ప్రభుత్వ వైఫల్యాలపై జనంలోకి చంద్రబాబు.. రెండు నెలల పాటు విస్తృత పర్యటనలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల నాలుగో తేదీ నుంచి రెండు నెలల పాటు విస్తృతంగా పర్యటనలు జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను మరిన్ని వర్గాల్లోకి తీసుకెళ్లడం, టీడీపీ శ్రేణులను మరింత క్రియాశీలం చేయడం లక్ష్యం అని చెబుతున్నారు. గత మే నెలలో జరిగిన టీడీపీ మహానాడు తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు రోజులు పర్యటించడం ద్వారా ఏడాదిలో అన్ని జిల్లాలు సందర్శించాలని అప్పట్లో కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు. అయితే.. భారీ వర్షాలు, వ్యవసాయ పనులు ముమ్మరం కావటంతో జిల్లాల పర్యటనలకు ఆయన విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో మాత్రమే అప్పుడు చంద్రబాబు పర్యటించగలిగారు. ఆ తర్వాత చాలా వరకు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జులతో ముఖాముఖీ సమావేశాలు పూర్తిచేశారు. ఇప్పటికే 117 నియోజకవర్గాల ఇన్ చార్జులు లేదా సిటింగ్ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నా రు. నవంబరు నాలుగో తేదీన ఎన్టీఆర్ జిల్లా నుంచి చంద్రబాబు పర్యటనలు ప్రారంభిస్తారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆ రోజున చంద్రబాబు రెండు సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారానికి మరో జిల్లా పర్యటన ఉండేలా టీడీపీలో ప్రణాళిక రూపొందుతోంది. పర్యటనలు మరింత పకడ్బందీగా నిర్వహించే నిమిత్తం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు ఈ విభాగం కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీమంతెన సత్యనారాయణ రాజు సహ కన్వీనర్ గా ఉంటారు. గతం నుంచి ఈ కార్యక్రమాల సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న గంటా గౌతం, పత్తిపాటి శ్రీనివాస్ లనూ అందులో కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు హయాం నుంచీ పార్టీ పర్యటనల ఏర్పాట్లను కంభంపాటి చూస్తు న్నారు. దీంతో ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. పర్యటనల విభాగం కొద్ది రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమై పర్యటనల వ్యూహంపై చర్చించింది. ఇలా ఉండగా.. జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత నుంచి టీడీపీ యువ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. కుప్పంలో ప్రారంభమయ్యే లోకేశ్ పాదయాత్ర సుమారు ఏడాది పాటు సాగనుంది. ఈ లోగా నవంబర్, డిసెంబర్ నెలల్లో పార్టీ చీఫ్ చంద్రబాబు పర్యటనలు కొనసాగుతాయి.

వల్లభనేని వంశీ ఎన్నికపై హైకోర్టు విచారణ

కృష్ణాజిల్లా గన్నవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. వకాలత్ దాఖలు చేశామని కౌంటర్ వేలయడానికి సమయం కావాలని ఎమ్మెల్యే తరఫు న్యాయ వాది కోరారు. పిటిషన్లో ప్రతివాదులు పలువురికి మరోసారి నోటీసులు జారీ చేసింది. మరికొం దరికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు ఇచ్చేందుకు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయడానికి పిటిష నర్‌ తరఫు లాయర్‌కు అనుమతిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన యార్ల గడ్డ వెంకటరావు 2019 జులైలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వంశీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారంలో వంశీ సూచనతో తహసీల్దార్‌ సంతకంతో ఇళ్ల స్థలాల నకిలీ పట్టాలు పంపిణీ లెక్కింపు ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరగడం తో స్వల్ప తేడాతో ఓడిపోయానని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.  2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి వంశీ గెలుపొందాడని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాపుల‌పాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేసి.. 12 వేల న‌కిలీ ఇళ్ల ప‌ట్టాల‌ను తన అనుచరులకు వంశీ పంచారని యార్లగడ్డ వెంక ట్రావు పిటి షన్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేసిన‌ట్లు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అమరావతి కేసు.. నాట్ బిఫోర్ మీ అన్న సీజేఐ

అమరావతి కేసులో సుప్రీంలో  ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యూయూ లలిత్ ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి తప్పుకుని వేరే బెంచ్ కు బదిలీ చేశారు. వేరే బెంచ్ లో ఈ కేసు లిస్ట్ అయి విచారణకు రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో వాస్తవానికి మంగళవారం (నవంబర్ 1)) జరగాల్సి ఉంది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ.లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో ఈ కేసు విచారణకు నిరాకరిస్తూ నాట్ బిఫోర్ మి అన్నారు. విభజన చట్టంపై గతంలో తన అభిప్రాయం చెప్పానని అందుకే  వేరే బెంచ్‌పై విచారణ  జరపాలన్నారు. వేరే బెంచ్‌పై వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని సూచించారు.   దీంతో ఈ కేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. అయితే ఈ తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీం  కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.  వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.  ప్రభుత్వ వాదనపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసా గించాలని రైతులు కోరుతున్నారు. ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని ఆరోపిస్తున్నారు. విభేదాలు సృష్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, పాదయాత్రను అడ్డుకోవడం, దాడులు చేయడం మానుకోవాలని రైతులు అంటున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. హైకోర్టు తీర్పుని వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని రైతులు చెబుతున్నారు.  

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైసీపీ నేత వీరంగం

గన్నవరం విమానాశ్రయంలో పోలీసు అధికారులపై వైసీపీ నేత బెదిరింపులకు దిగిన వైనం మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎయిర్ పోర్టు లోపలికి తనను పంపించలేదని వైసీపీ జెడ్ పీ కో ఆప్షన్ సభ్యుడు ఎం.డి. గౌసాని ఇష్టం వచ్చినట్లు వీరంగం వేశారు. ‘ఏంటి నువ్వు..? ఏం చేస్తావ్..?’ ‘నీ యవ్వారం ఏంటో తేల్చేస్తానం’టూ ఆయన రంకెలు వేస్తూ ఎయిర్ పోర్ట్ ఏసీపీ మీది మీదికి వచ్చారు. ‘నన్ను లోపలికి పంపలేదంటే మీ ఉద్యోగాలు ఉండవు’ అంటూ విమానాశ్రయం పోలీసు అధికారులను గౌసాని భయభ్రాంతులకి గురిచేశారు. ‘అనుమతి ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయం లోపలికి పంపిస్తాం’ అని చెప్పినా వైసీపీ నేత ఎం.డి.గౌసాని వినిపించుకోలేదు. సరికదా పోలీసులకు వేలు చూపించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఏంటి నువ్వు చేసేది. నిన్ను ట్రాన్స్ ఫర్ చేయించకపోతే చూడు’. ‘ఎయిర్ పోర్ట్ లోపలికి తనను పంపించకపోతే గంటలో ఇక్కడ నుండి ట్రాన్స్ ఫర్ అవుతావు’ అని అని గౌసానియా బెదిరింపులకు దిగారు.

