తార్కిక ముగింపు దిశగా వివేకా హత్య కేసు.. సజ్జల కుట్ర భాష్యం అందుకేనా?

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలం అనుమాలు ఉన్నాయన్న అభిప్రాయం సామాన్యజనంలో ఉండేది. ఇప్పుడు అది దాదాపుగా నివృత్తమైందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కేసులో తాడేపల్లి ప్యాలెస్ ఇరుక్కుందన్న విషయం వైసీపీ శ్రేణులకే కాదు.. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి కూడా అవగతమైంది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన రోజు నుంచీ వైసీపీలో ఆరంభమైన గాభరా.. శుక్రవారం (ఫబ్రవరి  3) సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో మరింత పెరిగింది. అందుకే వారెక్కడా మీడియా కంటబడకుండా, మీడియాతో మాట్లాడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని విచారణ నుంచి బయటకు వచ్చిన వెంటనే వారిని ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ల విచారణ తరువాత వివేకా హత్య కేసులో ఏవన్ అయిన గంగిరెడ్డిని శనివారం విచారించనుంది. వరుసగా సంభవిస్తున్న పరిణామాలలో వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులు ఉన్నారన్న నమ్మకం బలపడుతూ వస్తోంది. అదే వైసీపీలో కంగారుకు కారణమౌతోంది.  వివేకా హత్య జరిగిన నాటి నుంచీ గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడం దగ్గర నుంచీ, ఆ తరువాత ఈ హత్య వెనుక ఉన్నది నారా చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించడం వరకూ..ఇక కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్నది ఆయన కుమార్తె సునీత, ఆమె భర్తే అంటూ ఆరోపణలు చేయడం వరకూ వైసీపీ ఈ కేసులో లోతుల్లెకి వెళ్లి దర్యాప్తు జరగకుండా అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. పన్నని కుట్ర లేదు. ఏకంగా సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు, కడపలో వారికి బెదరింపుల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. అయితే పట్టు వదలకుండా వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చేసిన న్యాయపోరాటం కారణంగా కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చిన తరువాత.. దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇన్నేళ్లుగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. కనీసం విచారణకు కూడా రావలసిన అవసరం లేకుండా మేనేజ్ చేసుకోగలిగిన అవినాష్ రెడ్డి అనివార్యంగా సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టిన సీబీఐ.. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కు సన్నిహితంగా మెలిగే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను పిలిపించుకుని విచారించింది. ఇప్పుడు వెంటనే గంగిరెడ్డిని విచారించడంతో అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపే అనుమానంగా చూస్తున్నాయి. వివేకా హత్య వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఈ కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ రాద్ధాంతం చేయడానికి సిద్ధపడుతోంది. ఇందుకు తొలి పలుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంటే వచ్చింది. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.  వివేకా హత్య కేసులో వైసీపీ ఎన్ని యూటర్న్ లు తీసుకుందో లెక్కే లేదు. గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మించడానికి చేసిన ప్రయత్నం నుంచి  చంద్రబాబు,  వివేకా కుమార్తె, అల్లుడులపై ఆరోపణల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో వైసీపీ పెద్దల ప్రమేయం బయటపడటం ఖాయమని తేలిన తరువాత ఇక ఇప్పుడు అనివార్యంగా కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అక్రమాస్తుల కేసులు జగన్ అరెస్టయిన సందర్బంగానూ వైసీపీ దాదాపుగా ఇటువంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే.   తెలుగుదేశం, కాంగ్రెస్ లు కుట్ర చేశాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇంత కాలం అనుమానాలుగా ఉన్న విషయాలపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జోరందుకున్న తరువాత స్పష్టత వస్తోంది.  అదే వైసీపీని గాభరాపెడుతోంది. అందుకే కుట్ర అంటూ గగ్గోలు పెడు తోంది.   

జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. సీజేఐకి న్యాయవాది లేఖ

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  గత నెల 31న విచారణ జరగాల్సి ఉండగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో గత నెల 30న  జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  జగన్ ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సుప్రం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఓ న్యాయవాది.  త్వరలో విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని ప్రకటించడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్  కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఏపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ విశాఖ రాజధాని అని ప్రకటించడం ద్వారా ఏపీ సీఎం జగన్  కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, జగన్ పై సుమోటాగా చర్యలు తీసుకోవాలని ఆయన సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

హతవిధీ ఇదేం కొలువు.. జగన్ సర్కార్ లో బ్యూరోక్రాట్ల పరిస్థితి దయనీయం!

