తుంది. అంతలా గుర్తింపు లభిస్తుంది కనుకే.. ఆయా అవార్డులకు ఎంపికైన వారికి ప్రభుత్వం భారీగా నగదు పారితోషికాలు అందించదు. నగదు కన్నా గుర్తింపే ఎంపికైన వారికి అత్యంత ప్రధానం. కానీ.. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల పేరుతో సీఎం జగన్ ఇలాంటి సాంప్రదాయాన్ని పూర్గిగా మార్చేయడం విమర్శలకు చోటు ఇచ్చినట్లు అయిందని పెద్దలు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ప్రదానం చేసింది. అయితే.. తన తండ్రి పేరిట ఇచ్చే ఈ అవార్డులకు పెద్దగా గుర్తింపు తీసుకు రావడం కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం విమర్శలకు దారితీస్తోంది. దాంతో పాటు ఏ అవార్డుల ప్రదానంలోనూ జరగని విధంగా పెద్ద మొత్తంలో నగదు పారితోషికం కూడా ఇవ్వడాన్ని జనం వేలెత్తి చూపుతున్నారు. నిజానికి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళా రంగానికి సంబంధించి నంది అవార్డులు ఇచ్చేవారు. అయితే.. తాను సీఎం అయినప్పటి నుంచీ నంది అవార్డులను పక్కన పెట్టేశారు. కానీ తన తండ్రి పేరు మీద ఇచ్చే వైఎస్ఆర్ అవార్డులకు మాత్రం భారీ ఎత్తున గుర్తింపు, ప్రచారం తేవడం కోసం పెద్ద మొత్తంలో నగదు పారితోషికాలు అందజేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్కో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతకు 10 లక్షలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ రెండు కేటగిరీలకు కలిపి మొత్తం 35 మందికి అవార్డులు ఇవ్వడమే కాకుండా.. పారితోషికంగా 3 కోట్ల రూపాయలకు పైగానే అందజేయడం గమనార్హం. దాంతో పాటు తన సొంత మీడియాతో పాటు తన అనుకూల మీడియాలో ప్రకటనల కోసం మరో మూడు కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఖర్చంతా ప్రభుత్వ ఖాతా నుంచి ఇవ్వడం, తద్వారా స్వప్రయోజనానికి వినియోగించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అసలే ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుల్లో ఉంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఈ సమయంలో దగ్గరదగ్గర ఆరు కోట్ల రూపాయల్ని వైఎస్సార్ అవార్డుల పేరిట ఖర్చు చేయడం తీవ్రమైన చర్య అని జనం భావిస్తున్నారు. అవార్డుల్ని కూడా ‘నగదు పంపిణీ స్కీం’గా మార్చేసిన జగన్ తీరును చూసి  ఔరా! ఎంత బరి తెగింపు అని ప్రజాసంఘాలు అవాక్కవుతున్నాయి.

రాహుల్ పాదయాత్రలో తొక్కిసలాట.. మహామాజీ మంత్రికి గాయాలు

రాహుల్ గాంధీ పాదయాత్రలో తొక్కిసలాట జరిగింది. హైదరాబాద్ నగరంలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా చోటు చేసుకున్న స్వల్ప తొక్కిసలాటలో మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. హైదరాబాద్ లో రెండో రోజు పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం (అక్టోబర్ 2) గాంధియన్ ఐడియాలజీ సెంటర్ నుంచి ప్రారంభమైంది. \రాహుల్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చసేందుకు జనం పోటీలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో జనం రాహుల్ గాంధీతో అడుగు కలిపి నడిచేందుకు ఉత్సాహపడుతున్నారు. యాత్ర ఉత్సాహంగా సాగుతూ కుకట్ పల్లి చేరుకుంది. అక్కడ ఓ కేఫ్ లో టీ తాగిన రాహుల్ విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు. మదీనా గూడెంలో లంచ్ విరామం తీసుకున్నారు. రాత్రికి ముత్తంగి చేరుకుంటారు. కాగా ఈ పాదయాత్రలో పాల్గోన్న మహారాష్ట్ర మాజీ సీఎం నితిన్ గౌర్ తొక్కిసలాటలో చిక్కుకుని గాయపడ్డారు.   రాహుల్‌ తో కలిసి నడుస్తుండగా జరిగిన తోపు లాటలో..  రౌత్ గాయపడ్డారు. ఆయన కంటికి, చేతులు, కాళ్లకు  గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రేష్మానీని వెతికిచ్చిన ఆధార్

