కష్టాలలో అమాద్మీ
posted on Jan 16, 2014 @ 2:54PM
పాపం ఆమాద్మీకి ఒక్కసారే అన్ని కష్టాలు ముంచుకు వచ్చాయి. మంత్రి పదవి దక్కని ఆ పార్టీ నేత వినోద్ కుమార్ బిన్నీఅసంతృప్తితో పొగలు గ్రక్కుతూ ఈనెల 27లోగా పార్టీ మ్యానిఫెస్టో చేసిన వాగ్దానాలను అమలుచేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించడమే కాక, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని, పార్టీ సిద్దాంతాలను ఎందుకు అమలు చేయలేదని అడిగినందుకు తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాకెక్కారు. బొటాబొటీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్నఅమాద్మీ ప్రభుత్వానికి ఒక్క సభ్యుడి మద్దతు తగ్గినా పడిపోయే పరిస్థితి ఉంది గనుకనే, వినోద్ కుమార్ అంత వీరంగం ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఆయన తనకు మంత్రి పదవి ఈయకపోతే కనీసం వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు లోక్ సభ టికెట్ అయినా కేటాయించమని అడిగినట్లు, కానీ పార్టీ నియమావళి ప్రకారం శాసనసభ్యులకు లోక్ సభ టికెట్స్ కేటాయించకూడదు గనుక ఆయన కోరికను నిరాకరించడం జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ చెపుతున్నారు.
ఇక ఈ యుద్ధం ఇలాగ సాగుతుంటే, విదేశీ కంపెనీలు రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేఖిస్తూ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి ఆనంద్ శర్మకు వ్రాసిన లేఖపై మరో దుమారం చెలరేగుతోంది. యఫ్.డీ.ఐ.లలో పెట్టుబడులపై ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయం తీసుకొందని దానిని మార్చడం వీలుకాదని ఆయన కుండబ్రద్దలు కొట్టారు.
దేశంలో అత్యంత చవక విమాన టికెట్స్ ప్రవేశపెట్టిన కెప్టెన్ గోపీనాథ్ ఆమాద్మీ పార్టీ సభ్యుడు కూడా. ఆయన కూడా రిటైల్ వ్యాపారంలోకి విదేశీ కంపెనీ పెట్టుబడులను అరవింద్ కేజ్రీవాల్ తెరస్కరించాదాన్ని తప్పు బట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ పార్టీ కూడా ఇటువంటి చవకబారు ఎత్తుగడలతో ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తే చివరికి అది కూడా మిగిలిన అన్ని పార్టీలలాగే మిగిలిపోతుంది. విదేశీ పెట్టుబడులను వ్యతిరేఖించడం దేశానికి నష్టం కలిగించడమే కాకుండా, భారత్ లో పెట్టుబడులు పెట్టలనుకొంటున్న ప్రపంచ దేశాలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చినట్లవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు కూడా మారుతాయనే సంకేతం మంచిది కాదు. అందువల్ల ఆమాద్మీ పార్టీ దీర్గకాల విధానాలు అవలంభించ వలసి ఉంటుంది,” అని అన్నారు.