జగన్ సర్కార్ లో హైరార్కీ అన్నది కాగడా వేసి వెతికినా కనిపించదు. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పని చేయడమే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. బహుశా స్వతంత్ర భారత దేశంలో అధికారుల సేవలను ఇంతగా తన అవసరాల కోసం వాడుకున్న సీఎం జగన్ వినా ఎవరూ ఉండకపోవచ్చు. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఔను సీఎస్ స్వయంగా వారిని విచారిస్తున్న జైలు వద్దకు వెళ్లి విచారణ పూర్తి కాగానే తన కారులో ఎక్కించుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డిని వాచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పికే నవీన్ లను సీబీఐ శుక్రవారం ( ఫిబ్రవరి 3)న విచారించింది. వారిరువురినీ కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లోదాదాపు 6 గంటల పాటు విచారించింది. విచారణ  ముగిసిన అనంతరం వారు బయటకు రాగానే సీఎస్ జవహర్ రెడ్డి వారిరువురినీ తన కారులో  తిరుపతి విమానాశ్రాయానికి అక్కడ నుంచి విమానంలో తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఒక కేసులో విచారణకు హాజరైన ఇరువురి విషయంలో అంత శ్రద్ధ తీసుకుని విచారణ ముగిసిన అనంతరం స్వయంగా పికప్ చేసుకని మరీ తాడేపల్లికి తోడ్కొని రావడం సంచలనంగా మారింది. ఇరువురినీ విచారణ ముగిసిన తరువాత పికప్ చేసి తీసుకుని రావడమే కాదు.. తాడేపల్లి నుంచి కడపకు ఈయనే డ్రాప్ చేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పికప్ ఆండ్ డ్రాప్ పనులు చేయడమేమిటన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాదు సామాన్యులలో కూడా జోరుగా సాగుతోంది. జగన్ సర్కార్ లో సీఎస్ కు పనీపాటా లేదా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.   ఒక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను సీఎస్ ఇలా తన కారులో పికప్ చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కొని రావడం తీవ్రమైన విషయమనీ, ఇది దర్యాప్తును ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా ఈ హత్య కేసులో నిందిుతలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహయం, సహకారం అందడం తీవ్ర మైన విషయంగా చెబుతున్నారు. సీఎస్ ఎందుకోసం, ఎవరి కోసం ఇలా చేస్తున్నారో అర్ధమౌతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.   అయినా జగన్ సర్కార్ లో అధికారులను అడ్డగోలుగా వాడుకోవడం.. చివరికి ఎక్కడైనా తేడా కొడితే నిర్దాక్ష్యిణ్యంగా బలిపశువులను చేసి వదిలించుకోవడం అనవాయితీగా మారిపోయిందని రాజకీయవర్గాలు అంటున్నారు. జగన్ సీఎం కావడానికి ముందు నుంచే ఆయన చెప్పినట్లల్లా నడుచుకున్న అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎంత అవమానకర రీతిలో ఆ పదవి నుంచి సాగనంపారో తెలిసిందే కదా అంటూ ఉదహరిస్తున్నారు. ఆ తరువాత  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయమే తీసుకుంటే.. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా, విపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఆయన పోలీసు అధికారిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉద్యోగుల చలో విజయవాడను విఫలం చేయడంలో ఏపీ పోలీసు వైఫల్యం ఆయన పదవికి ఎసరు తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్.. సునీల్.. విపక్ష నేతలు, సామాన్యులపై అడ్డగోలు కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధించారు. కనీస ఫార్మాలటీస్ కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నారంటూ కోర్టులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఏలిన వారి సేవలో తరించారు. అటువంటి సీఐడీ మాజీ చీఫ్ ను కూడా జగన్ సర్కార్ కూరలో కరివేపాకు మాదిరిగా ఆ పదవి నుంచి పక్కకు పెట్టేయడమే కాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. ఇక తాజాగా గవర్నర్ కార్యదర్శి సిసోడియాకూ అటువంటి మర్యాదే చేసింది. జగన్ సర్కార్. ఏరి కోరి గవర్నర్ కార్యదర్శిపదవిలో నియమించిన ప్రభుత్వమే ఆయనను నిర్దాక్షిణ్యంగా ఆ పదవి నుంచి బదలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సిసోడియా అత్యంత విశ్వాసపాత్రుడు. గవర్నర్ కు వచ్చే ఫిర్యాదులను సిసోడియా లీక్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్ష నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకకుండా చేయడం, అలాగే కీలక విషయాలు గవర్నర్ దృష్టికి వెళ్లకుండా చేయడంలోనూ సిసోడియా కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలనూ ఆయన ఎదుర్కొన్నారు. అటువంటి సిసోడియాపై సర్కార్ బదలీ వేటు వేయడం, ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆయన కూడా జగన్మాయకు బలిపశువు అయ్యారని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ సిసోడియాపై వేటుకు కారణమేమిటంటే.. గవర్నర్ కు ఉద్యోగుల అపాయింట్ మెంట్ దొరకడమే. ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడమే. ఉద్యోగ సంఘాల నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇప్పించింది సిసోడియానే అన్న నిర్ధారణకు వచ్చిన జగన్ సర్కార్ ఆయనపై బదలీ వేటు వేసిందని అంటున్నారు. ఇక జగన్ సర్కార్ లో అధికారుల విధి నిర్వహణ మొత్తం జగన్ మెప్పు పొందడం కోసమే అన్నట్లుగా మారిందనీ, ఆ పారామీటర్లు చేరుకోలేని వారెవరినైనా ప్రభుత్వం స్పేర్ చేయదనీ ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

