మొక్కుబడి తంతుగా అసెంబ్లీ సమావేశాలు
posted on Feb 10, 2023 @ 11:28AM
ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ సమావేశాలు జరిగినన్ని రోజులూ అసెంబ్లీ కళకళ లాడుతూ ఉండేది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగిన సందర్భాలలో కూడా సభ్యుల చాలావరకు సభలోనే ఉండేవారు. అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ప్రజా సంఘాల హడావిడి కనిపించేది. ఇందిరా పార్క్ వద్ద ‘ధర్నా చౌక్’ ఉన్నంత వరకు అనేక ప్రజా సంఘాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఉండేది. అలాగే, సామాన్య ప్రజల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగతున్నాయంటే, అదో రకమైన ఉత్కంఠ, ఇక మీడియా సంగతి అయితే చెప్పనే అక్కర లేదు.
అయితే, ఇప్పడు అదంతా గతించిన చరిత్రగా మిగిలి పోయింది.ఇప్పడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక మొక్కుబడి తంతుగా మారిపోయాయనే మాటే వినవస్తోంది. నిజానికి, ఆరు నెలలకు ఒకసారి తప్పక అసెంబ్లీ సమావేశం కావాలనే రాజ్యాంగ నిబంధన ఇంకా వుంది కాబట్టి కానీ, లేదంటే ఇది కుడా ఉండేది కాదేమో అనే మాట కూడా విమర్శకుల నుంచి నిపిస్తోంది.
ఇక ఇప్పుడు జరుగతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయానికి వస్తే, సభ్యుల హాజరు రోజు రోజుకు పలచబడుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల పట్ల, ప్రజా ప్రతినిథులకు ఆసక్తి లేకుండా పోతోందనే అభిప్రాయం బలపడుతోంది. నామినేటెడ్ సభ్యుడితో కలిపి తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 120... అందులో 105మంది అధికార బీఆర్ఎస్ సభ్యులు. కానీ, ఏ రోజునా కూడా సభకు హాజరైన సభ్యుల సంఖ్య మూడంకెల సంఖ్యకు చేరడం లేదు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (ఫిబ్రవరి 3) కాస్త పర్వాలేదనిపించినా, రెండో రోజు నుంచి సభ్యుల అటెండెన్స్ పడిపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సభలో ఉన్నప్పుడు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు సభలో ఉంటున్నారు. ఈ ఇద్దరూ లేనప్పుడు సభ్యుల సంఖ్య 50 కూడా దాటడం లేదు. మధ్యాహ్నం సెషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 30 నుంచి 40 మంది మాత్రమే ఉంటున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం పద్దులపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చే టైంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 29 మందే ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష సభ్యులు ఏడుగురు ఉండగా, అధికార పక్షం సభ్యులు 22 మంది ఉన్నారు.
అసెంబ్లీకి వచ్చినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు సభలో కంటే లాబీలో, మంత్రుల చాంబర్లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అదేమని అడిగితే, నియోజక వర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లేందుకే, మంత్రుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పు కొస్తున్నారు. నిజానికి, శాసన సభ సమావేశాలు నిర్వహించేందే అందుకు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఇతర నిబంధనలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఉన్నాయి..అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు ఆ నిబంధనలను పొందు పరిచారు. అయితే, సభలో మొర పెట్టుకున్న వినే నాథుడు లేక పోవడం వల్లనే మంత్రులను ప్రత్యేకంగా కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పు కొస్తున్నారు.
సభలో సమస్యలు లేవనెత్తడానికి అవకాశం లేదని అందుకే సభ బయట మంత్రులను కలుస్తున్నామంటున్నారు. ఇక సభలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష సభ్యులు కూడా సభలో కొంత సేపు, బయట కొంతసేపు ఉంటున్నారు.ఇంకొంత మంది ఎమ్మెల్యేలైతే అటెండెన్స్ వేయించుకోవడానికే వస్తున్నాం అన్నట్లుగా. సభలో కాసేపు ఉండి వెళ్లిపోతున్నారు. నిజానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పలుమార్లు హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. నిజానికి, ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే, ప్రజాస్వామ్య ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.