పీకేకు అర్ధమైంది.. ఇక జనానికీ అర్ధమౌతుంది.. రఘురామ

జగన్ వ్యవహారం, వేషాలు పీకేకు అర్దమయ్యాయనీ, ఇక జనానికీ అర్ధమౌతాయనీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ అర్ధం చేసుకోవడానికి తనకు ఎనిమిది నెలలు పట్టిందనీ, అదే జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకేకు అర్ధం కావడానికి మూడేళ్లు పట్టిందనీ,  రఘురామ కృష్ణం రాజు అన్నారు.  అందుకే పీకే ఇప్పుడు జనగ్ పదవీకాంక్ష సాకారం అవ్వడానికి తాను సహకరించి ఉండకపోయి ఉండాల్సిందని పీకే వ్యాఖ్యలను ఈ సందర్బంగా ఉటంకించారు. పీకేకి అర్ధమయ్యిందనీ, ఇక జనం కూడా జగన్ పదవీ కాంక్షతో చేసిన చేస్తున్న దుర్మార్గాలను అర్ధం చేసుకుంటారని అన్నారు.  ఈ సందర్భంగా ఒక సినిమాలో తన అధికారం చేపట్టాలంటే.. సానుభూతి అవసరమని భావించిన హీరో కిరాయి హంతకుడి చేత తనను తాన పొడిపించుకున్న దృశ్యాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రజలకు చూపించారు.  ఇక ముఖ్యమంత్రి ఉన్న చోటనే రాజధాని అంటూ జగన్ ఎత్తుకున్న కొత్త పల్లవి అసంబద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి ఏపీలోని అమరావతి నుంచి పాలన కొనసాగించాలని భావించి భారతదేశ రాజధాని అమరావతే అని ప్రకటించి ఇక్కడ నుంచి పాలన కొనసాగిస్తే జగన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ తన వెసులుబాటు కోసం ఇష్టారీతిగా మాట్లాడి, ఇష్టారీతిగా ప్రవర్తిస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన బాధ్యతాయుతంగా ఉండాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏపీ సీఎం తీరు, వ్యవహారం అంతా తుగ్లక్ ను పోలి ఉంటుందనడానికి సీఎం ఎక్కడంటే అక్కడే రాజధాని అన్న మాటే ఉదాహరణ అన్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచన ఇప్పటి వరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ రాలేదని,  గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా  దాన్ని రాష్ట్ర రాజధాని అని పేర్కొనలేదని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నప్పటికీ,  దాన్ని ఆయన తెలంగాణ రాజధానిగా పేర్కొనడం లేదన్నారు. వారందరికీ భిన్నంగా జగన్ మాత్రం ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాష్ట్ర రాజధాని అంటూ వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు.   తాను చెబుతున్నంత సులువుగా విశాఖ రాజధాని అయిపోతుందని అనుకుంటే.. మూడు రాజధానులంటూ ఇంత హంగామా ఎందుకు? అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానాలు ఎందుకు.. కోర్టు కన్నెర్ర చేసిందని మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఎందుకు అని రఘురామ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆరు నెలల వ్యవధి సరిపోదు, 60 నెలల సమయం కావాలని ఎందుకు అభ్యర్థించినట్లు అని నిలదీశారు.  విశాఖకు తాను వెళ్తాను… తన వెనుకే మంత్రులు వస్తారు… సచివాలయం వస్తుంది, దాన్నే రాష్ట్ర రాజధాని అని పిలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో చెప్పాలన్నారు. 

వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం...చర్చించనున్న పార్లమెంటరీ కమిటీ

వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం గురించి చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ సంసిద్ధత వ్యక్తం చేయనుంది. అయితే దీని గురించి బిజేపీ సభ్యులు వ్యతిరేకించవచ్చుననే అభిప్రా యాలు లేకపోలేదు.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ నాయకత్వంలో  వాణిజ్య వ్యవహారాలపై  పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ  అనేక అంశాలు చర్చించేందుకు  సోమవారం సమావేశ మయింది. కమిటీ కొత్తగా రూపొందించిన తర్వాత సమావేశం కావడం ఇదే తొలిసారి. సమావేశంలో సంఘ్వీ వాణిజ్యంపై రూపాయి విలువ తరుగుదల ప్రభావం కూడా చర్చించా ల్సిన అంశంగా ప్రతి పాదించారు.   అయితే సంఘ్వీ ప్రతిపాదనను ప్యానల్ సభ్యుడు,  బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యతిరేకించారు. రూపా యి విలువ తరగడమన్నది శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికమే గనుక ఆ అంశం కంటే వాణిజ్యానికి సంబందించిన ఇతర కీలకాంశాలు చర్చించడమే మేలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఇతర బీజేపీ ఎంపీలు రాజు బిస్త, రాజకుమార్ చాహార్, దీపక్ ప్రకాష్ సమర్ధించారు. కానీ ఇతర ప్రతిపక్ష ఎంపీలందరూ సంఘ్వీ ప్రతిపాదించాల్సినది చర్చించాల్సిన అంశమేనని అన్నారు.  కనుక వాణిజ్యం సంస్థలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ఈ అంశంలో తమ అభిప్రాయాలను కోరవచ్చు.  వారి అభిప్రాయాలు, సూచనల ఆధారంగానే చర్చ జరగవచ్చు.  ఈ ఏడాది ఆరంభం నుంచే రూపాయి విలువ తరుగుదలకు గురవుతూనే ఉంది.  యు. ఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుదల  తర్వాత  విదేశీ నిధుల  ప్రవాహానికి  దారితీసిన తరువాత  ఇతర  అభివృద్ధి  చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో కలిసి రూపాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒత్తిడిలో ఉంది. దేశీయ కరెన్సీ అక్టోబర్‌లో  యు. ఎస్  డాలర్‌తో పోలిస్తే దాని జీవితకాల కనిష్ట స్థాయి 83కి పడిపోయింది మరియు ఇది రు.82 పైన కొనసాగుతోంది.

ఆర్భాటంగా ప్రకటనలు.. అమలు చేయలేక ఆపసోపాలు!

