తెలంగాణ గడ్డపై పొడుస్తున్న కొత్త పొత్తులు.. టార్గెట్ బీజేపీయేనా?
posted on Feb 10, 2023 7:08AM
తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు దగ్గరవుతున్నాయా? రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలుపుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అంతే కాదు ఈ రెండు పార్టీల కలయిక వెనక బీఆర్ఎస్ పోషిస్తున్న పౌరోహిత్యం పాత్రను కూడా కొట్టి వేయలేమని రాజకీయ పరిశీలకులు తాజా పరిస్థితులు, పరిణామాలను విశ్లేషిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో లౌకికవాద పార్టీలన్నీ ఎన్నికలకు ముందు ఏక తాటిపైకి వచ్చినా రాక పోయినా, ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి ఖాయంగా ఒకటవుతాయని అంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే స్కెచ్ సిద్దం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారని, అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం జుగల్బందీకి కూడా సెక్యులర్ సంబంధాలే కారణమని అంటున్నారు.
నిజానికి రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీనుందా అంటే లేదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా బలాన్ని పుజుకుంటోందనే అనుమానం అయితే బీఆర్ఎస్ సహా బీజేపీ ప్రత్యర్హ్ది పార్టీలు అన్నిటినీ వెంటాడుతోందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఏ విధంగా అయితే, మతోన్మాద బీజేపీ ఓడించడం కోసం అంటూ బీఆర్ఎస్ తో చేతులో కలిపాయో, రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం సహా బీజేపీ యేతర పార్టీలన్నీ లౌకికవాదం కోసం ఒకటైనా ఆశ్చర్య పోనవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ బలం పరిమితమే అయినా, అధికార బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలన్నీ బీజేపీనే బూచిగా చూస్తున్నాయి. ఒక విధంగా భయపడుతున్నాయని అంటున్నారు. అందుకు ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉండడం ఒక కారణం అయితే, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమవడం మరొక కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రోజు రోజుకు మరింత బలహీనమవుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలలో అధిక సంఖ్యాకులు కాళ్ళ పారాణి ఆరక ముందే అధికార పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం బలపడుతోంది. అయినా ఇప్పటికీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చును కానీ, ముందు ముందు బీజేపీ బలం పుంజుకుంటే... అనే ఆలోచనతో బీజేపీ యేతర పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చేదుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారని. అంటున్నారు. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నా, అంతకు ముందు రోజే జూనియర్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య అసెంబ్లీలో హాట్ హాట్ గా నడిచిన పరస్పర విమర్శల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలాగే, ఈ సంవాదం సందర్భంగా ఒవైసీ ఉద్దేశ పూర్వకంగా అన్నారో వ్యూహత్మకంగానే అన్నారో గానీ, ఈసారి ఎన్నికల్లో 50 స్థానల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, కనీసం 15 మందిని గెలిపించుకుంటుందని అన్నారు. ఆ వెంటనే 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్ కే ఉంటుంది అన్నారు. మరోవంక అక్బరుద్దీన్‌తో భేటీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలోమాట మాట్లాడారు.
ఎంఐఎం కూడా సెక్యూలర్ అంటుంది కాబట్టే తాము అక్బరుద్దీన్‌ను కలిశామని జగ్గారెడీ అంటే, అక్బరుద్దీన్‌తో జరిగింది రాజకీయ భేటీ కాదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని కాంగ్రెస్ నాయకులు కొంచెం చలా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. అదే సమయంలో ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని భట్టి పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో మంచి చెడు మాట్లాడుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ తమతో చెప్పారని తెలిపారు. పొత్తుల వ్యవహరం ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవసి ఉంటుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే, బీజేపీయేతర పార్టీలు సెక్యులర్ వేదికను సిద్దం చేస్తునట్లు ఉందని అంటున్నారు.