బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం
posted on Oct 29, 2022 9:28AM
పోలీసుల తీరుకు నిరసనగా బుద్ధా వెంకన్న చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖలో తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరిన బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో గురువారం(అక్టోబర్ 27) మధ్యాహ్నం నుంచి తన ఇంటి వద్దే బుద్దా వెంకన్న నిరవధిక దీక్షకు దిగిన సంగతి విదితమే. వెంకన్న దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు బుద్ధా దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిరశన దీక్ష కారణంగా బుద్ధా వెంకన్న సుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయని వైద్యులు సూచించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో బుద్ధా వెంకన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు బుద్ధా సుగర్ లెవల్స్ పడిపోయాననీ, వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోనికి దింపి బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసుల చర్యను గర్హిస్తూ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తమ జీపుకు అడ్డు పడిన వారిని పక్కకు లాగేసి బుద్ధాను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.