ఏపీలో ప్రజాస్వామిక ఓట్ల సునామీ!

ఏపీలో పోలింగ్  సాగుతోంది . మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు జనం ఓ ఉత్సాహంతో, ఓ జోష్ తో పోలింగ్ బూత్ లకు బారులు తీస్తున్నారు.  వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహం చూపుతున్నారు.  గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై వాటి ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదు.   ఉదయం11 గంటలకే దాదాపు పాతిక శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడం  కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే, అధికార వైసీపీలో నిరుత్సాహం పెరిగిపోతోంది.  ఊహించిన దానికంటే భారీగా ప్రజామద్దతు కూటమిపై ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రచారం జగనే కావాలి అంటూ జగన్ చేసుకున్న ప్రచారంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.   వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ  జగనే కావాలి అని జనంచెప్పాలి కానీ, వారి చేత బలవంతంగా చెప్పిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అంటున్నారు.  వైఏపీ నీడ్స్ జగన్ అంటూ జనంలోకి వెళ్లడానికి ధైర్యంలేని వైసీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తల్లాంటి వలంటీర్లను, అధికారులను జనం ముందుకు పంపి వారి చేత జగనే కావలని బలవంతంగా చెప్పించారు. అలా  చెప్పకపోతే పథకాలు ఆగిపోతాయంటూ బెదిరింపుకు కూడా దిగారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ జగన్ తమకు ఎందుకు వద్దో చెప్పడానికి జనం పోలింగ్ బూతులకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.  ఓటింగ్ సరళిని గమనిస్తున్న పరిశీలకులు ప్రభుత్వ వ్యతిరేకత జనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ మూకలు రెచ్చిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నా అవేమీ పోలింగ్ పై ప్రభావం చూపడం లేదనీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ ఓటు హక్కు వినియోగించుకు తీరుతామన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఏపీలో పోలింగ్ సరళిని పరిశీలకులు ప్రజాస్వామిక ఓట్ల సునామీగా అభివర్ణిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు అధికారపార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీస్తున్న తీరును చూస్తే ప్రజలలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రత అవగతమౌతోందంటున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే చెంపే ఛెళ్లుమనిపించిన ఉదంతమే ఇందుకు నిదర్శనమంటున్నారు. తెనాలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే దాష్టీకాన్ని ఓ సామాన్య ఓటరు ఎదిరిస్తే, పిఠాపురంలో ఓ పోలింగ్ బూత్ లో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు నిబంధనలు గుర్తు చేసి మరీ నిలదీశారు ఇంకో ఓటరు.   వైసీపీ మూకల దాడులు, దౌర్జన్యాలూ, దాష్టీకాలకు వెరవకుండా ఓటర్లు ఎదురుతిరుగుతున్న పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది.  

వైసీపీకి తోక ఊపుతున్న తెనాలి పోలీసులు

మొగుణ్ణి కొట్టి మొగసాలుకి ఎక్కినట్టుగా వుంది తెనాలి వైసీపీ నాయకుల వ్యవహారం. ఈ వ్యవహారానికి మద్దతు ఇస్తున్న పోలీసుల వ్యవహార శైలి కూడా విచిత్రంగా వుంది. ఈరోజు తెనాలిలో ఓటు వేయడానికి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలో నిల్చోకుండా డైరెక్ట్.గా వెళ్ళిపోతున్నారు. అది చూసిన గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు మీరు కూడా క్యూలో రావాలని రిక్వెస్ట్ చేశారు. అంతే శివకుమార్‌కి ఎక్కడ లేని కోపం ముంచుకుని వచ్చేసింది. ఒక్కసారిగా సుధాకర్ మీదకి దాడి చేసి ఆయన చెంపమీద కొట్టారు. దాంతో రియాక్ట్ అయిన సుధాకర్ కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప ఛెళ్ళుమనిపించారు. అది చూసిన వైసీపీ ఎమ్మెల్యే పక్కనే వున్న గూండాలు సుధాకర్ మీద దాడి చేసి దారుణంగా కొట్టారు. దాంతో సుధాకర్ తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు తీరిగ్గా ఎంటరైన పోలీసులు ఏంచేయాలి? మొదట చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యేని, సుధాకర్ మీద దాడి చేసిన వైసీపీ గూండాలని అరెస్టు చేయాలి. కానీ వాళ్ళు సుధాకర్‌ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ని మొదట ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా తెనాలి పోలీసులు వ్యవహరించారు. వైసీపీ నాయకులతో కుమ్మక్కై మీది తెనాలి... మాది తెనాలి.. మనది తెనాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే తీరు పట్ల, పోలీసుల తీరు పట్ల తెనాలిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ని కొట్టడం అనే విషయాన్ని తెనాలి ఓటర్లు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు.

కోడ్ ఉల్లంఘించిన కేంద్ర మంత్రి.. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు

కేంద్ర మంత్రి, సికిందరాబాద్ లోక్ సభ నియోజవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత చేసిన ప్రసంగంలో కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పోలింగ్ రోజున ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ పేరు ప్రస్తావించారనీ, నిబంధనల మేరకు పోలింగ్ రోజున పార్టీ పేర్లు, గుర్తుల పేర్లు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం నిషేధమని కాంగ్రెస్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతూ మోడీ పేరు ప్రస్తావించిన కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని వారా ఫిర్యాదులో కోరారు.  

నరసరావుపేట వైసీపీ అభ్యర్థి ఓవర్ యాక్షన్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు పూనకం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదా కార్యకర్తలు నిబంధనలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. అదేమని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హడావిడి చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అసెంబ్లీ లేదా పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థి కేవలం ఒక వాహనంలో మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం 10 కార్లతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. శ్రీనివాసరెడ్డి వెంట దాదాపు వంద మంది అనుచరులు కమ్ గూండాలు వుంటున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిబంధనలు బ్రేక్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి.

పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్‌నా! మెడలో మంగళసూత్రం చూశారా?

భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు. కళ్లు తెరిచి చూడు జ‌గ‌న్‌ అంటూ సోష‌ల్ మీడియాలో సైటైర్లు... జ‌గ‌న్‌, పోతిన్ ఆరోప‌ణ‌ల‌కు ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్‌లో స‌మాధానం ఇచ్చారు. భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు... కాస్త కళ్లు తెరిచి చూడు జ‌గ‌న్‌, పోతిన మహేష్‌ అంటూ జ‌న‌సైనికులు రెచ్చిపోతున్నారు. నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్‌నా.. మెడలో మంగళసూత్రం చూశారా? అంటూ పోలింగ్ బూత్ ద‌గ్గ‌ర జ‌నం మాట్లాడుకున్నారు. ఓటు వేసేందుకు స‌తీస‌మేతంగా వ‌చ్చిన పవర్ స్టార్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇక పవన్ అభిమానులు… సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అయితే అవేమీ ప‌ట్టించుకోకుండా పవన్ తన భార్యతో కలిసి ఓటు వేశారు.  అన్నా లెజినోవా చూసిన స్థానిక ప్ర‌జ‌లు,  అభిమానులంతా ఆశ్యర్యపోయారు. ఆమె ఎలాంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్ లుక్కుతో ఓటు వేసేందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్‌నా.. మెడలో మంగళసూత్రం చూశారా? అయితే ఆమె కట్టుకున్న చీర నుంచి.. పెట్టుకున్న జువెలరీ వరకు అంతా సింపుల్ సిటీతో కనిపించారు. మెడలో కూడా సింగిల్‌ లైన్ ఉన్న మంగళ సూత్రం వేసుకున్నారు. చేతులకు సింగిల్ బ్యాంగిల్స్ వేశారు. ఇక నుదుటున చిన్న బొట్టు పెట్టుకున్నారామె.  