పాపం కేశినేని నాని.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!
posted on Jan 20, 2024 @ 2:00PM
విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్న మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారిన తర్వాత ఆయన పట్ల అప్పటి వరకూ ఉన్న ఆ భావన అందరిలోనూ మటుమాయం అయ్యింది.
అవధులు లేని అహంభావం, పొగరుబోతుతనం తప్ప ఆయనలో ఆలోచన లేదని వైపీపీలో చేరిన తరువాత ఆయన అత్యంత అప్రాధాన్యంగా ఆ పార్టీలో మెలుగుతున్న తీరుతో అందరికీ అవగతమైంది. కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించేవారు. సీఎంఓ నుంచి ఫోన్ చేసి మాట్లాడినా, తాను నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానని చెప్పగలిగే స్వేచ్ఛ ఉండేది. అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను కూడా పెద్దగా ఖాతరు చేసే వారు కాదు. తనకు తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునే వారు. ఆ కారణంగానే పార్టీలో సీనియర్లు చాలా మంది ఆయనకు దూరంగా మెలిగే వారు.
అయితే అదంతా కేశినేని బిల్డప్ మాత్రమేనని నాని వైసీపీ గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే బట్ట బయలైపోయింది. విజయవాడ ఎంపీగా తనతోపాటు.. మరో ఐదుగురు నేతలకు, అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన వైసీపీ అధినేతకు సిఫార్సు చేశారట. కానీ ఆయన సిఫారసు చేసిన వాటిలో తిరువూరు వినా మరో సీటు ఇచ్చేందుకు ససేమిరా అన్న సర్దుకు పోయారు. ఇక ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేశినేని నాని హాజరయ్యారు. మామూలుగా అయితే అక్కడ ఆయన పరిస్థితి గుంపులో గోవింద మాదిరిగానే ఉంది.
తెలుగుదేంలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ హోదాలో ఉన్న నానికి సముచిత ప్రాధాన్యత లభించేది. వేదికపై ఎన్టీఆర్ పక్కనే స్థానం కూడా లభించేది. అయితే ఇప్పుడు నానికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యతా లభించడం లేదు. విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేశినేని నానికి కూడా ఆ విషయం ఇప్పటికే స్పష్టంగా అర్ధమై ఉంటుంది. అయితే కోరి కొనుక్కున్న కొరివి కనుక మండినా బయటపడే అవకాశం లేదు. లోలోన మాత్రం ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట పాడుకుంటూ ఉండే ఉంటారు.
ఆ అవమానాలే అలా ఉంటే తాజాగా విజయవాడలో గురువారం జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని మరింత ఘోరంగా అవమానించింది. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటూ విషాద గీతాలు పాడుకుంటూ, వైసీపీ రాజ్యాంగానికి అనుగుణంగా అణిగిమణిగి ఒదిగి ఒదిగి ఉండేందుకు కేశినేని నాని మానసికంగా సిద్ధమైపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.