కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా
posted on Mar 10, 2024 @ 10:04AM
లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్ది గంటలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే... అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిగంటల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆయన రాజీనామాకు గల కారణాలేమిటో వెల్లడి కాలేదు. 2022 నవంబరులో ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకం కూడా వివాదాస్పదమైంది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్‌కు కేవలం ఆరు వారాల వ్యవధి మిగిలి ఉండగా.. 2022 నవంబరు 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ మరుసటి రోజే ఆయనను కేంద్రప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. దీనిని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ.. ప్రభుత్వం మెరుపువేగంతో గోయల్ నియామకానికి ఆమోదం తెలపటాన్ని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ విధంగా అరుణ్ గోయల్ నియామకం పెద్ద వివాదమే సృష్టించింది. ఇప్పుడు ఆయన రాజీనామా కూడా పలు ప్రశ్నలు రేకెత్తిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈసీలో ఖాళీల నేపథ్యంలో కొత్త కమిషనర్ల నియామకానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2020 ఆగస్టులోనూ అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్లలో ఒకరైన అశోక్ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన పలు కేసుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు. ముఖ్యంగా, మోదీ, అమిత్‌షాల కోడ్ ఉల్లంఘనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.
చాలాకాలంపాటు ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఒక్కరే ఉండేవారు. 1989 అక్టోబరు 16న తొలిసారిగా ఇద్దరు అదనపు కమిషనర్లను తొలిసారిగా నియమించారు. వారు మరుసటి ఏడాది జనవరి 1వ తేదీ వరకే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1993 అక్టోబరు 1న ఇద్దరు అదనపు కమిషనర్లను నియమించారు. అప్పటి నుంచీ సీఈసీతోపాటు ఇద్దరు కమిషనర్లు నియమితులవుతున్నారు. ఏకాభిప్రాయం సాధ్యం కానప్పుడు మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ లో తీసుకుంటున్నారు.లోక్ సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశముంది.