వెలిసిపోతున్న గులాబీరంగు.. ఒడిశా బీఆర్ఎస్ బ్రాంచ్ ఖాళీ!
posted on Jan 18, 2024 @ 4:29PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలంటూ ఇతర రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన పార్టీ బ్రాంచీలు కూడా మూతపడిపోతున్నాయి. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆర్భాటంగా పార్టీ శాఖను ఏర్పాటు చేసి, కమిటీలను నియమించిన బీఆర్ఎస్ ఆ తరువాత ఏపీ వైపు చూసింది లేదు. నామ్ కే వాస్తేగా ఓ కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ.. ఆ రాష్ట్రంలో ఒక్క కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు.
అప్పట్లో పార్టీలో చేరే వారిని ఇక్కడ నుంచి వాహనాలు పంపి మరీ హైదరాబాద్ కు తీసుకువచ్చి, ఓ కండువా కప్పేసీ ఆ తరువాత వారి సంగతి, ఏపీ బీఆర్ఎస్ శాఖ గురించీ మరిచిపోయింది. అలాగే ఒడిశాలో కూడా కొందరు పేరున్న నేతలను చేర్చుకుని ఓ హడావుడి చేసేసింది. ఒడిశా నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి సామాన్యులేం కాదు.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ లు. వీరిలో గిరిధర్ గమాంగ్ పేరు విన్నట్లు ఉంది కదా? ఆయన ఒడిశాకు మాజీ ముఖ్యమంత్రి . ఏకంగా తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే ఆయన అప్పట్లో లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. ఒడిశా ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పార్లమెంటు సభ్వత్వాన్ని వదులు కోకుండా 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని తన ఓటుతో కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. అటువంటి గమాంగ్ ఆ తరువాత 2015లో బిజెపిలో చేరారు.
అటువంటి గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కలిసి బీజేపీని వీడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఒడిశాకు చెందిన ఓ పెద్ద నాయకుడు బీజీపీని వీడి కేసీఆర్ పంచన చేరారంటూ తెలంగాణలో అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆకాశమే హద్దన్నంత ఘనంగా ప్రచారం చేసుకుంది. అయితే గమాంగ్ చేరిక వల్ల ఒడిశాలో బీఆర్ఎస్ కు ఒరిగేదేం లేదనీ, ఆయన రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా లేరనీ అప్పట్లోనే రాజకీయవర్గాలు పెదవి విరిచాయి. అటువంటి నేత కూడా తన కుమారుడితో కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో సొంత రాష్ట్రంలోనే బలం లేని పార్టీలో ఉండటం నిష్ప్రయోజనం అని భావించి గిరిధర్ గమాంగ్ తన కుటుంబంతో సహా కాంగ్రెస్ పంచన చేరిపోయారు.