అబద్ధాల పుట్ట.. తప్పుల తడక.. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ బాకా ఊదడానికే పరిమితమైందని విపక్షాలు విమర్శించాయి. ఎంత సేపూ ప్రభుత్వ పథకాలను ఆకాశానికి ఎత్తేయడమే తప్ప రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం లేదని దుయ్యబట్టాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ధరణి పోర్టల్ వంటి అంశాలు గవర్నర్ ప్రస్తావించనే లేదన్నారు. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్ట అని అభివర్ణించారు. ఈ ప్రసంగం చేయడం కంటే గవర్నర్ ప్రసంగం లేకుండా గత ఏడాది మాదిరిగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఆమె ప్రసంగం మొత్తంలో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావనకైనా రాలేదని నిలదీశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అంటూ చెప్పడం శుద్ధ అబద్ధమని జీవన్ రెడ్డి అన్నారు. అలాగే  దళితబంధు పేరుతో దళితుల్నిప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ తమిళిసై ప్రసంగం మొత్తం తప్పుల తడక అని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అన్నదిపూర్తిగాఅవాస్తవమని, ఎక్కడా వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందడం లేదన్నారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ గురించి గవర్నర్ ప్రసంగంలో అసలు మాట్లాడనేలేదని ఈటల అన్నారు.  

తెలుగుదేశంకే స్వల్ప మొగ్గు.. ఆత్మసాక్షి సర్వే

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడం అధికార వైసీపీకీ, విపక్ష తెలుగుదేశం కు కూడా నల్లేరు మీద బండి నడక కాదు. తీవ్ర మైప ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న.. వైసీపీ, బలంగా పుంజుకున్న తెలుగుదేశం కూడా ఎన్నికలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ,   . పొత్తులు, పోటీలపైనే కాకుండా,  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చోపచర్చలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి. ఇప్పటికే   రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధకారంలోకి ఏ పార్టీ వస్తుంది, పొత్తులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పొత్తులు లేకుండా వేర్వేరుగా పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఏలా ఉంటుంది అన్న విషయంపై పలు రకాల సర్వేలు వచ్చాయి.  అయితే తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం వైపు స్వల్ప మొగ్గు ఉంటుందని తేలింది. ఔను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 78 స్దానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే సింపుల్ మెజారిటీకి మాత్రం ఆ పార్టీ అడుగు దూరంలోనే నిలిచిపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక వైసీపీ 63 స్థానాలలో గెలిచి రెండో స్థానంలో నిలుస్తుంది.  ఇక జనసేన కేవలం 7 స్థానాలకే పరిమితమౌతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా 27 స్థానాలలో పోటీ ఉంటుందని పేర్కొంది. అయితే తుది ఫలితం మాత్రం ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ఆధారపడి ఉంటుందని, అయితే తెలుగుదేశం పార్టీ కనీసం 36 స్థానాలలో ప్రస్తుత అభ్యర్థులు లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది. అలాగే వైసీపీ కూడా కనీసం 50 స్థానాలలో సిట్టింగులను లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది.  అంటే తెలుగుదేశం కు స్వల్ప మొగ్గు కనిపించినా, అభ్యర్థుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ భారీగా నష్టపోకతప్పదని సర్వే వెల్లడిస్తోంది. ఇదే పరిస్థితి వైసీపీకి కూడా ఉందని చెబుతోంది. వివిధ సామాజిక వర్గాల మొగ్గు, ఆయా వర్గాలను ఆకట్టుకునే విషయంలో తెలుగుదేశం, వైసీపీలకు ఉన్న సానుకూలతలు, వ్యతిరేకతలు, ఇంకా పొత్తులు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి. పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమిటి? అన్న అంశాలపై సమగ్ర విశ్లేషణతో పూర్తి సర్వేను త్వరలో వెల్లడించనున్నట్లు శ్రీ ఆత్మసాక్లి ఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు.. కేసీఆర్, తమిళిసైల మధ్య విభేదాలకు తెర!