జగన్ ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో చేసినది ఆర్భాటంగా నిర్ణయాలు తీసుకోవడం.. వాటి పర్యవసానాలు ఎదుర్కోలేక అభాసుపాలై ఆపసోపాలు పడటం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా వేదికను కూల్చడంతో మొదలైన జగన్ విధ్వంస పాలన మూడేళ్లుగా ఎన్నో మొట్టికాయలు తిన్నా అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది. అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికనైతే కూల్చేశారు కానీ.. ఆ ప్రజా వేదిక అక్రమకట్టడం అని ఇప్పటి వరకూ అక్రమకట్టడం అని నిరూపించడం అయితే కాలేదు. ముందు కానిచ్చేస్తే.. ఆ తరువాత ఏం జరిగినా ఎవరూ పీకేదేం లేదన్న విధానంతో జగన్ సర్కార్ ముందుకు పోతోందని అంటున్నారు. రిషికొండ తవ్వకాల విషయంలో కూడా జగన్ సర్కార్ అదే తీరును అవలంబిస్తోందని గుర్తు చేస్తున్నారు. కోర్టు కూడదన్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగించడం.. పర్యావరణ విధ్వంసానికి వెనుకాడకపోవడాన్ని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు ఉదహరిస్తున్నాయి. అడవుల విధ్వంసంపై న్యాయస్థానం కన్నెర్ర చేస్తే ధ్వంసం చేసిన అడవుల స్థానంలో మళ్లీ అడవిని పెంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పడాన్ని తెంపరితనంగా అభివర్ణిస్తున్నారు. విధ్వంసం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయని జగన్.. ప్రభుత్వ నిర్ణయాల అమలు విషయంలో మాత్రం ప్రతిసారీ మడమ తిప్పుతున్నారు.. మాట తప్పుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖలో ఫ్లెక్సీల పై నిషేధం అంటున్నారు. ఇటీవల జగన్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖలో అపరిమితంగా అడ్డూ అదుపూ లేకుండా వెలసిన ఫెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఊరుకోకుండా తక్షణమే విశాఖలో ఫ్లెక్సీలపై నిషేధాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఈ తక్షణం ఇప్పటి వరకూ రాలేదు. నవంబర్ 1 లోగా ఫెక్సీలపై నిషేధం ఉత్తర్వులు ఇస్తామని ఒకసారి.. ఆ తేదీ వచ్చేసరికి నిషేధం జనవరి నుంచి అంటూ మరోసారి మడమ తిప్పేసి మాట మార్చేశారు జగన్. ముందు చూపు లేకుండా నిర్ణయాలు ప్రకటించడం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం ఒక అలవాటుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అప్పటికప్పుడు నోటికి తోచిన ప్రకటన చేయడం... ఆ ప్రకటన ప్రకారం చర్యలు తీసుకోలేక, కార్యాచరణలో పెట్టలేక అభాసుపాలు కావడం.. మాట మార్చడానికి ఆపసోపాలు పడటం ఇదే మూడున్నరేళ్లుగా జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మందు బాబులు..సారీ.. కోతులు 

అతిగా తాగి తూలేవాడిని కోతి అనే పిలుస్తారు. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా వాగడం, తిరగడం చేస్తుంటాడు. మరి కోతులే మందు కొడితే? సరిగ్గా ఇదే జరుగుతోంది ఉత్తరప్రదేశ్ లో. రాయిబరేలీలో లిక్కర్ దుకాణాలవారికి, అక్కడికి వచ్చేవారికి కోతుల బెడదతో భయంతో కూడిన సమస్యలు తెలెత్తాయి.  గుడికి వెళితే అరటిపళ్లు లాగేసుకునే కోతులు చూస్తాం. వాటికి భయపడుతూ జాగ్రత్తగా వెళ్లి వస్తుంటారు. వాటికి ఆకలి వేసి జనాల మీద దాడి ప్రారంభించితే ఇంట్లో ఉన్న తిండి అంతా సమర్పించు కోవా ల్సిందే.  ఇచ్చేంతవరకూ వదలవు. కానీ మందుబాటిల్, మందు కోసం కూడా ఎగబడటం, జనాన్ని ఇబ్బందిపెట్టడం మాత్రం రాయిబరేలీలో జరుగుతోంది. ఏదో సరదాగా నలుగురు కలిసి తాగదాలని వెళ్లినవారి మీదా కోతులు దాడి చేస్తున్నాయట. వాటికి మందు అంతగా యిష్టమయిందేమో మరి.   మామూలుగా అయితే, బాగా చెట్లు ఉన్న కాలనీల్లోకి దండులా వచ్చి పడుతుంటాయి. మామిడి, అరటి చెట్లున్నచోట మరీ ఎక్కువ గోల చేస్తుంటాయి. పిల్లలతో పాటు దూకుతూ, దొంగతనంగా ఇళ్లలోకి వచ్చి అందిన తిండిపదార్ధాలని తినేస్తుంటాయి. కానీ రాయిబరేలీ కోతులు మరింత చిత్రంగా ఉన్నాయి. అక్కడివారంతా రోజూ వాటివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారట. మొన్నామధ్య ఒకరోజు లిక్కర్ దుకాణం వాడు దుకాణం తలుపు తీసేసరికే లోపల కూచుని ఒకటి డబ్బా బీర్ లాగించేస్తూ కనపడింది. అంతే దుకాణం వాడు గొల్లుమన్నాడు. వెంటనే వాటిని పట్టుకునేవారిని పిలిపించాడు. వాళ్లు వచ్చే లోగానే మరోటి తాగేసి పారిపోయింది. రోడ్డు మీద వెళుతూ ఆయన కేకలు విన్నవారిలో కుర్రాళ్లు ఆ మందుకోతి వీడియో తీశారు. ఇపుడు అది వైరల్ అయింది. 

