కాణిపాకం ఆలయంలో బంగారు విభూది పట్టీ చోరీ.. అర్చకుడే దొంగ!
posted on Oct 29, 2022 6:08AM
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి చోరీకి గురైంది. సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బావిలో నుంచి వెలసిన విఘ్నేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. నిత్యం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొంది తరిస్తుంటారు
స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని ఓ దాత విరాళంగా అందించారు.
ఆ విభూది పట్టీ ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీన కుంభాభిషేకం సందర్భంగా స్వామి వారికి అలంకరించారు. అంతే ఆ రోజు నుంచీ అది కనిపించడం లేదు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ విభూది పట్టీని విరాళంగా ఇచ్చిన దాత తనకు రశీదు ఇవ్వలేదంటూ..అధికారులను సంప్రదించడంతో ఆ బంగారు విభూది పట్టీ కనిపించడం లేదన్న విషయం వెల్లడంది. దీంతో ఆ ఆభరణం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఇంతలో గత 45 రోజులుగా కనిపించని ఆ ఆభరణం ఆలయ యోగశాలలో ప్రత్యక్షమైంది.
ఈ విభూది పట్టీని వేలూరుకు చెందిన ట్రస్ట్ విరాళంగా అందజేసింది. ఈ ఆభరణం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుంది. సాధారణంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి భక్తితో అందించిన విరాళాలకు సంబంధించిన రసీదును ఇస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆలయానికి ముగ్గురు మంత్రులు రావడం, కుంభాభిషేకం కావడంతో అధికారులు హడావుడిలో ఉండి రసీదు ఇవ్వలేదు. విభూది పట్టీని మాత్రం స్వామి వారికి అలంకరించారు.
అయితే ఎన్ని రోజులైనా రసీదు రాకపోవడంతో విభూది పట్టీని విరాళంగా ఇచ్చన ట్రస్ట్ దాతలు రసీదు గురించి అధికారులను సంప్రదించారు. అప్పుడు విభూది పట్టీ మాయమైన సంగతి వెలుగులోనికి వచ్చింది. ఇంతకీ ఆ విభూది పట్టీని కాజేసింది ఆలయ అర్చకుడేనని తేలింది. లక్షల విలువ చేసే ఆభరణం విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దాతలు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇంత జరిగినా విభూదిపట్టి కాజేసిన ఆలయ అర్చకుడిపై అధికారులు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే విభూది పట్టి మాయం అయిన ఘటన బయటకు వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని అధికారులు, పాలక మండలి విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.