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి.. కేసీఆర్ సర్కార్ కు మధ్య  గత మూడేళ్లుగా రగులుతున్న విభేదాల మంట టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఉన్న అగాధం పూడిపోయింది. ఇంత కాలం ఉప్పు నిప్పులా, విమర్శలు, ప్రతి విమర్శలతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలు చల్లారిపోయాయి. ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ తమిళసై దిగజారిస్తే.   గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం, రాజ్ బవన్ ను బీజేపీ కార్యాలయంగా చేశారని ఆరోపించడమే కాకుండా, గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా ఇవ్వకుండా అవమానించారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి, మర్యాద గీత దాటేశాయి అనే అంతా అనుకున్నారు. అలాంటిది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీన్ ఒక్క సారిగా మారిపోయింది.  తెలంగాణ బడ్జెట్ కు అనుమతి విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న దశలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తన పిటిషన్ ఉపసంహరించుకుంది. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఇలా రాజీ కుదిరింది. దీంతో సీన్ మారిపోయింది.  శుక్రవారం (ఫిబ్రవరి 3) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  అంతకు ముందు.  అసెంబ్లీకి వచ్చిన  గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురేగి, గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు. ఆ తరువాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.   ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభించారు. తన ప్రభుత్వం (my government) అంటూ ప్రసంగం ఆరంభించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అంటూ ప్రస్తుతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిథుల నిర్విరామ కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ సర్కార్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు.  దేశానికే ధాన్యాగరంగా ఆదర్శంగా మారిందన్నారు.  సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి సిద్ధం చేసి ఇచ్చిన ప్రతినే గవర్నర్ తమిళిసై చదివారు. ఎక్కడా తన సొంత అభిప్రాయాలను వెల్లడించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, కొత్త సచివాలయం, వైద్య కళాశాలల పెంపు ఇలా అన్ని అంశాలనూ స్పృశిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు.  దీంతో గవర్నర్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుతారో అన్న టెన్షన్ తో ఉన్న ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలకు పూర్తిగా తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

నిజానికి ఒక తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ దాడులు, సోదాలపై రాజకీయ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా  సోదాల దారి సోదాలదే, ఆరోపణల దారి ఆరోపణలదే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ సోదాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా  హైదరాబాద్ లో మరో మారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి.  ఈ ఏడాది  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటీ అధికారులు తరచూ రైడ్స్ నిర్వహించడం ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ కు గురిచేస్తున్నాయి.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో గురువారం (ఫిబ్రవరి 3)ను పెద్దం సంఖ్యలో ఐటీ అధికారులు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయనకు సంబంధించిన  కంపెనీల్లో సోదాలు చేసిన ఐటీ ఇప్పడు ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది.  ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో దాడులు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తరువాత,  తాజాగా ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఐటీ అధికారులు ఎమ్మెల్సీ ఇంట్లో, ముప్పా, వెర్టెక్స్ కంపెనీల్లో సైతం ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ రైడ్స్ సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలా   తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీలు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  జరిగాయి. కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఇప్పుడు ఐటీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో దాడులు జరుగుతున్నాయి.

బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటలకు?

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. విడతల వారీ పాదయాత్రలను సక్సెస్ ఫుల్ గా ముగించినా, ఆ పాదయాత్రల ప్రారంభానికి, ముగింపునకు ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చి ఆర్భాటం చేసినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు మైలేజీ రాలేదా?  పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి కానీ, పార్టీ ఇమేజ్ ప్రజలలో ఇసుమంతైనా పెరగలేదా? ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారైందా? రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పట్ల ఆందోళనలో ఉందా? గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవలసిన చర్యలపై కసరత్తులు ప్రారంభించిందా? అందులో భాగంగా పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్టీ హై కమాండ్ కూడా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సీరియస్ గా దృష్టి సారించిందంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విఫలమయ్యారని హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సభలకు జనసమీకరణలో బండి సంజయ్ సక్సెస్ అయినా.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం విషయంలో ఆయన అనుకున్నంతగా విజయవంతం కాలేదని బీజేపీ హైకమాండ్ అభిప్రాయపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం..  రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఈటలకు అప్పగించాలన్న యోచనలో బీజేపీ హై కమాండ్ ఉందని చెబుతున్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వే ఫలితం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సర్వే ఫలితం అని కాకపోయినా.. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఎంత మాత్రం పట్టు లేదన్న సంగతి హై కమాండ్ కూడా గుర్తించిందంటున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక ఫలితానికి కూడా అదే కారణమని హై కమాండ్ భావిస్తోంది.  ఇక పోతే ఇటీవలి కాలంలో బండి సంజయ్ కుమారుడి వివాదాస్పద వైఖరి వల్ల పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత పొడసూపిందన్న భావన కూడా బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది. అదీ కాక పట్టణ ప్రాంతాలకే బండి సంజయ్ ప్రభావం పరిమితం అన్న నిర్ధారణకు కూడా మోడీ, షా వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు అర్బన్ లోనూ ఇటు రూరల్ లోనూ కూడా మంచి పట్టున్న నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ అయితే పార్టీని క్షేత్ర స్థాయిలో మరింతగా బలోపేతం అవుతుందని మోడీ షా ద్వయం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

12 మంది భార్యలు... 102 మంది పిల్లలు.. ఇక చాలు బాబు!