ప్రతీదానికి ఆధార్ కార్డు అడుగుతున్నారని విసుక్కుంటాం గాని అదే ఆధార్ కార్డు రేష్మానీని తనవారి వద్దకు చేర్చడా నికి ఉపయోగపడింది. వినడానికి చిత్రంగా ఉండవచ్చు గాని, ఇది వాస్తవం. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన రేష్మానీ గురించి తల్లిదండ్రులు, తెలిసినవారూ ఎంతో వెతికి వేసారారు. పిల్ల చనిపోయిం దేమో నన్న అనుమానాలు వచ్చాయి.  జార్ఖండ్ సింగ్బామ్జిల్లాలో ఒక గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం తిండికీ ఎంతో ఇబ్బంది పడుతూండేది. ఇంటో అందరకూ పనికి వెళ్లినా ఇల్లు గడిచే పరిస్థితి లేకపోయింది. ఇంటి బాధ్యతను రేష్మానీ తీసుకోవాల్సివచ్చింది.  రోజూ వారీ కూలీ తప్ప మరేమీ తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉండగా రేష్మీకి ఉద్యోగం ఇప్పిస్తానని మంచి జీతం వస్తుంది, ఇంటికి ఎలాంటి కష్టమూ ఉండదని నమ్మ బలుకుతూ ఆమెకు ఒక వ్యక్తి దగ్గరయ్యాడు. ఆమె ఇంటిపరిస్థితుల వల్ల అతను చెప్పింది పూర్తిగా నమ్మవలసి వచ్చింది. రైలు ఎక్కిన కొంతసేపటికి అతని ప్రవర్తనలో చాలా తేడా  గమనిం చింది రేష్మా. అంతే అతనికి తెలియకుండా ఫతేపూర్ లో దిగేసింది. అక్కడి పోలీసుల సాయంతో పేదల ఆవాస గృహానికి వెళ్లింది. అక్కడ ఆమెను బాగానే చూసుకున్నారు. కానీ అక్కడ ఆమె పేరు రాశీగా మార్చు కోవాల్సి వచ్చింది, ఆమె పరిస్థితుల కారణాల వల్ల.  కొంత కాలం అక్కడ గడిపిన రేష్మీ ఈ ఏడాది జూలై లో లక్నో చేరుకుంది. అక్కడి రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. ఆమె వచ్చిన పరిస్థితులు విని తెలుసుకుని ఆమెకు అండగా ఉండాలని   ఆ సెంటర్ అధికారి ఆర్తీ సింగ్  ఆమెకు అన్ని వసతులు కల్పించారు.  పని కోసం అవసరమై ఆధార కార్డు కు పేరు నమోదు చేయించుకున్నప్పుడు ఆమె అసలు పేరు చెప్పింది. కానీ రేష్మీ పేరుతో చాలా కాలం క్రిందటే కార్డు ఆధార్ కార్డు ఉండడంతో కొత్తగా నమోదు చేయడానికి సాంకేతికంగా వీలు కాలేదు. నాలుగయిదు పర్యాయాలు ప్రయత్నించగా చివరగా ఆమె పేరు, ఆధార్ నంబర్ తెలిసాయి. దానితో ఆమె ఊరు, అడ్రస్ తెలిసి అధికారులు జార్ఖండ్ లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసికెళ్లి అప్పగిం చారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత 23 ఏళ్ల రేష్మీ అలా ఇల్లు చేరింది.  ఆధార్ ఆ విధంగా గొప్ప ఉపకారం చేసినందుకు లక్నో ఉదాయి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ ఎంతో ఆనం దించారు. 