వ్యవసాయ మోటార్లకు మీటర్లు సరే.. ఈ సంగతేంటి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోడీ సర్కార్ పై విమర్శలతో విరుచుకు పడే అంశాలలో ప్రధానమైనది వ్యవసాయ మీటర్లకు కేంద్రం మోటార్లు పెట్టమంటోందన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ విస్పష్టంగా చెబుతున్నారు. తాను కేంద్రం ఆదేశాలను ధిక్కరించినందుకే అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నదనీ, పనికిమాలిన కొర్రీలతో అప్పులకు అడ్డంకులు సృష్టిస్తే రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తోందని కేసీఆర్ చెబుతున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ, ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్ కూ లేని ఆంక్షలను తెలంగాణకు విధిస్తూ నానా ఇబ్బందులూ పెడుతోందని విమర్శిస్తున్నారు. తన తల తీసేసినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పనికి తాను అంగీకరించేది లేదని చెబుతున్నారు. అదలా ఉంచితే అసలు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన మోడీకి రావడానికి కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం ద్వారానే వచ్చిందనీ, ఒక విధంగా చెప్పాలంటే.. కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకునే కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు యథేచ్ఛగా వాడేస్తూ ఉండేవారు. విద్యుత్ ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే విద్యుత్ వృధాను అరికట్టడం అన్న పేర ప్రీపెయిడ్ మీటర్లను బిగించడానికి నిర్ణయించిందో అప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అదే చెబుతోంది. వ్యవసాయానికి విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదనీ, కానీ ఉచిత విద్యుత్ పేర విద్యుత్ వృధాను అరికట్టడమే తమ లక్ష్యమనీ చెబుతూ కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని చెబుతున్నామంటోంది.  కనీ కేసీఆర్ తన రాష్ట్రంలో తన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు ఏ కారణంతో అయితే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయించారో.. అదే కారణంతో కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తానంటే మాత్రం ససెమీరా అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రీపెయిడ్ రీచార్జబుల్ ఎలక్ట్రికల్ మీటర్లను బిగించేశారు. ముందుగా చెల్లించిన మేరకు విద్యుత్ ను వినియోగించిన ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఆలస్యమైతే రిచార్జ్ చేయించుకునే వరకూ ఆయా కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అదీ సంగతి ఇప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయానికి వస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల.. ప్రభుత్వం ఆ మీటర్ మేరకు విద్యుత్ బిల్లు చెల్లించడం ఆలస్యమైతే వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. మనీ ట్రాన్స్ఫర్ తరహాలో రైతులు వినియోగించుకున్న మేరకు అయిన చార్జీల సొమ్మును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేస్తుంది. దానితొ వారు విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బిల్లు సొమ్మును రైతుల ఖాతాలో వేయడం ఆలస్యమైతే.. రైతుకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఇలా మోడీ కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకునే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ మోటార్లను బిగించిన విధంగానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.  ఇక కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడంతో ఆగడం లేదు. ఇప్పుడు గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సమాయత్త మౌతున్నారు. అంటే గృహ వినియోగదారులు కూడా తాము వినియోగించుకోబోయే విద్యుత్ కు ముందుగానే సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్ముకు సరపడా విద్యుత్ వినియోగం పూర్తి కాగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనం కేసీఆర్ ను దీని సంగతేమిటని నిలదీస్తున్నారు. స్మార్ట్ మీటర్లన్నీ ప్రీపెయిడ్ ప్రాతిపదికగానే ఉంటాయనీ, అంటే ఫోన్ రీచార్జ్ చేయించుకున్నట్లుగా విద్యుత్ వినియోగం కూడా రీచార్జ్ విధానంలోనే సరఫరా అవుతుందనీ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అంటే చార్జ్ చేయించుకున్న మేర విద్యుత్ వినియోగించిన మరు క్షణం ఆటోమేటిగ్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేయించుకునే వరకూ సదరు గృహస్థు కుటుంబంతో సహా చీకట్లో మగ్గాల్సిందే.

రంభ కారు ప్రమాదం..,కుమార్తె సీరియస్

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి టాప్ హీరోయిన్ రంభ కుటుంబ సమేతంగా వెళుతోన్న కారు ప్రమాదానికి గురయింది. మంగళవారం కెనడాలో జరిగిన ఈ ప్రమాదంలో అందరికీ గాయాలయ్యాయని, రంభ కుమార్తె నాషా మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారని సమాచారం.  రంభ కొంతకాలం నుంచీ తన కుటుంబంతో కెనడాలో ఉంటున్న సంగతి తెలిసిందే. కారులో ఉన్న రంభ, ఆమె పెద్ద కూతురు, అలాగే ఆమె నాన్నికి స్పల్ప గాయాలు అయ్యాయి. కానీ చిన్న కూతురు సాషాకి తీవ్రగాయాలు అవ్వడంతో హాస్పిటల్‌కి తరలించారు. సాషాకి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయం తెలిపుతూ నటి రంభ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. కూతుర్లను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. ఓ జంక్షన్ వద్ద మా కారుని మరో కారు ఢికొట్టింది. అప్పుడు నేను నా పిల్లలు, అలాగే నా నానీ కూడా నాతోనే ఉన్నారు. అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాషా ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. మా బ్యాడ్ టైమ్. దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యమన్నారు.

మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంత్రి జగదీశ్వరరెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగలడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటికి మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించింది. అది అలా ఉంటే ఆ నిషేధం ఇలా ముగిసిందో లేదో  సోమవారం రాత్రి నుంచి ఆయన నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. తెలంగాణ విద్యుత్ మంతి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం ఒకింత ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకే కొనసాగిన ఈ సోదాలో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. అత్యంత గొప్యంగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. దాదాపు 15 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, కొన్న డాక్యుమెంట్లు, డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు లేదా?

దేశంలో ఓటర్లు ఎంతమంది, మనకు ఎంతశాతం ఓట్లు వస్తాయి, మన పార్టీవారు వేరే పార్టీవారికి జారిపోకుండా కట్టు దిట్టం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదలయిన వన్నీ సరిగ్గా ఏదో ఒక ఎన్నికల సమయంలోనే చర్చకు వస్తుంటాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో లేనివారికి ఆ హక్కు కల్పించే యత్నాలూ ముమ్మరంగా చేపడుతుంటారు. అయితే, ఏదో ఒక కేసులో జైళ్లలో మగ్గుతున్నారి సంగతేమిటి? అనే ప్రశ్న కూడా తలెత్తకా పోదు. వారిని కూడా ఓటర్లుగా భావించి ఓటు హక్కు కల్పిస్తారా అన్న అంశంపై చాలా కాలం నుంచే చర్చ ఉంది. కానీ పెద్దగా సీరియస్ గా పట్టించు కున్నట్టు లేదు. వాస్తవానికి 1951 ప్రజాప్రతినిధుల చట్టం జైల్లో ఉన్నవారికి  ఓటు హక్కు లేదు. కానీ వారి ఓటుహక్కు వినియోగానికి వీలు కల్పించాలని కోరడం జరుగుతోంది. దీన్ని గురించి కేంద్ర  ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ యింకా స్పందించాల్సి ఉంది.  అయితే ఈ అంశంలో పిల్ ను అంగీకరించే సమయానికి అంటే డిసెంబర్ 9వ తేదీలోగా  సుప్రీం కోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన బెంచ్ కేంద్రం, ఈసీ స్పందించాలని ఆదేశించింది.  అయితే,  ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా రవాణా లేదా మరేదైనా జైలులో నిర్బంధించబడినా, లేదా పోలీసు చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నట్లయితే, ఏ వ్యక్తి ఏ ఎన్ని కల్లోనూ ఓటు వేయకూడదు: ఈ ఉప విభాగంలోని ఏదీ నివారణ నిర్బంధానికి గురైన వ్యక్తికి  వర్తించదని సెక్షన్ 62(5) తెలియజేస్తుంది.   కాగా.  జైల్లో ఉన్న వ్యక్తి  శిక్షాకాలం, చేసిన పని గురించిన స్పష్టత మాత్రం ఎలాంటి స్పష్టీకరణను  ఓటు హక్కు  నిషే ధంలో లేదని , జైలు శిక్ష అనుభవిస్తున్న వారి విషయంలో ఆదిత్య భట్టాచార్య వేసిన పిల్ పేర్కొన్నది.  అంటే  ఎంత కాలం నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి ఓటు హక్కు ఉండదు, ఎంత స్థాయి నేరం చేసినవారికి  ఉండదూ  అనే అంశాలు స్పష్టంగా లేవని ఆయన పిల్ లో పేర్కొన్నా రు. అంతేగాక, నిర్దోషిత్వం లేదా అపరాధం నిశ్చయంగా నిర్ధారించబడని అండర్ ట్రయ ల్‌లు, వారు కూడా జైలులో నిర్బంధించబడినందున వారి ఓటుహక్కును కోల్పోతారని, అయితే బెయిల్‌పై విడుదలై నప్పటికీ దోషి ఓటు వేయవచ్చని పేర్కొంది.  మొత్తానికి జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు గురించి సుప్రీంకోర్టు పరిశీలించాల్సి ఉంది. 

