కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ ల ఉద్యోగాలు హుళక్కి

  ఈ నెల 22న సడక్ బంద్ టి.ఆర్.ఎస్., టి.జెఎసి, పలు పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. సడక్ బంద్ సందర్భంగా టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, టి.జెఎసి చర్మాన్ కోదండరాం, తెలంగాణా ఉద్యోగ సంఘాల కో-చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కోర్టు లో వీరు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా మేజిస్ట్రేట్ శుభావాణి బెయిల్ పిటీషన్ పై నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఆలంపూర్ కోర్టు వారికి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోదండరాం ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చే పేజీ కళాశాలలో రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా ఉన్నారు. 2009 డిసెంబర్ 24 నుండి టి.జెఎసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి విడతల వారీగా శెలవులో ఉంటూ వచ్చారు. అలాగే జిహెచ్.ఎం.సి. పరిథిలోని రాజేంద్రనగర్ డిప్యుటీ కమీషనర్ గా పనిచేస్త్తున్న శ్రీనివాస్ గౌడ్ తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, జెఎసి అధికార ప్రతినిధిగా ఉండేవారు. ఇటీవలే టి.జెఎసి కో-చైర్మన్ గా నియమితులయ్యారు. వీరిద్దరూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం సర్వీసులో కొనసాగుతూ 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే వారిని అనివార్యంగా సస్పెండ్ అవుతారు. ఈ రోజు సాయంత్రంలోగా బెయిల్ రాకపోతే వీరిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారు.

ఎన్నికలకు సమాయత్తం కండి ... బోత్స

  ముందస్తు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై పిసిసి అధ్యక్షుడు బోత్స సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్ లో సమావేశం జరిగింది. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణ రెడ్ది, పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసిసి బోత్స జిల్లా కార్యవర్గాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా పంచాయితీలు, తరువాత పురపాలక, జిల్లా పరిషత్, మండల, వచ్చే సంవత్సరంలో సాధారణ ఎన్నికలు అందుకు పార్టీ యంత్రాంగాన్ని,  జిల్లా, నగర, పట్టాన పార్టీ శ్రేణులను, సమన్వయకర్తలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. జైపూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 15వ తేదీకల్లా క్షేత్రస్థాయిలో కమిటీలను వేయాల్సి ఉంటుందని, అందరూ దీనికి సహకరించాలని బోత్స కోరారు. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెంచామని కన్నా లక్ష్మీ నారాయణ ఈ సందర్భంగా తెలియజేసినప్పుడు పార్టీ శ్రేణుల్లో విభిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయని తెలిసింది.

సంజయ్ దత్ కు సంఘీభావం తెలుపుతున్న సినీప్రముఖులు

  సంజయ్ దత్ కు భారతీయ సినీ ప్రపంచం అండగా నిలబడింది. విద్యాబాలన్, రాజ్ కుమార్ హిర్వాణీ, సంజయ్ దత్ కు సుప్రీంకోర్టులో శిక్ష వేసినప్పుడు కూడా కోర్టు లాబీలోనే వున్నారు. వీరు సంజయ్ దత్ ఇంటికి తరచుగా వస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా, కరణ్ జోహార్, రితేష్ దేశ్ ముఖ్, బిపాసా బసు, హృతిక్ రోషన్, సమాజ్ వాదీ పార్టీ నేత జయ బచ్చన్ తాము సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ప్రకటించారు. తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ విలేఖరులతో మాట్లాడుతూ సంజయ్ దత్ వెంట తాను నిలబడతానని, సంజయ్ దత్ కు శిక్ష పడిన వెంటనే తాను ఆందోళనకు గురయ్యానని, ప్రస్తుతం సంజయ్ దత్ కు క్షమాభిక్ష కొరకు ప్రయత్నిస్తున్న వారి ప్రమేయంతో సంజయ్ కు త్వరలోనే క్షమాభిక్ష దొరుకుతుందని, మిగిలిన జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజ వాదీ పార్టీ ఎం.పి. జయా బచ్చన్ మాట్లాడుతూ సంజయ్ చాలా మంచివాడు, అతనిలో చాలా మార్పు కనబడుతుంది, అతనికి కోర్టు ఇటువంటి శిక్ష విధించకుందా ఉండాల్సింది, పర్సనల్ గా నేను మహారాష్ట్ర గవర్నర్ ను క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతానని తెలిపారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు రణబీర్ కపూర్, సుజయ్ ఘోష్, ఫరహన్ అక్తర్, సోఫీ చౌదరి, రాజు హిరాణి, డైరెక్టర్ అపూర్వ లఖియ సంజయ్ దత్ నివాసానికి వెళ్ళి అతనికి అండగా నిలబడతామని అంటున్నారు.

కరెంట్ తీసేసి అరెస్టులు

  శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ కార్యదర్శి రాజాసదారాం తెలుగుదేశం పార్టీ సభ్యులతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో ఎమ్మెల్యేల అధికారిక అంగరక్షకులను బయటికి రప్పించి, శాసనసభ ఆవరణలో విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి, రాత్రి 11.15 నిముషాల సమయంలో పోలీసు బలగాలు, మార్షల్స్ తెలుగుదేశం పార్టీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, దూళిపాళ్ళ నరేంద్ర, సండ్ర వెంతకవీర్యయ్య పోలీసులను, మార్షల్స్ ను తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా వారిని అదుపులోకి తీసుకుని వీరిని ఒక వాహనంలో, మిగిలిన ఎమ్మెల్యేలను బస్సులో తరలించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన వద్ద వదిలిపెట్టారు. కొత్తకోట దయాకర్ తన వాహనంలో వారిని అనుసరించారు.

తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన

  శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ సభ్యులు సభాపతిని కలిసి విద్యుత్ పై అజెండాలో పెట్టి చర్చ జరపాలని కోరారు. ఉదయం 11.30 గంటలకు సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి తెలపడంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనసభలోనే బైఠాయించారు. విద్యుత్ కోటలు, తాగునీటి సమస్యలపై చర్చ చేపట్టాల్సిందేనని, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమాస్యలపై చర్చకు హామీ ఇచ్చేవరకూ బయటకు వచ్చేది లేదని, శుక్రవారం రాత్రంతా శాసనసభలోనే వుంటామని భీష్మించుకూర్చున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ కార్యదర్శి రాజాసదారాం వారితో చర్చలు జరిపినా సఫలం కాలేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలుగుదేశం పార్టీ విప్ దూళిపాళ్ళ నరేంద్రతో ఫోనులో మాట్లాడుతూ విద్యుత్ అంశాన్ని శనివారం నాటి అజెండాలో పెడతామని హామీ ఇచ్చారు. కానీ దూళిపాళ్ళ నరేంద్ర శ్రీధర్ బాబుకు ఘాటుగా సమాధానం ఇస్తూ బడ్జెట్ పై చర్చ, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం అంటూ మూడు రోజులపాటు అజెండాలో పెట్టారని, కానీ వాటిపై ఆ మూడు రోజులూ చర్చ జరగలేదని గుర్తుచేస్తూ, అజెండాలో పట్టినంత మాత్రాన చర్చ జరుగుతుందనే నమ్మకం లేదని, చర్చ జరుపుతామని హామీ ఇస్తే తప్ప తాము ఇక్కడ నుండి కదలబోమని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులపై తీరుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వారితో ఫోన్ లో మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఆందోళన వీడొద్దని స్పష్టం చేశారు.

