కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఆక్రోశం!
posted on Jan 20, 2024 @ 4:02PM
తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో కానీ, బయట కానీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క గొంతు వినిపించినా సహించలేదు. ఇచ్చిన వాగ్డానాలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించిన వారిపై తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకం అంటూ ఘనంగా చాటుకున్న కాళేశ్వరం లోపాలను ఎత్తి చూపితే కొత్త ప్రాజెక్టులలో ఇవి సహజం అన్నారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీకైతే ఇప్పుడే ఇలా జరిగిందా అంటూ ఎదురు దాడికి దిగారు. అసలు అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడానికే ప్రయత్నించిన బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు విపక్షంలోకి రాగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నది.
ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధ్యమైనంత త్వరగా రేవంత్ సర్కార్ కు మంగళం పాడేసి అధికారం అందుకోవాలని తహతహలాడిపోతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో వాగ్దానాల అమలును తెలంగాణ ద్రోహులుగా ముద్రించేందుకు వెనుకాడని కేటీఆర్ ఇప్పడు అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీగా పట్టుమని 10 సంవత్సరాల చరిత్ర కూడా లేని బీఆర్ఎస్ వందేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ వంటి వారిని ఎందరినో చూశానంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని దాదాపు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు వంద రోజుల్లో హామీలు నెరవేర్చమని రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నది. తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యల గురించి కనీసం పట్టించుకోని కేటీఆర్ ఇప్పడుడు 50 రోజుల పాలనలో రేవంత్ పాలనలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని ఊరికే అనలేదు మరి.