జగన్ అవే మాటలు.. జనం అదే పరుగులు?!
posted on Nov 8, 2023 5:55AM
‘నాకు మీడియా సంస్థలు లేవు.. ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. నాకెవరితో పొత్తు లేదు. మీ అందరి దీవెనలు.. ఆ దేవుని దయ చాలు.. నేనెవరినీ సపోర్ట్ చేయమని అడగను. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే.. మీ బిడ్డకు మీరు ఉన్నారు.. మీ సపోర్టు ఉంది.’ ఈ ప్రసంగం ఎవరిదో మళ్ళీ విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా మైకు దొరికితే సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చేమాటలివే. తాజాగా పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అదే ఊకదంపుడు స్పీచ్ ఇచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకమేమీ కొత్తది కాదు. అది కూడా ఎన్నికలకు ముందు చెప్పేది ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట. కేంద్రం కిసాన్ యోజన పథకాన్ని కూడా ఇందులో కలుపుకొని పథకాన్ని అమలు చేస్తున్నారు. సరిగ్గా ప్రతిసారి కేంద్రం నిధులు విడుదల చేసే సమయంలో ఇక్కడ జగన్ ఏదో ఒక జిల్లాలో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి భారీ బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేసి బటన్ నొక్కుతారు. పీఎం కిసాన్ నిధులైతే జమవుతాయి కానీ.. వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు.
ఒక్క రైతు భరోసా కార్యక్రమం మాత్రమే కాదు.. ప్రతి కార్యక్రమాన్నీ అలాగే అమలు చేస్తారు. ప్రతి పథకాన్ని విడతల వారీగా ఇవ్వడం, ప్రతి విడతకి కోటాను కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మంగళవారం పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమం కూడా అంతే. రైతు భరోసా ఈ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ బటన్ నొక్కి చెప్పారు. రైతుల ఖాతాలలో నగదు జమ చేసినట్లు చెప్పారు. కానీ, పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలలోకి వచ్చాయి తప్ప భరోసా డబ్బు ఇంకా రాలేదు. రోజు వారీ పన్నుల వసూళ్లలో కొంత భాగాన్ని ఈ రైతు భరోసాకు విడతల వారీగా ఖాతాలలో చెల్లించనున్నారు. అంత దానికి ఓ బహిరంగ కార్యక్రమం.. అందులో మళ్ళీ అదే విమక్షంపై విమర్శలు. దీనిని చూస్తే పార్టీ ప్రచారం కోసం వైసీపీ సర్కార్ ఎంతగా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాడేస్తోందో అర్ధమవుతుంది.
ఇక ఇక్కడ జగన్ ప్రసంగం విషయానికి వస్తే చంద్రబాబు హయంలో స్కాంలే తప్ప స్కీమ్‌లు లేవు. బాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్‌లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబుకు పదవి కావాలి అంటూ ఆరోపించారు. ఇక, తనకు అసలు అబద్ధాలు చెప్పడం రాదని.. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. గెలవడానికి దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు.. పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డ నమ్ముకుంది. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉందంటూ ఎమోషనల్ బాండింగ్ కలర్ ఇచ్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని.. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామన్నా అబద్దాలేనని చెప్పుకొచ్చారు.
అయితే, కొత్తగా జగన్ స్పీచ్ వస్తే సోషల్ మీడియాలో పండగే అవుతుంది. జగన్ మాట్లాడిన ప్రతి మాటను అటు ప్రతిపక్షాలు, మీమర్లు ఏకిపారేస్తుంటారు. ఈ పుట్టపర్తిలో స్పీచ్ కూడా అంతే. మీడియా సపోర్ట్ లేదంటూ జగన్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్న నెటిజన్లు మీ ఆవిడ భారతీ ఎండీగా ఉన్న మీడియా సంస్థ ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక, చంద్రబాబుపై అన్నీ స్కాంలే అని మాట్లాడిన జగన్ ఒక్కదానికి సంబంధించైనా ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని, అసలు 3041 సార్లు అక్రమ కేసులలో కోర్టు వాయిదాలకు హాజరు కాని జగన్.. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందంటూ నెటిజన్లు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. మీ బిడ్డకు అందరి దీవెనలు అంటూ.. మా బిడ్డలను పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లేలా చేసిన సీఎం జగన్ అంటూ కొందరు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని.. బంగారం, కార్లు ఇస్తామన్నా నమ్మొద్దని కోరడం చూస్తుంటే తన గురించి తానే ప్రజలకు హింట్ ఇచ్చినట్లుగా ఉందని మండిపడుతున్నారు. ఇక జనం కూడా జగన్ ప్రసంగం ప్రారంభించగానే.. ఇదెక్కడి గొడవరా బాబూ అన్నట్లుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు అడ్డుకున్నా వారు ఖాతరు చేయలేదు. జగన్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ సగానికి పైగా ఖాళీ అయిపోయింది. జగన్ స్పీచ్ అంటేనే జనం పరార్ అన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో జోరుగా వైరల్ అవుతున్నాయి.