కేవీపి సీబీఐకి జవాబు చెప్పుకోకతప్పదు: వీహెచ్

రాజ్యసభ సభ్యుడు కేవీపిని రేపు సీబీఐ విచారణకు పిలవడంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయనను వ్యతిరేఖించే వారు ఒకరొకరుగా గొంతు విప్పుతున్నారు. అందరికంటే ముందుగా పార్టీలో సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు స్పందించారు. కేవీపి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నపటికీ, ఆయన జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమె భర్త మరణానికి తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీఏ కారణమని ఆరోపిస్తున్నపుడు కూడా ఆయన ఆమెను వారించకుండా మౌనం పాటించి పార్టీపట్ల, పార్టీ అధిష్టానం పట్ల అగౌరవం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో కేవీపి ప్రమేయం లేకుండా ఏపని జరుగలేదు. అటువంటప్పుడు అందరినీ విచారించినట్లే సీబీఐ ఆయనను కూడా ఇంతకు ముందుగానే విచారించి ఉండాల్సిందని” ఆయన అన్నారు.   జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐకు జవాబు చెప్పుకోవలసిన బాద్యత ఆయన మీద ఉందని అని ఆయన అన్నారు. పార్టీలో సీనియర్ అయినంతమాత్రాన్న ఎవరూ పార్టీకి, చట్టానికి అతీతులు కాబోరని ఆయన అన్నారు.

'నిర్భయ' చట్టం అమలు

        దేశంలో తొలిసారిగా 'నిర్భయ' చట్టం మన రాష్ట్రంలో అమలైంది. అత్యాచార కేసులో మెదక్ జిల్లా, సంగారెడ్డి కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2011మే నెలలో పటాన్‌చెరు మండలం ఐలాపూర్‌ తండాకు చెందిన ఎస్సీ బాలికపై బీహార్‌కు చెందిన పింటూ యాదవ్‌ అత్యాచారం చేశాడు. కేసు విచారించిన సంగారెడ్డి కోర్టు అతడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో 10 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ప్రస్తుతం నిందితుడు యాదవ్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఇటీవల పార్లమెంటులో నిర్భయ చట్టాన్ని సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. చట్టం ఆమోదం పొందిన తర్వాత సంగారెడ్డి కోర్టు నిర్భయ చట్టం ఆధారంగా దేశంలోనే తొలిసారి తీర్పు చెప్పింది.

ఎన్టీఆర్ తో విభేదాలు లేవు: బాలకృష్ణ

        నందమూరి బాలకృష్ణ విశాఖ పట్నం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం పాయకరావుపేట లో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలయ్య ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ రోజు విశాఖ చేరుకున్న బాలకృష్ణ తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తల మీద స్పందించారు..."యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తనకెలాంటి విభేదాలు లేవని...అలాగే నా సోదరుడు హరికృష్ణ తోనూ నాకు ఎలాంటి విభేదాలు లేవు" అని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ‘వస్తున్నా మీకోసం’పాదయాత్రలో తాను పాల్గొంటానని, అయితే ఆ పాదయాత్ర ముగింపు ఎప్పుడు అన్నది తనకు సమాచారం లేదని అన్నారు.

కెవిపికి సిబిఐ నోటీసులు

    కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు శుక్రవారం సీబీఐ నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కేవీపీని సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ ఎదుట కేవీపీ హాజరు కానున్నారు. కేవీపీ గురించి సీబీఐ అడిగిన సమాచారాన్ని తీసి ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. 2004 నుంచి 2011 మధ్య కాలంలోని ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇంతకుముందే ప్రభుత్వానికి పలు వివరాలు కావాలని సీబీఐ లేఖ రాసింది. అవి ఇవ్వకుండా ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.   వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిన కేవీపీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ఆయనదే ప్రధాన పాత్ర. వైఎస్ ఆప్తమిత్రుడిగా, ఆయన ఆత్మగా కేవీపీ పేరుపడ్డారు. వైఎస్ మరణం తరువాత కేవీపీ ప్రాధాన్యం తగ్గినా ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆయనకు సీబీఐ నోటీసులు రావడం అనేది చర్చానీయాంశంగా మారింది.

సంజయ్ దత్ కు అండగా ఎస్పీ,ఎన్.సి.పి.

