సానుభూతికి సాక్షి
జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిళ ముగ్గురూ కలిసి గత ఐదేళ్ళుగా జనంలో వైయస్ మరణం తాలూకు సానుభూతి కరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొస్తున్నారు. ఇప్పడు దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవలసిన సమయం ఆసన్నమయింది. వారు ముగ్గురూ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. చేతిలో ఒక పేపరు, న్యూస్ ఛానల్ ఉంటే అది ఎంత ఉపయోగకరమో ఇప్పటికే సాక్షి మీడియా చూపింది. ఇక కీలకమయిన ఈ సమయంలో ఇప్పుడు దానిని నూటికి రెండువందల శాతం ఏవిధంగా ఉపయోగించుకోవచ్చునో అది మరొకసారి చూపుతోంది. గత రెండు రోజులు సాక్షి టీవీ ఛానల్లో ఆనాడు వైయస్స్ హెలికాఫ్టర్ లో బయలుదేరేముందు మాట్లాడిన మాటలు, ఆయన ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్ జాడ తెలియనప్పుడు విజయమ్మ, ప్రజలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అందరూ స్పందించిన తీరు, ఆయన మరణ వార్త తెలిసిన తరువాత ప్రజల స్పందన ఇత్యాది సంఘటనలన్నిటినీ చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన వర్ధంతి కాదు జయంతి కాదు. మరి ఎన్నికలకు ఇంకా కేవలం మూడు రోజుల ముందే ఎందుకు అవ్వనీ చూపుతున్నారు? అంటే సమాధానం అందరికీ తెలిసిందే.
తండ్రి చనిపోయిన తరువాత ఇంకా అంత్యక్రియలు కూడా జరపకుండానే తను ముఖ్యమంత్రి అయ్యేందుకు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంతకంటే మరింత దిగజారిపోయి, తన తండ్రి మరణాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు మరొకమారు చూపించి వారి సానుభూతిని ఓట్లుగా మలచుకోవాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డిలో ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెపుతోంది.
జగన్ తన పార్టీని బలోపేతం చేసుకొని, తన పార్టీ సిద్దాంతాలు, మ్యానిఫెస్టో గురించి ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ తండ్రి మరణాన్ని, దానిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా చేసుకొని ముఖ్యమంత్రి అయిపోవాలని ఆలోచించడం చాలా దారుణం.
ఇటీవల ఆయన సోదరి షర్మిళ బాలకృష్ణపై విమర్శలు గుప్పిస్తూ ‘బాలకృష్ణ మంచి నటుడు అనిపించుకోగలిగేడేమో కానీ ఒక మంచి కొడుకు అని మాత్రం అనిపించుకోలేకపోయాడు,’ అని ఎద్దేవా చేసారు. ఇప్పుడు అవే మాటలను ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తింపజేయవచ్చేమో!