బాలశౌరి పవన్ తో భేటీ...ఎప్పుడంటే?
posted on Jan 19, 2024 @ 11:32AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం సాయంత్రం భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. 2019లో వైసీపీ తరపున బాలశౌరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రోజే తాను జనసేనలో చేరబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్ లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. ఈ భేటీలో తాను జనసేనలో చేరిక, ఇతర రాజకీయ అంశాలపై బాలశౌరి పవన్ తో చర్చించనున్నారు.ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి బాలశౌరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన జన సేనలో చేరనున్నట్లు రాజకీయ పరిశీలకులు ముందుగానే ఊహించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరి అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరితే పొలిటికల్ మైలేజి వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. అతను గతంలో తెనాలి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. బాలశౌరి 2004 లోక్‌సభ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుండి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై 78,556 మెజారిటీతో గెలుపొందారు . 2008లో నియోజకవర్గాన్ని రద్దు చేసి గుంటూరు నియోజకవర్గంలో విలీనం చేసే వరకు ఎంపీగా కొనసాగారు. .తరువాత అతను 2019 లోక్‌సభ ఎన్నికలలో మచిలీపట్నం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై 60,141 మెజారిటీతో గెలుపొందారు .
అయితే వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం లేదా గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మరో వాదన వినిపిస్తుంది. వల్లభనేని బాల శౌరికి సినీరంగంలో కూడా ప్రవేశం ఉంది. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన లేత మనసులు చిత్రాన్ని నిర్మించారు . బాక్సాఫీసు రికార్డులను చూసి కలత చెందారు. లేత మనసులు చిత్రం .అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేద్దామనుకున్నారు. అయితే బాలశౌరి తర్వాత చిత్రరంగానికి దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ తో బాలశౌరి చిత్రం కలగా మిగిలిపోయింది. ఎపి రాజకీయాలలోకీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ తో బాలశౌరి ఈ ఎన్నిక ద్వారా దగ్గర అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.