        సుప్రీంకోర్టు గురువారం సినీనటుడు సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలు శిక్ష విదిచిన విషయం విదితమే. ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ జస్టీస్ మార్కండేయ కట్జు గవర్నర్ కె. శంకరనారాయణన్ కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం కింద సంజయ్ దత్ కు క్షమాభిక్ష ప్రసాదించమని మార్కండేయ కట్జు లేఖలో పేర్కొన్నారు. 1993 లో బాంబు పేలుళ్ళతో సంజయ్ కు ఎలాంటి సంబంధం లేదని కేవలం అతని వద్ద లైసెన్స్ లేని నిషిద్ధ ఆయుధాలు కలిగి ఉన్నందునే టాడా కోర్టు అతనికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించిందని కూడా పేర్కొన్నారు.   ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ లకు విజ్ఞప్తి చేస్తూ సంజయ్ దత్ కు ప్రత్యేక కేటగిరీలో అతనికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఎన్.సి.పి. నేత అధికార ప్రతినిధి డి.పి. త్రిపాఠి మాట్లాడుతూ కేవలం సంజయ్ దత్ వద్ద దొరికిన లైసెన్స్ లేని ఆయుధాల వల్లనే అతనికి ఇంతకుముందు జైలు శిక్ష పడిందని, సంజయ్ నిందుతుడని ఎక్కడా పేర్కొనలేదని కాబట్టి మార్కండేయ విజ్ఞప్తి చేసిన విధంగా సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతిని, మహారాష్ట్ర గవర్నర్ లను కోరారు.

సంజయ్ దత్ కు జైలు ... దావుద్ విలాసవంతమైన జీవితం

  1993 ముంబాయి బాంబుపేలుళ్ళ కుట్రకు సూత్రధారి దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ గడ్డపైన ఉన్నాడని పక్కా సమాచారాన్ని సేకరించింది ఆజ్ తక్. ఇంటలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఆధారంగా దావుద్ కరాచీలోని ఇంటి నెంబర్  6-A, ఖయబాన్ తంజీం, డిఫెన్స్ కాలనీ ఏరియా, ఫేజ్ -V లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని బుట్టదాఖలు చేసింది. అయినా పాకిస్తాన్ అప్పటి ప్రెసిడెంట్ పర్వేజ్ ముషరాఫ్ కాని నేటి విదేశాంగ మంత్రి రెహమాన్ మాలిక్ కానీ దావుద్ తమ దేశంలో లేదని బుకాయిస్తుంది. దావుద్ ఇంతకుముందు మొయిన్ ప్యాలెస్, క్లిఫ్టన్, కరాచీ లో నివసించేవాడని సిబీఐ తెలిపింది. 9/11 దాడుల తరువాత అమెరికా దావుద్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయడంతో దావుద్ అక్కడినుండి తన మకాం డిఫెన్స్ హౌసింగ్ ఏరియాకి మార్చుకున్నాడు. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ దావుద్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

హిజబుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

  దేశ రాజధాని ఢిల్లీ లో భారీ పేలుడుకు కుట్రపన్నిన హిజబుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ఉత్తర ప్రదేశ్ నివాసి లియాకత్ ఆలీని రెండు రోజుల క్రితం గోరఖ్ పూర్ లో అరెస్ట్ చేశారు.  పోలీసుల ఇంటరాగేషన్ లో ఆసక్తికరమైన అంశాలు లియాకత్ ఆలీ వెల్లడించాడు. హోలీ సందర్భంగా ఢిల్లీలో భారీ పేలుళ్ళకు తాను ఢిల్లీ బయలుదేరినట్లు చెప్పాడు. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ఓల్డ్, జామా మసీద్ ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ పై దాడి చేయగా ఎకె. 47 రైఫిలు, బాంబులు లభించాయి. రైఫిలు బాంబులు లభించిన రూమ్ ను సీల్ చేసి ఇద్దరు గెస్ట్ సిబ్బందిని ఇంటరాగేషన్ కోసం అదుపులోకి తీసుకున్నారు. గురువారం లియాఖత్ ఆలీని కోర్టులో హాజరు పరచగా పదిహేను రోజుల కస్టడీని విధించింది.