వైసీపీ టంగ్ ట్విస్టర్.. మూడంటే మూడు కాదు ఒకటే!

మూడు రాజధానుల మూడుముక్కలాటలో వైసీపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. మూడంటే మూడని కాదు అని చెబుతోంది. ఏపీకి ఒక్కటే రాజధాని అనీ.. అది అమరావతి కాదు.. విశాఖపట్నం అని అంటోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే.. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తారో అదే రాజధాని అని చెబుతున్నారు. ఇందు కోసం మూడు రాజధానులంటూ రాద్ధాంతం ఎందుకని ప్రకటిస్తున్నారు. సీఎం తనకు ఇష్టమొచ్చిన నగరం నుంచి పాలన సాగించవచ్చనీ, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే కేబినెట్ ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని చెబుతున్నారు. ఇంతోటి దానికి మూడు రాజధానులంటూ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేయడంతో వాటిని ఉపసంహరించుకోవడం.. మళ్లీ తగుదునమ్మా అంటూ మూడు రాజధానులే ముద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేయడం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు.  ఇంత కాలం మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు. కర్నూలు న్యాయరాజధాని, అమరావతి శాసన రాజధాని, ఇక విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ చెబుతూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ స్వరం మారింది.. ధోరణి మారింది. ఉత్తరాంధ్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రానికి ఒకటే రాజధాని అని కుండ బద్దలు కొట్టేశారు. అయితే ఆ ఏకైక రాజధాని అమరావతి కాదు.. విశాఖపట్నం అని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయం పార్టీ అభిప్రాయమా.. లేక ధర్మాన సొంత పైత్యమా అన్నది పక్కన పెడితే.. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో రాద్ధాంతం ఎందుకని ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని స్పష్టంగా చెప్పారు. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగించాలనుకుంటే అక్కడ నుంచి సాగించవచ్చనీ.. దీనిని ఎవరూ అడ్డుకో జాలరనీ కూడా చెప్పేశారు. అంతే కాదు.. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అక్కడే కేబినెట్ కూడా ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని జగన్ చెప్పారు. అంటే తాను విశాఖ నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నాననీ, అందుకే అక్కడే సచివాలయం ఉంటుందనీ, అక్కడే కేబినెట్ కూడా ఉంటుందని అందుకే ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుందనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాశారు. మరి శాసన కేపిటల్, న్యాయ రాజధాని అంటూ ఇంత కాలం ఆడిన డ్రామాకు అర్ధమేమిటో జగన్ చెప్పి తీరాలి. ఇది అలా ఉంచితే.. ఇప్పుడు ధర్మాన తాజాగా ఎత్తుకున్న ఏపీకి ఏకైక రాజధాని విశాఖ పట్నమే అన్న విషయానికి వస్తే.. కర్నూలులో హైకోర్టు ఉంటుంది కానీ అది న్యాయ రాజధాని కాదు.. అలాగే అసెంబ్లీ అమరావతిలోనే కొనసాగినంత మాత్రాన అది శాసన రాజధాని కాదు అని చెబుతున్నారు.   వరుసగా సదస్సులు నిర్వహిస్తూ ఆయన చెబుతున్న మాట ఇదే. ఇప్పుడు జనగ్ మాటలను ఒకసారి పరిశీలిస్తే.. ఆయన కూడా ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుంది కానీ.. ఇంత కాలం తాము చెబుతూ ఉన్న మూడు రాజధానులు అన్న మాటే ఉండదని అర్ధమౌతుంది.  ఇందుకు ఉదాహరణలుగా  ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే కటక్‌లో హైకోర్టు ఉందని ధర్మాన ఇప్పుడు తాపీగా ఎవరికీ తెలియని రహస్యమన్నట్లు చెబుతున్నారు. అలాగే దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట… రాజధాని మరో చోట ఉన్నాయని చెబుతూ.. అంత మాత్రాన ఆయా రాష్ట్రాలలో న్యాయరాజధాని అంటూ హైకోర్టు ఉన్న  నగరాలను రాజధానులని ఎవరూ పిలవడం లేదన్న ధర్మాన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్తగా రాయల సీమ ప్రాంతంలో ఆందోళనలు అంకురించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకలు అంటున్నారు. తాజాగా జగన్, ధర్మానలు చేస్తున్న వాదన వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే అని వివరిస్తున్నారు.  అసలిదంతా ఎందుకంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి.. ప్రజల సెంటిమెంటును రగిలిస్తే తప్ప వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం అసాధ్యమన్న అభిప్రాయానికి వైసీపీ అగ్రనాయకత్వం వచ్చేయడంతోనే ఇప్పుడొ  ఏకైక రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడానికి ఇదే కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  

