ఇంతకీ ఆ వీడియో ఎక్కడ?
posted on Mar 8, 2024 @ 3:01PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసుపై ఇటీవల పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బిటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యను నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పంపారన్న సమాచారం ఉందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని... అందుకు నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సైతం తాను సిద్దమని స్పష్టం చేశారు. అయితే వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమేనా అంటూ సూటిగా సవాల్ విసిరారు.
ఇక ఈ కేసును సీబీఐ తీసుకుంటే వైయస్ అవినాష్ రెడ్డి .. బీజేపీలోకి వెళ్తాడంటూ సీఎం వైఎస్ జగన్ తన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డికి స్పష్టం చేయడం వాస్తవం కాదా? అని బిటెక్ రవి ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపారన్న విషయం.. హత్య జరిగిన రోజునే వైఎస్ జగన్‌కు ఎలా తెలిసిందని బిటెక్ రవి సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్ ప్రమేయం ఉందని.. ఆ విషయం త్వరలోనే బహిర్గతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై బీటెక్ రవి చేసిన తాజా వ్యాఖ్యలపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తుండడంతోపాటు పలు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
బీ.టెక్ రవి చెబుతున్నట్లు వైయస్ వివేకా హత్య తతంగాన్ని వీడియో తీస్తే సదరు వీడియోను నిందితులు ఎవరెవరికీ పంపారని.. అది కూడా ఎంత మందికి వెళ్లిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదీకాక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ ఎపిసోడ్‌లో లైవ్ వీడియో కాల్ ఘటన తరహా ఏమైనా వీడియో కాల్స్ సైతం వెళ్లాయా అనే అనుమానాలు సైతం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక వివేకా హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు ఈ కేసు బుల్లి తెరలో ప్రసారమయ్యే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్‌ను తలపిస్తోందనే ప్రచారం ఇప్పటికే జరుగుతోందని వారు వివరిస్తున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సీబీఐ విచారణలోఈ వీడియో అంశాన్ని తెలియజేశారా? లేదా? అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. అదీకాక ఈ హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్న వేళ.. ఈ వీడియో అంశాన్ని తెలుగుదేశం నాయకుడు బిటెక్ రవి తెరపైకి తీసుకు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇక ఈ వీడియో కోసం సీబీఐ అన్వేషణ మొదలుపెట్టిందా? లేదా? ఆ వీడియో సీబీఐ స్వాధీనం చేసుకున్నందునే వాళ్లకు బెదిరింపులు ఎదురయ్యాయా? .. అందులో భాగంగానే తొలి నాటి నుంచి దస్తగిరి ఈ వీడియో వ్యవహారంపై సైలెంట్‌గా ఉన్నారా? అయితే 2019, మార్చి 14 అర్థరాత్రి లేదా 15వ తేదీ తెల్లవారుజామున పులివెందుల నుంచి లోటస్ పాండ్‌కు పోన్ కాల్ వెళ్లిందంటూ ఇప్పటికే మీడియాలో కథనాలు బాగా వైరల్ అయినాయని.. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత ప్లస్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌తో పాటు వైయస్ భారతి పీఏను సీబీఐ అధికారులు కడప పిలుపించుకొని.. విచారించారని.. మరి ఆ సమయంలో సీబీఐ అదికారులు సైతం సెల్ పోన్‌లో సందేశాలు, వీడియోలపై దృష్టి కేంద్రీకరించ లేదా? అనే సందేహాలు సైతం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం.
వివేకా హత్య కేసు వాయిదాలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో న్యాయస్థానానికి దస్తగిరి హాజరయ్యారని... ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమీపిస్తున్నాయని.. అలాంటి వేళ వివేక హత్య కేసు వల్ల ఫ్యాన్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ... దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు వైద్యుడి ముసుగులో జైలుకు వచ్చారని.. అందుకు గతేడాది ఆక్టోబర్ 30, 31వ తేదీల్లో జైల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. విచారణ జరపాలంటూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టు జడ్జిల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ వరుసగా దస్తగిరి లేఖలు రాశారని.. ఇక సరిగ్గా అదే సమయంలో ఇదే దస్తగిరి వివేకా హత్య కేసులో ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ హస్తం కూడా ఉందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో... ప్రజల్లో ఓ విధమైన కన్ప్యూజన్ అయితే నెలకొందన్నది మాత్రం పక్కా వాస్తవమని జిల్లా వాసులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.
ఇక ఈ అయిదేళ్లలో ఎక్కాడా? ఎప్పుడు? కూడా వివేకా హత్యను వీడియో తీసినట్లు ఓ వార్త కూడా బయటకు రాకపోవడం.. తాజాగా ఈ అంశంపై ఆరోపణలు రావడంతో.. ఓ వేళ వివేకా హత్యను వీడియో చిత్రీకరణ చేస్తే... అది ఎవరు తీశారు. ఎవరికి పంపారు? ఓ వేళ.. సెల్ పోన్ నుంచి సదరు వీడియోలు డిలీట్ చేసినా.. పోలీసులు తలుచుకుంటే... ఆ వీడియోలు కనుక్కోవడం... నిమిషాల్లో పని.. అదే సీబీఐ తలుచుకుంటే మాత్రం సెకన్లలో పని అని.. మరి ఆ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థ అడుగులు వేస్తే మాత్రం.. వివేకా హత్య కేసులో పాత్రదారులు సూత్రదారులే కాదు.. ఆ వెనుక దాగి ఉన్న తాటికాయంత పెద్ద తలకాయలు సైతం ఎవరన్నది సాక్ష్యాదారాలతో సహా నిరూపిత మవుతుందని జిల్లా వాసులు ఈ సందర్బంగా బల్లగుద్ది మరి చెబుతున్నారు.