కాంగ్రెస్ నుండి మరో ముగ్గురు జంప్ కి సిద్ధం

  జగన్ మోహన్ రెడ్డి అనుచరులపై వేటువేయడానికి మీన మేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిస్సహాయ పరిస్థితిని చక్కగా అర్ధంచేసుకొన్న మరో ముగ్గురు శాసన సభ్యులు శుక్రవారంనాడు చంచల్ గూడా జైలు బాట పట్టనున్నారని మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వారిలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా ఉంటున్న స్వతంత్ర అభ్యర్ధి శ్రీశైలం గౌడ్ మొదటివారు కాగా, రంగారెడ్డి మరియు మెహబూబ్ నగర్ జిల్లాల నుండి మరో ఇద్దరు శాసన సభ్యులు కూడా ఈ రోజే చంచల్ గూడా జైలులో జగన్ని కలుసుకొనేందుకు ముహూర్తం పెట్టుకొనట్లు సమాచారం. శ్రీశైలం గౌడ్ తానూ స్వతంత్ర అభ్యర్ధి అయినందున కాంగ్రెస్ పార్టీ తీసుకొనే క్రమశిక్షణా చర్యలు తనకు వర్తించవని చెపుతుంటే, ఆయనకీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు వర్తించే నియమ నిబందనలు, శిక్షలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నారు. శ్రీశైలం గౌడ్ సంగతి ఎలా ఉన్నపటికీ, ముందు మిగిలిన ఇద్దరూ చేజారిపోకుండా జాగ్రత్త పడకపోతే, ఆనక క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఉండదు. ఇప్పటికే, తిరుగుబాటు సభ్యుల దయతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వం, ఇప్పుడు మరో ముగ్గురు సభ్యులు గనుక పార్టీని వీడితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం.

రాజమండ్రి మళ్ళీ మురళీమోహన్ కే

        తూర్పు గోదావరి జిల్లలో వస్తున్నా మీ కోసం యాత్ర చేస్తున్న చంద్రబాబు రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. మూడు పార్లమెంటు స్థానాలకు గాను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి గత ఎన్నికల్లో ఓడిపోయిన సినీ నటుడు మురళీమోహన్ ను, అమలాపురం స్థానానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రకటించారు. తాను తిరిగి రాజమండ్రి నుండి పోటీ చేస్తానంటున్న మురళీమోహన్ అభ్యర్థిత్వాన్ని కూడా ముందే ఖరారు చేసుకుని ఏడాది ముందే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్ లోకి వెళ్లి, మళ్లీ టీడీపీలోకి వచ్చిన గొల్లపల్లిని ఎంపీ స్థానానికి ప్రకటించడం వ్యూహాత్మకంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర జిల్లాలో ముగిసేలోపు కాకినాడ ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

వై.ఎస్.ఆర్.సి.పి. లో చేరనున్న కూన శ్రీశైలం

  కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ వై.ఎస్.ఆర్.సి.పి.లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూన శ్రీశైలం గౌడ్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ కు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్ట్టబెట్టారు. 2002-07 వరకు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ ను ములాఖత్ సమయంలో కలుసుకుని మంతనాలు జరిపారు. నియోజకవర్గంలోని బస్తీ నాయకులతో పలుమార్లు సమావేశమైన శ్రీశైలం వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన వైఎస్సార్సీపీ పార్టీలు చేరుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఐరాస ఆమోదం పొందిన శ్రీలంకపై తీర్మానం

  శ్రీలంకలో మానవ హక్కుల మండలి ఉల్లంఘనపై అమెరికా నేతృత్వంలో  తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 47 సభ్యదేశాలు ఉన్న మండలి గురువారం ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా భారత్ సహా 25 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, పాకిస్తాన్తో పాటు 13 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశారు, 8 ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో మానవ హక్కుల మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర, విశ్వసనీయ దర్యాప్తు నిర్వహించాలని, 2009లో ఐరాస  శ్రీలంక మానవహక్కుల మండలికి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, దీర్ఘకాలం కొనసాగిన సంక్షోభం ముగిసిన తరువాత తమిళులతో పాటు అన్ని వర్గాల అంగీకార యోగ్యమైన రాజకీయ పరిష్కారాన్ని అమలు చేయడానికి శ్రీలంకకు ఇదొక అపూర్వమైన అవకాశం అని భారత శాశ్వత ప్రతినిధి దిలీప్ సిన్హా శ్రీలంకకు హితబోధ చేశారు.