ఏపీకి అప్పులు సునాయాసం! ఇలా అభ్యర్థన.. అలా అనుమతి..!
posted on Oct 29, 2022 @ 10:43AM
జగన్ ప్రభుత్వానికి దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేని వెసులుబాటు అప్పుల విషయంలో కేంద్రం ఇస్తోంది. దీని వెనుక జరుగుతున్న రహస్యోద్యమమేమిటో అర్ధం కాక జనమే కాదు పరిశీలకులు సైతం తలలు బాదుకుంటున్నారు. జగన్ సర్కార్ ఇలా కోరడం తరువాయి.. కేంద్రం నుంచి అప్పులకు అలా అనుమతి లభించేస్తోంది. అంతే చిటికెలా జగన్ సర్కార్ ఆర్బీఐలో ఇండెంట్ పెట్టేస్తోంది. ఆర్బీఐ సైతం ఆఘమేఘాల మీద అప్పిచ్చేస్తోంది. ఇప్పటికే అనుమతిని మించి పదివేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసింది. అది చాలదన్నట్లు మరో 1413 కోట్ల అప్పు కావాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. నవంబర్ 1వ తేదీన బాండ్ల వేలం ద్వారా ఆ సోమ్ములు ఏపీ ఖాతాలో జమ అవుతాయి. ఆ సొమ్మును ఇప్పటికే జీతాలు.. పెన్షన్లు ఇవ్వడానికి ఓడీ తీసుకున్నందున వాటికి జమ చేస్తారని చెబుతున్నారు.
దాదాపు ఇలాంటి ఆర్థిక సమస్యలతో తెలంగాణ సతమతమౌతున్నప్పటికీ.. కేంద్రం ఖరాకండీగా కాదు.. కూడదని తెగేసి చెబుతోంది. ఈ వివక్ష ఎందుకు.. తేడా ఎమిటి అంటే కేంద్రం అడుగులకు జగన్ సర్కార్ మడుగులొత్తుతుంటే.. తెరాస సర్కార్ మాత్రం కేంద్రం తప్పిదాలపై విరుచుకు పడుతోంది. కేంద్రం విషయంలో జగన్ సర్కార్ రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటే... తెలంగాణ సర్కార్ మాత్రం కేంద్రం ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. ఎదిరిస్తోంది. అదీ తేడా. మరో తమాషా ఏమిటంటే.. ఏపీ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే అప్పులు చేస్తున్నట్లుగా ఉందంటూ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించేస్తారు. అదే సమయంలో మరింత ఉదారంగా అప్పులకు అనుమతి ఇచ్చేస్తారు. విమర్శలు ఎందుకు, ఈ భుజం తట్టడాలెందుకు అన్న ప్రశ్నలకు సమాధానం రాదు.
ఏపీ సర్కార్ కు నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం మరచిపోయిందా అన్న అనుమానాలను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుప్పలా మారినా.. ఆ చేసిన అప్పులతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులూ చేపట్టింది. ఆ అభివృద్ధి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయినా కూడా కేంద్రం తెలంగాణ సర్కార్ పట్ల కఠినంగానూ, ఏపీ సర్కార్ పట్ల పరిమితులు లేనంత ఉదారంగానూ వ్యవహరిస్తున్నది. ఏపీ సర్కార్ ఇంత యథేచ్ఛగా అడ్డగోలుగా అప్పులు చేస్తూ కూడా ఒక్క రూపాయి అభివృద్ధి పనులకు కేటాయించిన దాఖలాలు లేవు. చేసిన వేల కోట్ల రూపాయల అప్పులన్నీ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికీ.. ఉద్యోగుల జీత భత్యాలకే సర్దేస్తోంది.
చిన్న చిన్న పనుల కాంట్రాక్టర్లకూ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా వేల కోట్లు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ సొమ్ములన్నీ ఎటు పోతున్నాయన్నది బ్రహ్మ రహస్యంలా ఉందని పరిశీలకులు అంటున్నారు. యాభై వేల కోట్ల రూపాయలు గల్లంతయ్యాయనీ, వాటి వివరాలు కావాలని కాగ్ వివరాలు కావాలని కాగ్ అడుగుతోందని ప్రచారం జరుగుతోంది.
నిజంగా ఏపీ అప్పుల తప్పుల లెక్కలు బయటకు తీయాలంటే పెద్ద పనేం కాదు. కానీ కేంద్రం, కాగ్ లకు ఆ పని చేయడానికి గంట కూడా సమయం చిక్కడం లేదు. అదనపు అప్పులకు అనుమతులు ఇవ్వడానికి మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా ఏపీ ఆర్థికంగా దివాలా దిశగా పరుగులు తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.