వివేకా హత్య కేసు విచారణ బయటి రాష్ట్రానికి బదలీపై సుప్రీం ఆదేశాలు నేడు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం(నవంబర్ 1) ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే కేసు మరో రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు ఏ రాష్ట్రానికి బదిలీ అన్న విషయంపై నవంబర్ 1న ఉత్తర్వులు ఇవ్వనున్నట్ల పేర్కొన్న సంగతి విదితమే. తన తండ్రి హత్య కేసు విచారణ ఇతర రాష్ట్రానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. కేసు వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించి గత నెల(అక్టోబర్) 19న  తీర్పు రిజర్వ్ చేసిన సంగతి విదితమే.   స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించింది.  దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసు తార్కిక ముగింపు దిశగా సాగుతోందనీ? ఈ కేసు విషయంలో దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేశారనీ? ఇంతకాలం వెల్లువెత్తిన అనుమానాలను  దేశ సర్వోన్నత న్యాయస్థానం నమ్మిందని స్పష్టమౌతోంది.   తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాల్సిందేనన్న పట్లు దలతో ఉన్నారు. ఇందుకోసం ఆమె సాహసోపేతమైన పోరాటమే చేశారు. ఆ పోరాటం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వివేకానందరడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తే ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ స్వంత మీడియాలో పదే పదే చెప్పించడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి. సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసిందంటే  రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అంతకంటే దారుణమైన అవమానం వేరొ కటి వుండదు. పాత రోజులలో అయితే అటు ముఖ్యమంత్రి, ఇటు డిజిపి వంటి ఉన్నతా ధికారులు సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వెలువడితే  వెంటనే పదవులు వదిలేసే వారు. కానీ విచిత్రంగా జగన్ హయాంలో అటువంటి నైతికతకు చోటు లేని పరిస్థితి ఉంది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడినా జగన్ సర్కార్ లో ఎటువంటి చలనం లేదు. అయితే సుప్రీం ఆదేశాలతో  వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అయితే (ఇప్పటికే కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి సుప్రీం అంగీకరించింది. అయితే  నేరస్తులకు ఉచ్చు బిగుసుకున్నట్లే అని పరిశీలకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.  ఇదే సమయంలో వివేకా హత్య పై జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు హత్యకు కారణమేమిటో, హత్య చేసిన వారెవరో చెప్పకనే చెప్పేశాయని పరిశీలకులు అంటున్నారు. తన చిన్నాన్నను చంపారని, చంపిన వారెవరో అందరికీ తెలుసని ప్రకటించా రామె. ఆమె నోటి వెంట ఆ మాట వెలువడడం వైఎస్ కుటుంబాన్ని చిక్కులలోకి నెడుతున్నది. ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎంపీ సీటు కోసమే తన చిన్నాన్నను దారుణంగా చంపేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో... ఇప్పటి దాకా కేసును నీరుగార్చడానికి పోలీసు యంత్రాంగం చేసిన ప్రయత్నాలతో వివేకా హత్య కేసులో నేరస్తులను కాపాడడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం చేస్తున్నారని, చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. 

దేశద్రోహ చట్టంలో మార్పులకు కేంద్రం ఓకే!

దేశ ద్రోహ చట్టంలో మార్పులకు కేంద్రం ఓకే చెప్పింది. ఇండియ్ పీనల్ కోడ్ సెక్షన్ 124(ఎ)లో వచ్చే వర్షాకాల సమావేశాల్లో మార్పులు తేవాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. దేశద్రోహ నేరం సెక్షన్ 124(ఎ) చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పీటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం (అక్టోబర్ 31) విచారణ జరిగింది. అంతకు ముందే.. విచారణలో భాగంగా కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఆ నోటీసులపై కేంద్రం మార్పులు చయనున్నట్లు పేర్కొంటూ వివరణ  ఇచ్చింది. దీంతో కేసు విచారణ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. కాగా దేశ ద్రోహ చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకూ సదరు చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అలాగే ఈ కేసు కింద అరెస్టయిన వారు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొంది. అటువంటి బెయిలు పిటిషన్లను కోర్టులు సాధ్యమైనంత త్వరగా విచారించి డిస్పోజ్ చేయాలని మాజీ సీజేఐ ఎన్వీరమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 124(ఎ)ను పున: పరిశీలించేందుకు కేంద్రానికి అనుమతించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పని పూర్తయ్యే వరకూ ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయరాదని    అప్పట్లోనే విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.  

నడ్డా ఉత్తుత్తి హాస్పటల్

తెలంగాణా న‌ల్గొండ జిల్లా ఫ్లోరైడ్ స‌మ‌స్య‌కు నిల‌యంగా మారింది. వాస్త‌వానికి ఇది చాలాకాలం నుంచి ఇక్క‌డ ఉన్న స‌మ‌స్య‌. దీనికితోడు ప్రతిపాదిత ఫ్లోరైడ్ నివార‌ణ కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి, దీని ప‌రిష్కా రం విషయమై ప్రజాప్రతినిధులు పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఇది జిల్లాలోని ఫ్లోరైడ్ బాధి తులలో అశాంతిని సృష్టిస్తుంది. జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో ప్రాంతీయ ఫ్లోరైడ్‌ నివారణ కేంద్రం ఏర్పా టు పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అంతకుముందు, ఫ్లోరోసిస్ బాధితులను క‌లిసి వారి స‌మ‌స్య‌లు విన్న‌ కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి , చౌటుప్పల్ సమీపంలో ఫ్లోరైడ్ పరిశోధన, నివారణ కేంద్ర ఏర్పాటు కూడా హామీ ఇచ్చారు. ప్రతిపాదిత ప్రాంతీ య ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం రోగనిర్ధారణ, పరిశోధనతో పాటు స్థానిక ప్రాంతాలపై నిఘా, పర్యవేక్షణ ద్వారా ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2012లో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ ఐఎన్‌) లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం ద్వారా హైదరాబాద్‌లో ప్రాంతీయ ఫ్లోరైడ్ నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కానీ, స్థల రద్దీని పేర్కొంటూ ఎన్ ఐఎన్ వెలుపల ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ ఐఎన్‌ ప్రతిపాదించింది. దీంతో జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీతో సహా కేంద్రం  అన్ని పనులను పర్యవేక్షించడానికి ఎన్ ఐఎన్‌ శాస్త్రవేత్త డాక్టర్ అర్జున్ ఎల్‌ ఖండారే నోడల్ అధికారిగా నియమితుల‌య్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ , మ‌ధ్య‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం మొద‌ల యిన ప‌ది రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.100 కోట్లతో ప్రాంతీయ ఫ్లోరైడ్‌ నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని 2014లో కేంద్రానికి సమర్పించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టులో ప్రతిపాదించారు.  ప్రాంతీయ ఫ్లోరైడ్‌ నివారణ కేంద్రంలో ఆర్ అండ్ బి యూనిట్‌, 20 పడకల ఆసుపత్రి, మొబైల్‌ హెల్త్‌ వ్యాన్‌, సోషల్‌ సైన్స్‌ యూనిట్‌, ట్రైనింగ్‌ యూనిట్‌ అభివృద్ధి చేయాలని కూడా ప్రతిపాదించారు. ఆర్ అండ్ బి యూనిట్లు రీసర్చ్ సబ్-యూనిట్ , బయో ఇన్ఫర్మేటిక్స్ యూనిట్లను కలిగి ఉంటాయి. 20 పడకల ఆసుపత్రి ఫ్లోరైడ్ రోగుల పునరావాసం కోసం ఉద్దేశించబడింది. అలాగే ఇద్దరు వైద్యులు,  ఆపరేషన్ థియేటర్‌తో సహా 16 మంది సిబ్బందిని నియమించారు. ఫ్లోరైడ్ మ్యాపింగ్, ఓరల్ హెల్త్ కేర్, స్థానిక ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 20 మంది కూర్చునే మొబైల్ హెల్త్ వ్యాన్ కూడా ప్రతిపాదించబడింది. అంతేగాక‌, 18 మంది సిబ్బందితో ప్రతిపాదిత సాంఘిక శాస్త్ర విభాగం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంలో ప్రస్తుత తరానికి అవగా హన కల్పించడంలో, ప్రేరేపించడంలో మరియు ప్రవర్తనలో మార్పు చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. జిల్లా ఫ్లోరైడ్‌ మాని టరింగ్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ శంకర్‌బాబు తెలంగాణ టుడేతో మాట్లాడుతూ మల్కాపూర్‌లో ఎనిమిది ఎకరాల భూమిని తమకు అప్పగించాలని 2014 అక్టోబర్‌లో జిల్లా యంత్రాంగం ఎన్‌ఐఎన్‌కు లేఖ రాసిందని, అయితే జాతీయ విద్యాసంస్థ స్పందించలేదని అన్నారు. డీపీఆర్  సమర్పించిన తర్వాత కూడా జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 2014లో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటే షన్ జాయింట్ సెక్రటరీకి డాక్టర్ అర్జున్ ఎల్ ఖండారే లేఖ కూడా రాశారు. ప్రతిపాదిత కేంద్రంపై తెలంగాణ ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీసం హైదరాబాద్‌లో అద్దె భవనంలోనైనా కేంద్రాన్ని ప్రారంభించి ఉండేవారు. ప్రాంతీయ ఫ్లోరైడ్ నివారణ కేంద్రంపై జరుగుతున్న జాప్యం ఈ విషయంలో దాని నిబద్ధతపై సందేహాలకు ఆస్కారం కలిగిస్తోంది. ఫ్లోరోసిస్ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లాలోని మర్రిగూడ మండల కేంద్రంలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా మని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హామీ ఇచ్చారు. మంగళవారం మర్రిగూడలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ, జె.పి.న‌డ్డాను కలిసేందుకు ఇక్కడికి వచ్చిన సుమారు 50 మంది ఫ్లోరోసిస్ బాధితుల బాధలను ఓపికగా విన్న కేంద్ర మంత్రి ఆసుపత్రికి హామీ ఇచ్చారు. 2012లో రాష్ట్ర భాజపా పోరుబాటలో పాల్గొనేందుకు మర్రిగూడ వచ్చిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని, కేంద్రాన్ని పాలించిన గత ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, ఫ్లోరోసిస్ బాధితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ఏర్పాటు చేసేందుకు ఫ్లోరోసిస్ బాధితు లను న్యూఢిల్లీకి తీసుకెళ్తానని నడ్డా హామీ ఇచ్చారు.

