ప్రజాస్వామ్యం.. నుంచి నియంతృత్వంలోకి.. మోడీ మళ్లీ గెలిస్తే అదేనా?
posted on Jan 19, 2024 @ 1:52PM
కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ... దేశంలో ప్రజాస్వామ్యం మటుమాయమైపోతుందన్న భయాలు రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతున్నాయి. చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తరహాలో రాజ్యాంగాన్ని మార్చేసి జీవిత కాల ప్రధానిగా తనను తాను ఆయన ప్రకటించేసుకున్నా ఆశ్చర్యం లేదని విపక్ష నేతలు అంటున్నారు. వ్యవస్థలపై విశ్వాసం, రాజ్యాంగం పై గౌరవం లేదా అన్న విధంగా మోడీ తీరు ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో ఉండేలా, రాజ్యంగాని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు ఆయన వెనుకాడరని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. దేశంలో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు, నియంతృత్వం కబంధ హస్తాల్లోకి దేశం వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు విపక్ష పార్టీలు అన్నీఐక్యం కావాలన్నవిషయంలో బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి., 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవాలంటే విభేదాలు విస్మరించి కలిసి నడవాల్సిన అవసారన్ని కూడా విపక్షాలు గుర్తించాయి. అయితే అలాంటి కలయిక ద్వారా ఏర్పడే కూటమికి నేతృత్వం వహించే పార్టీ, కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశం వద్దే ఈ ఐక్యత పీటముడులు పడుతున్నది. ఎవరికి వారు నాయకత్వం ఒక సమస్య కాదని చెబుతున్నప్పటికీ ఆచరణ, కార్యాచరణ విషయానికి వచ్చే సరికి అదే అంశంపై పట్టుబడుతున్న పరిస్థితి.
నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్నిఒక్క బీజేపీయేతర పార్టీలే కాదు, జనం కూడా గుర్తించారు. అంతెందుకు ఇప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు కూడా గుర్తించాయి. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించాలంటే.. విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని... కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు తృణమూల్ మొదలు, డీఎంకే వరకూ అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా గుర్తించాయి. అయితే అయితే కలిసికట్టుగా ముందడుగు వేసే విషయంలో మాత్రం వాటి అడుగులు తడబడుతున్నాయి.
అదలా ఉంటె విపక్షాలను ఐక్యం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు కూడా. అలా బీజేపీయేతర పార్టీల అన్నిటి కృషి ఫలితంగా విపక్షాల ఐక్యత దిశగా ఒక అడుగు పడింది. ఇండియా కూటమి ఆవిర్భవించింది. అయితే ఆ కూటమి బీజేపీ ప్రత్యామ్నాయంగా దూర దృష్టి కలిగిన, జాతీయవాద కూటమిగా ఎదిగిందా, ఆ దిశగా అడుగులు వేస్తున్నదా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం రావడం లేదు.
అయితే ఇందుకు కారణాలు సుస్పష్టం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఒకింత ప్రజాస్వామ్యయుత పార్టీయే అయినప్పటికీ భాగస్వామ్య పక్షాల పట్ల, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల పట్ల పెద్దన్న పాత్ర పోషిస్తూ వాటి ఎదుగుదలకు అడుగడుగునా అడ్డంకులు పడుతుందన్న భయం కూటమి పార్టీలలో పూర్తిగా తొలగిపోకపోవడమే. ప్రస్తుత పరిస్థితుల్లో పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ బలం కూడా ఒక ప్రాంతీయ పార్టీతో సమానంగా పడిపోయిందనడంలో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రాతీయ పార్టీలు గతంలో ఒక ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక ఇప్పుడు అనివార్యంగా మోడీ అనే పెద్ద గీతను చిన్నది చేయడానికి అవి కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపినప్పటికీ కూటమికి నాయకత్వం విషయంలో వాటిలో ఇంకా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. దాంతో ఇండియా కూటమి అడుగులు తడబడుతున్నాయి.
ఒక అడుగు ముందుకు పడింది అనుకునేలోగానే రెండడుగులు వెనుకకు పడుతున్నాయి. తాజాగా కూటమి కన్వీనర్ గా మల్లిఖార్జున్ ఖర్గేను ఎన్నుకోవడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపించినా.. ఆ భేటీకి తృణమూల్, సమాజ్ వాదీ వంటి పార్టీల గైర్హాజరీ కారణంగా అది ఏకాభిప్రాయంతో జరిగిన ఎంపికేనా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం విపక్ష పార్టీలన్నిటి లక్ష్యం మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకోవడమే కానుక.. నాయకత్వం ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెట్టి ఐక్యంగా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంటుది.