తూచ్! ముఖ్యమంత్రి ఎవరయినా కావచ్చు: జైరాం
posted on Mar 11, 2014 @ 9:49AM
స్థలం: కరీంనగర్,
సమయం: ఉదయం 10గంటలు
సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.
“అవును! తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి దళితుడనే చేస్తాము. నూటికి నూరు శాతం కాదు 200% ఖచ్చితంగా దళితుడనే ముఖ్యమంత్రిని చేస్తాము. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, దళితుడిని తెలంగాణాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిని చేయడం తధ్యం. ఇది నా మాటే కాదు...రాహుల్ గాంధీ మాట కూడా. మా మాటకు తిరుగు లేదు.”
స్థలం: నిజామాబాద్,
సమయం: మద్యాహ్నం రెండు గంటలు.
సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.
“మా పార్టీ ఎప్పుడో 50 సం.ల క్రితమే దళితుడయిన దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. మా పార్టీ సమాజంలో అన్ని వర్గాలవారికి సమానావకాశాలు కల్పించాలనే దృడ సంకల్పంతో పంచ సూత్ర పాలసీని చాలా కాలంగా అమాలు చేస్తోంది. దాని ప్రకారం సమాజంలో అన్ని వర్గాలకు అంటే యస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అధికారం చెప్పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మా పార్టీ తెలంగాణా విషయంలో అదే పాలసీని అవలంభిస్తుంది. ఈ వర్గాలకు చెందిన ఏ నేతనయినా తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నియమిస్తాము.”
డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది...
తెలంగాణా ఇస్తే మా పార్టీలో తెరాసను విలీనం చేస్తానని మా హ్యాండ్ పార్టీకే హ్యాండిచ్చిన కేసీఆర్, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇంత కాలం చెపుతూ వచ్చి ఇప్పుడు తానే ముఖ్యమంత్రి సీట్లో సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు కదాని.. అతనికి దెబ్బేసేదామని చూస్తే.. డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది...అయినా మావాళ్ళు ఓ డజను మంది ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసుకొని తిరుగుతుంటే, అది పట్టించుకోకుండా వాగినందుకు నాకే వాళ్ళే గడ్డేట్టేసారు మరి...షిట్...షిట్...