పవన్ రావాలి, జగన్ పోవాలి... వైసీపీ విద్యార్ధి భేరీలో నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంది. దీన్ని విపక్షాలు రాజకీయలబ్ధికోసమే ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నారని దుమ్మెత్తిపోస్తున్నాయి. మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్ర కూడా ఎంతో అభవృద్ధి పొందగలదని ప్రభుత్వం చెబుతోంది. కానీ రియల్ఎస్టేట్ దందాను పెంచుకోవడానికి జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారేగాని రాష్ట్ర ప్రయోజనాలపరంగా ఆలోచించడంలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే మూడు రాజధా నులే మంచిదని, వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నాయక త్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలి నిర్వహించారు. వైసీపీ ర్యాలిలో విద్యార్థు లు సీఎం జగన్ కు వ్యతిరేకంగాను, అధికారంలోకి  జనసేన  రావాలనీ  నినాదాలు చేయడం నాయకులకు నోట మాట రాలేదు,  ఒక దశలో విద్యార్థులు సీఎం పవర్ స్టార్ అంటూ భారీ నినాదాలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ ర్యాలీలో చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని కోసం మాట్లాడారు.  వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడంలో ఆంతర్యం అన్ని ప్రాంతాలను సమానంగా చూడడం, అభవృద్ధి కూడా సమానంగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయంతోనే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ధర్మశ్రీ అన్నారు.  అమరావతిని రాజధానిగా ప్రజలంతా నమ్ముతున్నారని, అందుకే రైతులు తమ భూములను ఇచ్చారని ఇప్పుడు తన రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు జగన్ తెచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి.  రాయలసీమ ప్రాంతీయులు జగన్ ఆలోచనను సమర్ధించారు. వారి ప్రాంతంలోని కర్పూలును లీగల్ క్యాపిటల్ గా  జగన్ పేర్కొన్నారు. కానీ  మూడు రాజధానులతో ఏ ప్రాంతానికి సమ న్యాయం జరిగే అవకాశం లేదని విపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు.  టీడీపీ, జనసేన పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాళ్లు బానిసలుగా ఉండాలన్నారు. విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు.  కాగా, రాజధాని విషయంలో ప్రస్తుతం రెండు ఉద్యామాలు నడుస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించా ల్సిందేనంటూ ఆ ప్రాంత రైతాంగం చాలా రోజులుగా ఉద్యమిస్తున్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ మహా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో అందరి మద్దతును సంపాదించారు. ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం విశ్వయత్నాలు చేసి విఫలమయింది. వైసీపీ నేతల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నల్ల బెలూన్లు లతో, మూడు రాజధానుల మద్దతుగా ఫ్లెక్సీలతో మూడు రాజధానుల మద్దతుదారులు, వైసీపీ నేతలు రైతుల పాదయాత్రకు నిరసన తెలుపుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీ ఆందోళనలకు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులు కావాలని ఇటీవల విశాఖ గర్జన నిర్వహించారు.  ఇదిలా ఉండగా, మూడు రాజధానులకు మద్దతునిస్తూ విశాఖ జిల్లాలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల నాయకత్వంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమ అభివృద్ధికి నోచుకుంటాయని నినాదాలు చేశారు. అంతేగాక మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా కి కూడా వెనుకాడటం లేదు. విశాఖ గర్జన విజయవంతమయిందని వైసీపీ నాయయకులు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. కాగా ఇటీవల తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. తమప్రాంతానికి రాజధాని తేవాలని మూడురాజధానుల యోచనకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ కూడా చేపట్టారు. 

లాజిక్కుకు అందవు .. కేసీఆర్ మాటలు డమ్మీ తూటాలే..

