కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్
posted on Nov 19, 2022 @ 4:27PM
మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మాజీ మంత్రి, కేంద్ర విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రిమర్రి శశిథర్ రెడ్డి హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకున్న సంగతి విదితమే.
బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణల తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రిశశిధర్ రెడ్డి నేడో రేపో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. అంతకు ముందు మర్రి శశిధర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన, ఢిల్లీ వెళ్లినంత మాత్రానా హోంమంత్రిని కలిసినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. అయితే జరుగుతున్న పరిణామాలను గమనించి ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్.. ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే సస్పెన్ష్ వేటు వేసింది.
కాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిణామం దుమారాన్ని లేపింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పరిణామాలపై స్పందించారు. మర్రి శశిధర్ రెడ్డిపై వేటుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే అందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బాధ్యత వహించాలన్నారు. మునుగోడు ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
జూమ్ మీటింగ్ లు పెట్టి కులాసా కబుర్లు చేప్పుకోవడమేమిటని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న మాట వాస్తవమేనన్నారు. అందుకే మర్రి శశిధర్ రెడ్డి ఇబ్బంది పడి ఉంటారని చెప్పారు. ఆయనతో పార్టీ నాయకత్వం మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.