అనుకున్నదొకటి.. అయినది మరొకటి!.. జగన్ కాపు ఆశలు ఆవిరి?
posted on Jan 19, 2024 8:33AM
తెలుగుదేశం, జనసేనల పొత్తు విచ్ఛిన్నం చేయడానికీ, కాపు నేతలు జనసేనానికి దూరంగా ఉంచేందుకు జగన్ పార్టీ శతథా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కనీసం కాపు ఓటర్లను తెలుగుదేశం, జనసేన కూటమికి దూరం చేయాలని, అది కుదరకపోయినా, వారి ఓట్లలో చీలిక తీసుకురావాలని జగన్ వేసిన ఎత్తులూ ఫలించలేదు సరికదా, అందు కోసం ఆయన పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తులూ రివర్స్ అయ్యి కాపు నేతలను, కాపు ఓట్లను ఏపీకి దూరం చేశాయి. దీంతో జగన్ స్వయంగా బంగారు పల్లెంలో పెట్టి కాపుల మద్దతును తెలుగుదేశం, జనసేన కూటమికి అప్పగించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కాపు ఉద్యమ నేతనేత ముద్రగడ పద్మనాభానికి పెద్దాపురం టికెట్ ఆఫర్ చేసి వైసీపిలోకి ఆహ్వానించారు. అందుకు తొలుత సుముఖంగా స్పందించిన ముద్రగడ, టికెట్ విషయంలో జగన్ మాటతప్పుతారని అనుమానించారు. సిట్టింగుల మార్పు పేరుతో జగన్ ఆడుతున్న క్రీడ అంతిమంగా తనకు మొండి చేయి చూపుతుందని నిర్ధారణకు వచ్చిన ముద్రగడ, జగన్ తో కలవడానికి ససేమిరా అన్నారు. అనడమే కాదు.. తాను జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి నడుస్తాననీ, ఆ పార్టీ గూటికి చేరుతానని ప్రకటించేశారు. అలాగే అదే కాపు సామాజిక వర్గానికి చెందిన క్రికెటర్ అంబటి రాయుడుకి గుంటూరు లోక్‌సభ టికెట్ ఆశజూపి వైసీపిలో చేర్చుకుని, ఆ తరువాత టికెట్ విషయంలో హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అయిపోవడంతో అంబటి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనకు దగ్గరయ్యారు. ఇక వంగవీటి రాధా విషయంలో కూడా జగన్ అనుచితంగా వ్యవహరించారు. గత ఎన్నికలలో వంగవీటి రాధాకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా, అవమానకరంగా వ్యవహరించడంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరారు.
ఈ నాలుగున్నరేళ్లే వంగవీటి రాధాను పట్టించుకోని జగన్ ఇప్పుడు ఇప్పుడు కాపు ఓటు బ్యాంక్ కోసం మళ్ళీ ఆయనకు టికెట్ హామీ ఇస్తూ రాయబారాలు పంపుతూ రాయబేరాలు ఆడుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్ని సార్లు ఈ విషయంలో సంప్రదింపులకు ప్రయత్నించినా వంగవీటి రాధ వైసీపీకి దగ్గరయ్యేందుకు ఇష్టపడలేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పులు చేర్పుల కారణంగా వైసీపిలో కాపు నేతలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు తదితరులు కూడా జనసేన వైపు చూస్తున్నారు. నాలుగో జాబితా ప్రకటన వచ్చిన నేపథ్యంలో మరింత మంది కాపు సామాజిక వర్గ నేతలు తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువయ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని, నేతలను విడగొట్టి లాభపడాలనుకున్న జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా వారందరినీ ఐక్యం చేసి మరీ తెలుగుదేశం, జనసేన కూటమికి దగ్గర చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ ముందే చెప్పినట్లు జగన్ ఒకదాని తరువాత ఒకటిగా వేస్తున్న అడుగులన్నీ పరాజయం దిశగానే పడుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ పై తన వంధిమాగధుల్లా వ్యవహరిస్తున్న పేర్ని నాని వంటి కాపు నేతలతో విమర్శలు చేయిస్తే కాపు సామాజికవర్గ ఓట్లు చీలి తనకు ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావించారు. అలాగే కాపు సామాజిక వర్గ నేతలు తాను పిలిస్తే పార్టీలోకి రాకుండా ఎలా ఉంటారని అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అయ్యింది. బయట నుంచి కాపు నేతలు వచ్చి చేరడం అలా ఉంచి, పార్టీలో ఉన్న కాపు నేతలే ఆయనకూ దూరం జరుగుతున్నారు.