ఆమె కట్టుకున్న చీర కూడా చాలా సాధారణంగా కనిపించింది. చూడటానికి అది కాటన్ శారీలా కనిపిస్తుంది. దీంతో పవర్ స్టార్ భార్య అయినా అంత సింపుల్‌గా ఉన్నారా? అంటూ ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అన్నా లెజినోవా రష్యాకు చెందిన యువతి. ఆమె పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ విష‌యాల‌న్నీ అక్క‌డ‌ జ‌నం మాట్లాడుకోవ‌డం వినిపించింది. జగన్మోహన్ రెడ్డితో పాటు పోతిన మహేశ్ కు,  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీటుగా సమాధానం చెప్పారు. గత కొన్ని నెలలుగా నాలుగో పెళ్లి అంటూ వైఎస్ జగన్ తన హోదాకు దిగజారి చేసిన ఆరోపణలకు పవర్ స్టార్ తనదైన రీతిలో షాక్ ఇచ్చారు. తన భార్యతో కలిసి ఆయన మంగళగిరిలో తన ఓటు హక్కును ఉపయోగించుకొని అసత్య ఆరోపణలు చేస్తున్న వారి నోరు మూయించారు.  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.  ఆయన పెళ్లిళ్ల గురించి మీటింగ్‌లో ప‌దే ప‌దే ప్రస్తావించడం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింది. అయితే నాలుగో పెళ్లి అంటూ పదే పదే మీటింగుల్లో చెప్పడంతో అసహనానికి గురైన జనసేన చీఫ్ నువ్వే నా నాలుగో పెళ్లాం అంటూ కామెంట్ చేయడం వైరల్ అయింది.  అయినా త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోని జ‌గ‌న్,  పిఠాపురంలో చివరి పబ్లిక్ మీటింగ్‌లో కూడా పవన్ కల్యాణ్ ప్రతీ ఐదేళ్లకు కార్లను మార్చినట్టు ఆయన పెళ్లాలను మార్చుతాడు అంటూ ఆవేశంగా మాట్లాడారు. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా.. ఆయన చేసిందేమీ లేదు అంటూ ఆరోపణలు చేశాడు.   ఇటీవ‌ల జ‌న‌సేన నుంచి వైసీపీ లోకి వెళ్ళిన పోతిన మ‌హేష్ కూడా పవన్ ను తీవ్రంగా విమర్శిస్తూనే వున్నారు.   పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయటపెడతానని ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. మూడో భార్య అన్నా లెజినోవా మీతోనే కలిసి ఉంటే, పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా రావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరి ఆరోప‌ణ‌ల‌కు జ‌న‌సేనాని త‌న దైన స్టైల్‌లోనే ధీటుగా జ‌వాబిచ్చారని పోలింగ్ బూత్ వ‌ద్ద జ‌నం చెప్పుకున్నారు.  అయితే పవన్ తన భార్యతో కలిసి ఓటు వేయడంతో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

ఓటేసిన సీఎం, మాజీ సీఎం.. కొడంగల్ లో రేవంత్, చింతమడకలో కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా  లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కొడంగల్ లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో  కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన   ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.   అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటేశారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో  కేసీఆర్, శోభమ్మ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సురేఖ, కూతురు సుస్మితలతో కలిసి ఓటేసేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఓటు విలువ తెలియజేస్తూ  మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత అని చెప్పారు.  మన రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో వెళ్ళడానికి మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ చూపించండి. అందరూ ఖచ్చితంగా మీ హక్కును వినియోగించుకోండి అని పిలుపునిచ్చారు. 

ఓటేస్తాం..మార్పు తెస్తాం.. ఏపీలో పోటెత్తుతున్న ఓటర్లు!