కేసీఆర్  మాటల మాంత్రికుడు.. ఎదుటి వారిని మెస్మరైజ్ చేసే వాగ్ధాటి ఆయన సొంతం.. ఆ వాగ్ధాటితోనే తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. ఆ వాగ్ధాటితోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల ఉనికిని నామమాత్రంగా చేసి దాదాపు ఏకఛద్రాధిపత్యం సాగించారు. కానీ ఇప్పుడు ఆ వాగ్ధాటిలోని డొల్లతనాన్ని విపక్షాలే కాదు.. జనసామాన్యం సైతం గుర్తిస్తున్నారు. ఇష్టారీతిన విమర్శలు గుప్పించేయడం.. ఆధారాలు, హేతువు గురించి ఇసుమంతైనా పట్టించుకోకపోవడం.. యెడాపెడా హామీలు గుప్పించేసి ఆ తరువాత వాటి ఊసే ఎత్తకపోవడాన్ని విపక్షాలే కాదు.. జనం సైతం నిలదీస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రసంగిస్తుంటే.. సైద్ధాంతికంగా ఆయనతో విభేదించే వారు కూడా ఏకీభవించేవారు.. ఆయన మాటల ధార అలాంటిది. అందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, ఆఖరికి వామపక్షాలు కూడా తెలంగాణ విషయంలో చీలిక అంచుల వరకూ వెళ్లిపోయాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అయితే ఒకటి సమైక్యాంధ్ర అంటే.. మరొకటి ప్రత్యేక తెలంగాణ అన్నాయి. సమైక్యాంధ్ర అన్న పార్టీలోనూ మెజారిటీ క్యాడర్ ప్రత్యేక తెలంగాణ పల్లవే ఎత్తుకుంది. అలాగే క్రమశిక్షణకు మారు పేగా ఉండే తెలుగేదేశంలో కూడా సమైక్య, ప్రత్యేక వాదాలతో విభేదాలు పెచ్చరిల్లాయి. రెండు ప్రాంతాలలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం ఆ కారణంగానే తెలంగాణలో బలహీన పడింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధిష్ఠానం రాష్ట్ర విభజనకు సై అంటే అధిష్ఘానం నిర్ణయాన్ని ఆంధ్రప్రాంత నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించారు. లగడపాటి, ఉండవల్లి లాంటి వారు రాజకీయ సన్యాసం చేశారు. అలా చేయడానికి ముందు చివరి క్షణం వరకూ సమైక్యాంధ్ర కోసం నినదించారు. అదంతా గతం. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. గతంలో సమైక్యాంధ్రకు జై కొట్టిన పలువురు ఇతర పార్టీ నేతలను తెలంగాణకు జై అనిపించి పార్టీలో చేర్చుకుని కీలక పదవులు కట్టబెట్టారు. ఇదంతా కేసీఆర్ మాటల మరాఠీ కావడం వల్లనే జరిగింది. అయితే రాను రాను ఆయన మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప కూడా దాటడం లేదన్న గ్రహింపు జనబాహుల్యంలో కలిగింది. ఎప్పటికీ పూర్తి కాని రుణమాఫీ, ఎవరికి ఎందుకు అందుతోందో అర్థంకాని దళిత బంధు.. కేవలం ఎన్నికల ముందే గుర్తుకు వచ్చే హామీలు.. క్రమంగా ప్రజలలో కేసీఆర్ పట్ల వ్యతిరేకతకు బీజాలు వేశాయి. అవి మొలకలెత్తుతున్న సంకేతాలు దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతోనే కనిపించాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ముచ్చటగా మూడో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం దక్కుతుందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేసే పరీక్షగా మారింది. అయితే ఈ సారి మాత్రం ఆయన మాటల మాయలు సాగడం లేదనడానికి తార్కానాలు కనిపిస్తున్నాయి. ఆయన చేసి నిలుపుకోని వాగ్దానాలపై విపక్షాలే కాదు.. ప్రజలూ గళం ఎత్తుతున్నారు. కేసీఆర్ కేంద్రం డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందని కేసీఆర్ విమర్శిస్తే.. వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజల భారాన్ని మీరే తగ్గించొచ్చుగా అని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వోద్యోగుల జీతాలు ప్రతి నెలా మొదటి తేదీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న ప్రశ్న ప్రజల నుంచే వినిపిస్తోంది. ఇక తాజా సంఘటన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేసీఆర్ బీజేపీపై విమర్శల బాణం ఎక్కుపెడితే..ప్రతి విమర్శల అస్త్రాలు సూటిగా వచ్చి కేసీఆర్ కే తగులుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపిస్తే విపక్షాలే కాదు జనం సైతం ఆ అమ్ముడుపోవడానికి సిద్ధపడిన ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కేసీఆర్ ఇరత పార్టీల వారిని ఆకర్షిస్తే ఆపరేషన్ ఆకర్ష్.. అదే పని ఇతర పార్టీ వారు చేస్తే కొనుగోలూనా అని నిలదీసే పరిస్థితి మునుగోడులో ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇక తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలుకు ముందుకు రాని కేంద్రం.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చింది అని కేసీఆర్ విమర్శిస్తే.. కొనుగోలు కోసం వారు తీసుకు వచ్చిన సొమ్ము ఏది? సోమ్ము కనిపించకుండా ఉత్తుత్తి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అన్న ప్రశ్నలు ఎదురు వస్తున్నాయి.  ఒక వేళ బీజేపీ జంప్ జిలానీలను ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నం నిజమే అయానా.. అది కేసీఆర్ నేర్పిన విద్యయే కదా అని జనం చర్చించుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కు అనుకున్నంతగా ప్లస్ కాలేదని పరిశీలకులు అంటున్నారు. ఎంత హడావుడి చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కే బూమరాంగ్ అయినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.  మొత్తం మీద లాజిక్కు లేని కేసీఆర్ మాటలన్నీ డమ్మీ తూటాలేనని తేలిపోవడం తోనే మునుగోడు ఉప ఎన్నిక లో కేసీఆర్ కు పెద్దగా శుభ శకునాలు కనిపించడం లేదని విమర్శకులు అంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సొంత మనుషులు ఆరోపణలు ఎదుర్కొవడంతో కేసీఆర్ దిక్కు తోచని స్థితిలో మునుగోడు ప్రచారాన్ని గాలికి వదిలేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నికలు కేసీఆర్ కు పెద్దగా అచ్చి వచ్చినట్లు లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హుజూరాబాద్ ఫలితం మరోసారి రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పరిశీలకులలోనే కాదు.. పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమౌతున్నాయి. 

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో  ఆయన్ను గత ఏప్రిల్ లో అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దుచేయాలని చిత్లూరు జిల్లా వన్ టౌన్ పోలీసులు అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం సోమవారం  నారాయణ బెయిల్ ను రద్దు చేసింది.  గతేడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లా నెళ్లేపల్లి హైస్కూల్లో టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా లీకయింది.  అప్పట్లో ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఈ కేసు కలకలం రేపింది. దీనికి వెనుక మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్టు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.  ఆయన్ను కోర్టుకు హాజరుపర్చగా 2014లోనే నారాయణవిద్యాసంస్థల అధినేత బాధ్యతలనుంచి తాను తప్పుకున్నారని ాయన తరఫు న్యాయవాదులు కోర్టెకు తెలిపారు. అప్పుడు ఆయనకు ఇచ్చిన బెయిల్ ఇప్పుడు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దుచేసింది.