మా పథకాలకు మీ బొమ్మలా? నిధులు నిలిపేసి జగన్ సర్కార్ కు కేంద్రం షాక్!
posted on Nov 7, 2023 @ 11:21AM
అసలు ఈ రంగులు, బొమ్మల పిచ్చేంటో కానీ తొలి రోజు నుండే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఈ అంశంలో విమర్శలపాలవుతూనే ఉంది. అయినా, ఆ విమర్శలను ఖాతరు చేయకుండా ప్రతి దానిలో వైఎస్ జగన్ బొమ్మలు, వైఎస్ఆర్ పేర్లు ఉండేలా చూసుకుంటోంది. ప్రభుత్వ భవనాలకు కూడా వైసీపీ రంగులను పూస్తున్నారు. పలుమార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నా జగన్ సర్కార్ కు పట్టలేదు. చివరికి రాష్ట్ర పథకాలతో పాటు కేంద్ర పథకాలకు కూడా ఈ పేర్లు, బొమ్మలను తగిలించి ఆ పథకాల క్రెడిట్ కూడా మనదే అనేలా కలరింగ్ ఇస్తున్నారు. అయితే అన్ని రోజులు మనవే కాదు కదా. ఈ మధ్య కాలంలో కేంద్రం కాస్త ఏపీ ప్రభుత్వంపై దృష్టి పెట్టింది. తమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందనేది నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర నిధులను దారి మళ్లించడాన్ని గుర్తించి ఆ మధ్య పలుమార్లు సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది. లెక్కా పత్రం లేకుండా ఇలా కేంద్ర నిధులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఏంటని తీవ్రంగా మండిపడింది.
అదలా ఉండగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసింది. మా నిధులను మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం ఏంటని ఏకంగా రూ.4 వేల కోట్ల రూపాయలను నిలిపివేసింది. కేంద్ర పథకాల పేర్లు మార్చి మీ బొమ్మలేసుకొని అమలు చేయడం ఏంటంటూ నిధులను నిలిపివేసింది. అసలే తీవ్ర ఆర్ధిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ కేంద్రం షాక్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర నిధులతో చేపడుతున్న పథకాలకు.. కేంద్రం పేరే ఉండాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ పథకాలపై నవరత్నాల లోగోలు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ బొమ్మలు ఉంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఆ బొమ్మలు పెడితే నిధులు ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ముంగిట జగన్ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్లు అయ్యింది.
నిజానికి ఏపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో చాలా పథకాలలో సింహభాగం కేంద్ర నిధులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కేంద్రం పథకాలను పేర్లు మార్చేసి, వైసీపీ రంగులు, జగన్ బొమ్మలేసుకొని కొంత భాగం రాష్ట్ర నిధులను కలిపి అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇదే. అయితే, వాటికి అట్టహాసంగా బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిర్వహించి తమ సొంత పథకాలుగా జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తూ వచ్చింది. ఉదాహరణకు గృహల నిర్మాణం విషయానికి వస్తే ఈ నిధులలో కేంద్రానిదే సింహభాగం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు సమకూరుస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు చాలా తక్కువ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు వైయస్సార్ పేరుని జోడించి పీఎంఏవై- వైయస్సార్ బీఎల్సీ పథకంగా మార్చింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ లోగోతో పాటు సీఎం జగన్ బొమ్మతో కూడిన నవరత్నాల లోగో కూడా పెట్టింది.
ఈ ఒక్క గృహ నిర్మాణాలే కాదు.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్, వాసన పథకాలకు కేంద్రం భారీగా సహకరిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలు కేంద్ర సహకారంతోనే నడుస్తున్నాయి. రైతు భరోసాలో కూడా కేంద్ర నిధులున్నాయి. కానీ గర్భిణీలకు, పిల్లలకు ఇచ్చే గుడ్లపై కూడా వైఎస్ఆర్ పేరు ఉండగా.. పాల ప్యాకెట్లపై జగన్, నవరత్నాల లోగోలున్నాయి. కేంద్ర నిధులున్నా యథేచ్ఛగా వైఎస్ఆర్ రైతు భరోసాగా పేరు పెట్టుకున్నారు. ఇలా కేంద్ర నిధుల అంశాన్ని దాచి పెట్టి తమ సొంత నిధులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వాన్ని మభ్య పెడుతూ వచ్చింది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో కేంద్రం బృందాన్ని పంపించి విచారణ చేపట్టగా బండారం బయటపడింది. దీంతో కేంద్రం నిధులు నిలిపివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ జీవో జారీ చేస్తూ నవరత్నాల లోగో కూడా తొలగించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కూడా బోర్డులు మారుస్తామని కేంద్రానికి నివేదించింది. మిగతా పథకాలలో కూడా మార్పులు చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పగా.. ఎన్నికల వేళ జగన్ కు ఇది షాకేనని పరిశీలకులు భావిస్తున్నారు.