పరుగెత్తి పాలు తాగినా, నిలబడి నీరు తాగినా దాహం తీర్పుకోవడమే లక్ష్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు అదే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  కుదిరితే పరిగెత్తుకు వస్తున్నారు, లేకపోతే నడిచి వస్తున్నారు, అదీ కుదరకపోతే పాక్కుంటూ కూడా పోలింగ్ బూత్ కు చేరుకుంటున్నారు.  ఏరులు దాటి వస్తున్నారు. వర్షాన్నీ, ఎండనూ లెక్క చేయడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా  ఉదయం నుంచే  ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా వీల్ ఛైర్లలో వెళ్లి మరీ ఓటేస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా  సొంతూర్లకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకు తీరుతామన్న సంకల్పాన్ని చాటారు. ఎ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. పోలింగ్‌లో పాల్గొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మాక్ పోలింగ్ తర్వాత.. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో కొంతమంది ఓటర్లు నది దాటి వెళ్లి మరీ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.  కొమరాడ మండలంలో నాగావళి దాటి కూనేరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని కొంతమంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  మరోవైపు పార్వతీపురం మినహా కురుపాం, సాలూరు, పాలకొండ నియోజవకర్గాల్లో సాయంత్రం ఏడు గంటలకు కాకుండా గంట ముందు ఆరుగంటలకే పోలింగ్ ముగుస్తుంది.   అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు కూడా  బోటులో వెళ్లి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పి. గన్నవరం పరిధిలోని లంకల గన్నవరానికి చెందిన గ్రామస్థులు కూడేరు పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు వాగు దాటాల్సి ఉంది. దీంతో బోటులో వెళ్లి ఈ ఊరి జనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా ప‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం వ‌ట్టి చెరుకూరు గ్రామం బూత్ నెంబ‌ర్ 137, 138 ఓటు వేయ‌డానికి వ‌చ్చిన న‌లుగురు మహిళలు తీవ్ర ఉక్కపోత కారణంగా పోలింగ్ బూత్ లోనే  ఊపిరాడ‌క స్ఫృహ త‌ప్పి ప‌డిపోయారు. పోలింగ్ బూత్ లలోనే కాకుండా క్యూలైన్లలో ఉండే వారికి కూడా ఎటువంటి వెసులుబాటూ లేని విధంగా చాలా ఇరుకుగా ఉంది.   జ‌నం ఓటు వేయ‌డానికిపెద్ద సంఖ్యలో  రావ‌డం తో స్థ‌లం స‌రిపోక   ఓట‌ర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. 

ప్రశాంత్ కిషోర్ మీద వైసీపీ ఫిర్యాదు

జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నిన్న ఆదివారం కూడా ఆర్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి జగన్ ఓడిపోతారంటూ కుండ బద్దలు కొట్టారు. జగన్ ప్రభుత్వం తప్పులన్నిటినీ ఏకరవు పెట్టారు. ఈసారి ఎన్నికల తర్వాత జగన్ 2019 ముందు నాటి పరిస్థితికి వెళ్ళిపోతారని చెప్పారు. దాంతో వైసీపీ ఆగ్రహంతో రగిలిపోయింది. తన అభిప్రాయం చెప్పిన ప్రశాంత్ కిషోర్ మీద, ఆ ఇంటర్వ్యూ చేసిన రవిప్రకాష్ మీద, ప్రసారం చేసిన ఆర్ టీవీ యాజమాన్యం మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఈనాడు పత్రిక మీద, చంద్రబాబు నాయుడు మీద కూడా ఫిర్యాదు చేసింది. వైసీపీ పని, జగన్ పని అయిపోయింది.. ఇక ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏం ఉపయోగం లేదు.

ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన ఓటరు!

వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. ఎన్నికల వేళ దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్ఠించాలని యత్నిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారి పల్లెలో తెలుగుదేశం ఏజెంట్ సుభాష్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుభాష్ కు కుడి కన్ను పోయింది. ఇక పల్నాడులో పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ హింసాకాండకు తెరలేపింది. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం హుటాహుటిన పల్నాడుకు ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రాను అక్కడకు పంపింది. అవసరాన్ని బట్టి అదనపు బలగాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.  ఎన్నికల రోజు వైసీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇందుకు నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సీఎస్ జవహర్ రెడ్డి తన వంతు ఇతోధిక సాయం అందజేస్తున్నారు.  సరిగ్గా పోలింగ్ రోజు తెల్లవారు జామునే ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ బకాయిలను వారి అక్కౌంట్లలో జమ చేశారు. పోలింగ్ కు రెండు రోజుల మందు ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకా సొమ్మును లబ్ధి దారుల ఖాతాలలో జమ చేయడానికి తన కున్న సర్వ అధికారాలనూ ఉపయోగించి విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు చడీ చప్పుడూ లేకుండా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలలో డీఏ అరియర్స్ ను జమ చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించాలని, సీఎస్ పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది. ఎన్నికలలో దాడులు, దౌర్జన్యాలు, అసత్య, అబద్ధ ప్రచారాలు, ప్రలోభాలను నమ్ముకుని బరి తెగిస్తున్న వైసీపీకి ఓటర్లు వాటిని వేటినీ లెక్క చేయకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో హద్దులు లేకుండా చెలరేగుతున్నారు. ఓటింగ్ కు పెద్ద ఎత్తున జనం తరలిరావడం, ప్రలోభాలకు గురి చేద్దామని ప్రయత్నించిన వైసీపీ నాయకులపై తిరగబడుతుండటంతో అధికార పార్టీలో ఆందోళన పెరిగిపోతున్నది. పంచిన చీరలను వైసీపీ నేతల ఇళ్ల ముందు విసిరివేయడం, పోలింగ్ బూత్ వద్ద తనపై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థిపై ఆ ఓటరు తిరగబడి చెంప ఛెళ్లుమనిపించడం వంటి సంఘటనలు ఏపీ ప్రజల మూడ్ ను తెలియజేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఔను  తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటర్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఆ ఓటరు తిరగబడి చెంప ఛెళ్లు మనిపించారు. దీంతో ఎమ్మెల్యే పరువు గంగలో కలిసినట్లైంది. ధైర్యంగా ఎమ్మెల్యే దౌర్జన్యానికి దీటుగా బదులు చెప్పిన ఆ ఓటర్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.   అలాగే  మైలవరం నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యానికి తెగబడ్డారు.    150 మందితో  గుంపుగా మైలవరం వేములూరి వెంకటరత్నం కళాశాల పోలింగ్ బూత్ లో జొరబడి హల్ చల్ చేశారు. ఎమ్మార్వో చేష్టలుడిగి నిలబడిపోయారు. విషయం తెలిసి భారీగా తెలుగుదేశం శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.   ఇవన్నీ ఒకెత్తైతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బూత్ నంబర్ 55లో ఈవీఎంలో ఒక గుర్తుకు ఓటు వేస్తే మరొక గుర్తుకు పడుతోందంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. 

ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు దంపతులు 

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే ఆయ‌న కుమారుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, భార్య బ్రాహ్మ‌ణి కూడా ఇదే పోలింగ్ సెంట‌ర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్ర‌త్యేక‌మైన‌విగా ఆయ‌న పేర్కొన్నారు. ఇవాళ ఓటు వేస్తే రేపు ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంద‌న్నారు. భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నిక‌లే అని తెలిపారు. ఓటు వేసేందుకు ఉద‌యం నుంచే జ‌నాలు బారులు తీర‌డం బాగుంద‌ని, వారు చూపిస్తున్న చొర‌వ మ‌రువ‌లేనిద‌ని చెప్పారు. ఇంకా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. "ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావిత‌రాల భ‌విష్య‌త్తుకు పునాదులు వేస్తుంది. విదేశాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా ఓటు వేసేందుకు స్వ‌స్థ‌లానికి రావ‌డం బాగుంది. అన్న‌మ‌య్య‌, ప‌ల్నాడు జిల్లాల్లో దాడుల‌ను ఖండిస్తున్నా. ఈ దాడుల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. గుండాయిజం, రౌడీయిజంతో రెచ్చిపోతే స‌హించేదిలేదు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు, ఈసీ బాధ్య‌త తీసుకోవాలి. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తే మా కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోరు" అని చంద్ర‌బాబు హెచ్చరించారు.