పెళ్లిళ్లలో కాదు కానీ.. పిల్లల విషయంలో గిన్నిస్ రికార్డు సాధించాలనుకున్నాడో ఏమో కానీ ఉగండాకు చెందిన ఓ వ్యక్తి 12 పెళ్లిళ్లు చేసుకుని ఏకంగా 102 మంది పిల్లల్ని కన్నాడు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఇక పెళ్లిళ్లకు, పిల్లలకుఫుల్ స్టాప్ పెట్టేశానంటున్నాడు. ఇప్పుడు తన పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒంట్లో చేవ ఉన్నంత వరకూ కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటాననీ, అయినా ఇంత పెద్ద కుటుంబాన్ని సాకాలంటే సాయం కావాలి కదా మరి అంటున్నాడు. అతనికి 102 మంది పిల్లలు ఉన్నారు.. వాళ్లల్లో చాలా మందికి వివాహాలయ్యాయి. వాళ్లకీ పిల్లలుపుట్టేశారు. అతగాడు తాత కూడా అయిపోయాడు. ఔను అతగాడికి 568 మంది మనవళ్లు ఉన్నారు. ఇంతకీ అతడి వయస్సు ఎంతంటారా? జస్ట్ 67 ఏళ్లు. ఇంతకీ అతడి పేరేంటో చెప్పలేదు కదూ.. అతడి పేరు ముసా హసహ్యా. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని సాకడానికి ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు. 

కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

సుప్రసిద్ధ దర్శకుడు,  కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ ఇక లేరు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంగా ఉన్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.   శంకరాభరణం చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కే. విశ్వనాథ్ ఆ తరువాత సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం,  సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, శుభసంకల్పం వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలలో సంగీత, సాహిత్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. కే.విశ్వనాథ్ కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే, 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాలు లభించాయి.  

ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత పేర్లు

దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా అటు దేశ రాజధని ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లలో రాజకీయ  ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం  ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది. ఇప్పడు మరో సీరియస్ టర్న్ తీసుకుంది. ఇంతవరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లను చేర్చిన ఈడీ.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్‌షీట్‌లో నమోదు చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది.  కాగా డిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది.  ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌ గ్రూప్‌ లావాదేవీల్లో  శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు సమాచారం. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు మందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3 వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.

బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తమే చూపింది. బడ్జెట్ కు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర విత్తమంత్రి పట్టించుకోలేదు.   గతేడాది అప్పుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో అంచనాలు భారీగానే వేసుకున్నా మూడింట ఒక వంతు భాగానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో కోత పెట్టింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో గతేడాది తరహాలోనే రిజర్వు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఎఫ్ఆర్‌బీఎం గురించి స్పష్టత ఇవ్వడంతో ఈసారి కూడా రుణాల లభ్యత   కష్టంగానే ఉంటుందని స్పష్టమైపోయింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా దానిని విద్యుత్ సంస్కరణలకు ముడిపెట్టింది. అంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే   0.5% మేర అధిక రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే రాష్ట్రానికి రుణ లభ్యత 3.0% మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యుత్ సంస్కరణలను అమలు చేసే ప్రసక్తే లేదని క్లారిటీతోనే ఉంది. అందుకే రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు కాకుండా, 3.0% రుణానికే అవకాశం ఉంటుంది. అంటే  దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మేర రుణానికి కోత తప్పదు.  మరో వైపు కేంద్రం  నుంచి గ్రాంట్ల రూపంలో ఆశించిన స్థాయిలో రాకపోవచ్చనే అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.  ప్రీ-బడ్జెట్ సమావేశంలో హరీశ్‌రావు లిఖితపూర్వకంగా చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా కేంద్ర బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్ బిజినెస్, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టిందని, పని దినాల పెంపును కనీసం ప్రస్తావించలేదని అంటున్నారు.   మూలధన వ్యయం కేటాయింపులు పెంచడం లాంటివి కనిపించడం ఒక పాజిటివ్ సంకేతమైనా.. మెజారిటీ పేదల సంక్షేమం విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. చివరాఖరికి రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు కోసం విడుదలైన నిధులు పొరపాటున ఏపీ రాష్ట్ర ఖాతాలోకి వెళ్ళిపోయాయని, వాటిని సర్దుబాటు చేయాలన్న విజ్ఞప్తిని సైతం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.  

భారాసాకు కష్టమే.. తెలంగాణలో హంగే!

ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిందన్నది సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అలా తయారైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన తెరాస (ఇప్పుడు భారాస) తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజల దృష్టిని మరల్చి.. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు.. వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాలలో తెలంగాణ మోడల్ అంటూ తెరాసను భారాసగా మార్చి జాతీయ పార్టీని చేశారు. ఇతర రాష్ట్రాలలో భారాస విస్తరణ అంటూ వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేని నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని పార్టీ కండువా కప్పుతూ.. జాతీయ రాజకీయాలలో భారాసా ప్రభంజనం సృష్టిస్తుందంటూ తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ దిశగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన వ్యూహాలు ఫలించే అవకాశాలు లేవనీ తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన ఒక సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. అలాగే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ కూడా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని ఆ సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటుంటే.. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంతగా ప్రయత్నం చేసినా బీజేపీ ప్రభావం రాష్ట్రంలోని ఒక్క జిల్లాకే పరిమితమైందని సర్వే వెల్లడించింది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్ తప్పదన్న సంకేతాలు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా పరాజయాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్ కు చేరువయ్యే అవకాశాలున్నాయని కూడా ఆ సర్వే పేర్కొంది.  రాష్ట్రంలో  వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టబోయేది మేమే అని ధీమాగా చెబుతున్న బీజేపీ మూడో స్థానానికే పరిమితమౌతుందని సర్వే ఫలితం చెబుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనీ, ప్రజలలో కాంగ్రెస్ పట్ల సానుకూల వ్యక్తమౌతున్నదనీ సర్వే ఫలితం పేర్కొంది.     ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన ఈ  సర్వే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ గా కాంగ్రెస్ అవతరిస్తుందనీ,  అధికార భారాసా రెండవ స్థానానికే పరిమితమౌతుందనీ, ఇక బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసిందేననీ ఆ సర్వే పేర్కొంది.  ఉమ్మడి జిల్లాల వారిగా సర్వే వెల్లడించిన దానిని బట్టి ఆరు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఇక మూడు జిల్లాలో బారసా కు కొద్ది పాటి మొగ్గు కనిపించగా, కేవలం హైదరాబాద్ జిల్లాలో మాత్రమేబీజేపీ కి కొంత సానుకూలత కనిపించింది.  హంగ్ అనివార్యమైన పరిస్థితులున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరువగా వస్తుందనీ, ఎన్నికల నాటికి ఇదే ట్రెండ్ కొనసాగితే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని సర్వే ఫలితం చెబుతోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం.. చార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం పేరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ  చార్జీషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ పేరు చేర్చింది. అలాగే రెండో చార్జిషీట్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌తో పాటు మరో 17 మందిపై కూడా ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ పేరు చేర్చటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  మొదటి నుంచీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగానే ఉంది.  

నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉందంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రవేశ పెట్టిన 2023-2024 వార్షిక బడ్జెట్ ఎలా వుంది? ఎప్పటిలానే, అధికార పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా వుంది. ప్రతిపక్షాలకు అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుంది. నిజానికి, అక్షరం పొల్లు పోకుండా ఇదే బడ్జెట్’ను చిదంబరం (కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రవేశ పెట్టి వుంటే,  బడ్జెట్ ఇదే అయినా కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా, బీజేపీకి అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుండి వుండేది. అలాగే ఇతర పార్టీల ప్రతిస్పందనలు. ఇప్పుడు బాగుందన్న నోళ్ళే అప్పుడు ఛీ’ అనేవి.. అలాగే, ఇప్పుడు ఛీ అన్న నోళ్ళు అప్పుడు ఆహో. ఓహో అనేవి.  సో ... బడ్జెట్ పై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి, రాజకీయ పార్టీలే కాదు, మీడియా, మేథావులు సైతం రాజకీయ రంగులకు అనుగుణంగానే విశ్లేషణలు చేస్తున్నారు.  సరే అదలా ఉంటే ఇది ఎన్నికల సంవత్సరం కూడా కావడం, మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్  కావడంతో, బీజేపీ బడ్జెట్ లోని సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, బడ్జెట్‌లో ప్రకటించిన ప్రజానుకూల  చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 12 రోజుల దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజునుంచే మొదలైన, ప్రచారానికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ సారధ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.  ఫిబ్రవరి 1 నుంచి 12న వరకు సాగే ఈ ప్రచారంలో దేశంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చలు, విలేకరుల సమావేశాలు,  సెమినార్‌లు నిర్వహించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్,  రైతు, యువజన విభాగాల అధినేతలతో సహా తొమ్మిది మంది సభ్యులతో కూడిన టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ యూనిట్ల అధినేతలు, అసెంబ్లీలోని విపక్ష నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రజలకు అవగాహనా కల్పించేందుకు బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందీ అంటే అందుకు ప్రత్యేక కారణం ఎన్నికలు. అవును ఈ సంవత్సరం ఏకంగా తొమ్మిది రాష్త్రాలలో  శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈ కేంద్ర బడ్జెట్ మోడీ ప్రస్తుత  ప్రభుత్వం ప్రవేశ పెట్టీ చిట్ట  చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. అందుకే, కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు  ఓక పథకం ప్రకారం బడ్జెట్ అనుకూల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఈ  ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి,  గతంలోనూ  బీజేపీ కేంద్ర బడ్జెట్‌లలో ప్రకటించిన సంస్కరణలు, కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలను నిర్వహించింది. ఇప్పుడ మళ్ళీ అదే పంథాలో ముందుకు సాగుతోంది. అయితే, కేవలం ప్రచారంతోనే రాజకీయ ప్రయోజనం చేకురుతుందా, అంటే అనుమానమే అంటున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు లక్ష్యంగా, ఎలాంటి ఆకర్షణలు లేకుండా నిర్మలమ్మ వండి వడ్డించిన  బడ్జెట్  ప్రజలకు ఎంత వరకు రుచిస్తుందనేది అనుమానమే అంటున్నారు.   అంతేకాదు, కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మల సీతారామన్  వరసగా ఐదవసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్, గత బడ్జెట్లకు భిన్నంగాలేదు. నిజానికి పేరుకే ఎన్నికల బడ్జెట్ కానీ, ఎన్నికల వాసనలు అసలే లేవు.  మధ్య తరగతికి పన్ను పోటు నుంచి కాసింత వెసులుబాటు కల్పించే చర్యలు మినహా, పెద్దగా ఓటు బ్యాంక్ తాయిలాలు ఏవీ కనిపించలేదు. అలాగని అందరినీ నిరాశ పరిచిందా అంటే అదీ లేదు. ఒక విధంగా మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనుసరిస్తున్న... సుస్థిర అభివృద్ధి లక్ష్యంగానే ఈ వార్షిక బడ్జెట్ కూడా వుంది. ఇక ప్రజలు ఎలా రిసీవ్  చేసుకుంటారో చూడవలసి వుంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. చిక్కుల్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ నిఘా దళపతి పీఎస్సార్‌ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందా? నెల్లూరు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధించిన ఆధారాలను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్  పీఎస్సార్ ఆంజనేయులే తనకు అందించారంటూ మీడియా ఎదుట చెప్పంతో ఆయన చిక్కుల్లోపడేసిందనే పరిశీలకుల చెబుతున్నారు.  కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. తన ఫోట్ ట్యాప్ అయ్యిందనీ, ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడతానన్న కోటం రెడ్డి అన్నంత పనీ చేశారు. మీడియా సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను వెల్లడించారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి అమర్నాథ్ కోటం రెడ్డి చూపిన ఆధారాలు ట్యాపింగ్ కాదని, రికార్డింగ్ అని వ్యాఖ్యానించారు. దీంతో కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వాస్తవమేనని మంత్రి అంగీకరించినట్లైంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలోఆందోళన పెరిగింది. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలలో తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కోటం రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పారు. తాను తన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆరోపణలు చేయగానే పలువురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తనకు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు స్వయంగా మంత్రి రికార్డింగ్ వ్యవహారంతో అధికార పార్టీ తన సొంత ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టిందన్న విషయం తేటతెల్లమైపోయింది. ఒక ఎమ్మెల్యేకు స్వయంగా నిఘా విభాగం అధిపతే ఆయన ఫోన్ కాల్ రికార్డు పంపించారంటే.. అధికార పార్టీలోని ఎమ్మెల్యేల ఫోన్లన్నీ నిఘా నీడలోనే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. అదంతా పక్కన పెడితే.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలంటూ బయటపెట్టిన వివరాలు ఏపీ ఇంటెలిజెన్స చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందన్నఅభిప్రాయం వ్యక్తమౌతోంది.    

అయోధ్యకు చేరిన పురాతన సాలగ్రామం.. ఎందుకంటే?