గడపగడపకు లో వెల్లువెత్తుతున్న నిరసన సెగలు

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమంలో ప్రజల నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రజా నిరసన ఎదురైంది. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా బుధవారం దొప్పర్ల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు వివక్ష చూపుతున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కన్నబాబుతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఒక దశలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధానికి గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు.   ఈ సందర్భంగా జనం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక కర్నూలు జల్లాలో కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆదోనిలో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను వివరించబోగా.. ప్రజలు అడ్డుకుని చిన్న గుడిసెకు చూడా రూ.1600 ఇంటి పన్ను వస్తోందని నిలదీశారు. దానిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించగా, తమకు వచ్చే పథకాలన్నీ ప్రజలు కట్టిన పన్నులే కదా అంటూ జనం ఎదురు ప్రశ్నించారు. జనం ఇంటి పన్ను, చెత్త పన్ను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అయితే అది కుదరదు అని ఎమ్మెల్యే స్పష్టం చేసి.. ఆ తరువాత జనం నిరసనలను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

టీ20 కప్ లో ఎట్టకేలకు  నెదర్లాండ్స్ కి ఒక విజయం

ఆస్ట్రేలియాలోజరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 విభాగంలో బుధవారం మొదటి మ్యాచ్ లో జింబాబ్వే పై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.  నెదర్లాండ్స్ కి సూపర్ 12లో ఇదే తొలి విజయం. జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వే ఓడనప్పటికీ సెమీస్ అవకాశాలు న్నాయి. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి బయట పడింది.  నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో దౌద్ ఒక్కడే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించి అార్ధ సెంచరీ చేశాడు. కూపర్ 32 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లు ఎన్ గరవా 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ముజరాబాని 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.  అడెలైడ్ ఓవెల్ లో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన ఆనం దం మాత్రం నెదర్లాండ్స్ కి ఎప్పటికీ ఉంటుంది. అదీ టీ20 ప్రపంచకప్ లో సాధించిన విజయం మరి. ముఖ్యంగా సీమర్ పాల్ మీకెరాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో కేవలం సికందర్ రజా నే తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించగలిగాడు. మిగతా వారంతా పేలవంగా ఆడటంతో జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది.  కాగా బుధవారం రెండో మ్యాచ్ లో భారత్ తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం మీదనే జింబాబ్వే టోర్నీలో నిలిచే  ఆశలు ఆధారపడ్డాయి. వర్ష సూచన ఉందన్న వార్తలు వినవచ్చినప్పటికీ అడెలైడ్ లో వీరి మ్యాచ్ కి ఆటంకం కలిగించలేదు. కానీ పిచ్ పేసర్లకు బాగా అనుకూలించడంతో నెదర్లాండ్ స్వింగ్ పేసర్లు విజృంభించారు.  లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దాడి చేయవచ్చని అనుమానం ఉన్నప్ప టికీ, జింబాబ్వే కెప్టెన్ ముందుగా బ్యాట్ చేయడానికే ఆసక్తి చూపడం గమనార్హం. ముందుగా బౌలింగ్ ని తీసుకుని ఉంటే తర్వాత బ్యాటింగ్ సమయంలో నిలదొక్కుకునే అవకాశాలుండేవి.  పొరపాటు అంచనా తో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయ గలిగింది. ఆవిధంగా బ్యాటర్లు ఎవ్వరూ ఛెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేకపోయారు. గెలవా ల్సిన మ్యాచ్ ఆ విధంగా చేజారింది.  నెదర్లాండ్స్ కి  ఇలా ఒక్క విజయం అందించి వారిని సంతోష పెట్టారనే అనాలి. 

ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!

ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11,12 తేదీలలో ఆయన విశాఖలో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 11వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు వి మానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతారు. ఆ రోజు విశాఖలోనే మోడీ బస చేస్తారు. మరుసటి రోజు అంటే నవంబర్ 12న ఆంధ్రావర్సీటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే తన విశాఖ పర్యటనలో మోడీ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.400 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఈస్ట్ కోస్ట్ జోన్ పాలనా భవన సముదాయానికి శంకుస్థ3ాపన చేస్తారు. అలాగే వడ్లపూడిలో రూ.260 కోట్లతో చేపట్టిన వ్యాగన్ వర్క్ షాప్,, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పాలనా భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ఇక చేపల చెరువు నవీకరణ ప్రాజెక్టు, పోర్టు రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇలా ఉండగా మోడీ సభ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి బుధవారం (నవంబర్ 2)పర్యవేక్షించారు. 

వర్షం వద్దు....కోహ్లీ మెరుపులే కావాలి

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ 12లో నాలుగవ మ్యాచ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే బుధవారం మ్యాచ్ వర్షం గండం ఉందన్న అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవు తున్నాయి. మ్యాచ్ ఆరంభం కాకుండానే అడ్డుపడుతుందా, మధ్యలో ఆపేయవలసి వస్తుందా అన్నది ఇంకా పూర్తిగా తెలియడం లేదు. కానీ ఇవాళ్టి మ్యాచ్ కి వరుణుడు తప్పకుండ అడ్డుపడే అవకాశం ఉంద నే వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ టోర్నీలో గ్రూప్ 2 సూపర్ 12లో మ్యాచ్  ఎవరు గెలిస్తే  వారికి  సెమీస్ అవకాశాలు పదిలమవుతాయి.   మొన్నటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినప్పటికీ టీమ్ ఇండియా ఫామ్ గురించి పెద్దగా ఆందోళ నపడనవసరం లేదని టీమ్ హెడ్ కోచ్ ద్రావిడ్ అన్నాడు. బంగ్లాదేశ్ మాత్రం ఇంతవరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ  గెలిచి మంచి ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.  కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు, బౌలింగ్ విభాగంలోనూ జట్టులోకి తిరిగి వచ్చిన షమ్మీ, కొత్త కుర్రాడు అర్షద్ సింగ్ లతో పాటు భువీ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కనుక బంగ్లా దేశ్ మీద పూర్తి  మ్చాచ్ జరిగినా, ఓవర్లు తగ్గించి  జరగకపోయినా గెలిచేది మాత్రం  టీమ్ ఇండియానే.   కానీ వాతావరణ పరిస్థితులు పెద్దగా మ్యాచ్ కి అనుకూలించకపోవచ్చనే వాతావరణ నిపుణులు అంటున్నారు. 60 శాతం మబ్బుగా, తేమగా ఉండవచ్చని, జల్లులు పడవచ్చని అదీ సాయింత్రం పడే అవకాశం ఉందని హెచ్చరిం చారు. బుధవారం చలిగాలి  గంటకు 20  నుంచి 30 కి.మీ.వేగంతో ఉంటాయని తెలిపారు. ప్రస్తుత టోర్నీలో మెల్బోర్న్ లో మ్యాచ్ లు నాలుగు వర్షార్పితం అయిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉండగా, అడెలైడ్ లో మంగళవారం భారీ వర్షం కారణంగా టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ జరగలేదు. ప్లేయర్లంతా హోటల్ కే పరిమితమయ్యారు.  అంతకుముందు భారత్ 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, బంగ్లాదేశ్ ఇంతకుముందు జింబ్వాబ్వేతో తలపడిన మ్యాచ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ విధంగా భారత్ మూడు మ్యాచ్ ల్లో 2 గెలిచి,  4 పాయింట్లతో 2వ స్థానంలోను, బంగ్లాదేశ్ 3వ స్థానంలోనూ ఉన్నాయి. 2016 టీ20 ప్రపంచక కప్ తర్వాత భారత్ బంగ్లాదేశ్ టీ 20 ల్లో పోటీపడలేదు. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే రిజర్వు డే  ఉంటుంది. కానీ అది సెమీస్ మ్యాచ్ లకు మాత్రమే వీలు కల్పిస్తారు. కనుక వర్షం అడ్డుకుంటే చెరో పాయింట్ షేర్ చేసుకోవలసి ఉంటుంది.