అయోధ్యలో రామజన్మ భూమిలో  నిర్మాణంలో ఉన్నరామమందిరంలో  శ్రీరాముడి ప్రధాన విగ్రహాన్ని మలిచేందుకు నేపాల్ నుంచి అత్యంత అరుదైన సాలగ్రామాన్ని తీసుకువచ్చారు.  ఈ భారీ సాలగ్రామంతోనే శ్రీరామచంద్రుని విగ్రహాన్ని తయారు చేసి, గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈమేరకు శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్టు రెండు అరుదైన సాలగ్రామాల వివరాలను వెల్లడించింది. ఇవి 60 మిలియన్ ఏళ్లకంటే పురాతనమైనవని, ఒక రాయి 26 టన్నులు, మరొకటి 14 టన్నుల బరువుందని ట్రస్టు వివరించింది.  వీటిని దేవ శిలలుగా పిలుస్తారు. ఈ శిలలనునేపాల్ లోని ముక్తినాథ్ సమీపంలోని  గండకి నది సేకరించారు. గండకి నదిలోనే అరుదైన సాలగ్రామాలు లభిస్తాయి. అయోధ్యలో ఉన్నది రామ్ లల్లా మందిరం. అంటే బాల రాముడు, రాముడు బాలుడి అవతారంలో ఉంటారు కనుక ఈ అరుదైన..అత్యంత పురాతన, భారీ సాలగ్రామంతోనే రామయ్య బాలుడి రూపాన్ని చెక్కి, ప్రతిష్ఠాస్తారు. వచ్చే ఏడాది  సంక్రాంతి నాటికల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి.

ఇది ఆరంభం మాత్రమే... అసలు సినిమా ముందుంది!

నెల్లూరు వైసీపీలో ముసలం ప్రారంభమయింది. పది అసెంబ్లీ స్థానాలుంటే పదింటిలోనూ వైసీసీయే గెలిచిన నెల్లూరు జిల్లాలో  ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు ఆరంభమైంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా వార్ కు దిగారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నిరసన గళం వినిపించారు. జిల్లాకే చెందిన  మరో ఎమ్మెల్యేలో కూడా అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందనీ, ఏ క్షణమైనా బయటపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఆరంభమైన అసమ్మతి ముందుముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెలుగు చూసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కృష్ణా జిల్లా గన్నవరంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రారవు జగన్ సైకో.. సినిమాల్లో విలన్ లా ఉన్నారని వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. వారి వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియో పార్టీలో కలకలం సృష్టిస్తోంది.  దీంతో ఈ జిల్లా, ఆ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలలో జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గత మూడున్నరేళ్లకు పై బడి మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఇక ముందు ముందు తమ అసంతృప్తిని వెళ్ల గక్కేందుకు ఒక్కరొక్కరుగా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  సీఎం సొంత జిల్లా కడప లో కూడా అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యేలు బయటపడలేదు కానీ, రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి వంటి వారు తమ అసమ్మతి గళం విప్పారు.  ఇలా ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసమ్మతి గూడుకట్టుకుని ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా అవి బయటపడే అవకాశం  ఉందని అంటున్నారు.  

ఈటల ఓటమికి కేటీఆర్ వ్యూహం!?

తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన నియోజక వర్గం  హుజురాబాద్.  ఇంచుమించుగా ఏడాది కిందట జరిగిన  హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ప్రభావితం చ్జేసిందో, అందుకు కారణాలు ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.  తెరాస ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగులో అడుగేస్తూ వచ్చిన బీసీ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో మొదలై హుజురాబాద్  ఉపఎన్నిక వరకు కొనసాగిన పొలిటికల్ హైడ్రామా గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం చర్విత చరణమే అవుతుంది. ఆ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడినా  ఓడిపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్  బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు.  ఇక అక్కడ నుంచి బీజేపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదునుపెడుతూ వచ్చారు. ఈటల చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకనో ఏమో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను వెంటాడుతూనే ఉన్నారు. ఈటల ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరం అయినా ఇంతవరకు అసెంబ్లీలో ఆయనను కనీసం ఒక్క రోజైనా కూర్చోనీయలేదు. మాట్లాడనీయలేదు.   ఏదో ఒక సాకుతో ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అయినా ఈటలను  గౌరవ స్పీకర్  సభలో ఉండనిస్తారో లేదో చూడాలి.అదలా ఉంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేస్తున్న ఈటలను సొంత  నియోజక వర్గం హుజురాబాద్ లో ఓడించేందుకు,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్,  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్  అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆయనకు సూచించారు. గత ఉప ఎన్నికలలో బీసీ కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు, నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే  ఇప్పటికే  కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇటీవల గవర్నర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు సైతం తప్పు పట్టింది.  ఆ తప్పును ప్రభుత్వ తరపు న్యాయవాది అంగీకరించడంతో పాటుగా, మరో మారు అలాంటి పరిస్థితి రాదని కోర్టుకు తెలిపారు. అయితే   కౌశిక్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంచితే  ఏ విధంగా చూసినా   కౌశిక్ రెడ్డి ఈటలకు సామ ఉజ్జీ కాదని అంటున్నారు. అంరో వంక ఉప ఎన్నికల్లో పోటీచేసిన గెల్లు శ్రీనివాస్ వర్గం కౌశిక్ రెడ్డిని ఉద్యమ ద్రోహిగా పేర్కొంటూ  ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ని ఢీకొట్టడం   కౌశిక్ రెడ్డికి అయ్యే పనేనా?  అంటే, కాదనే అంటున్నారు.