పవన్ దెబ్బ రుచి చూడబోతున్న బొత్స
posted on May 3, 2014 8:00AM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు అత్యంత ప్రజాధారణ గల పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ చావుకొచ్చినట్లయింది. రాష్ట్ర విభజన వ్యవహారంతో ఖాళీ అయిపోయిన పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు, సభలకు జనాలు దొరక్క నానా అవస్థలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఎక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి.
ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు గనుక సీబీఐ పుణ్యమాని పదవి పోగొట్టుకొని జగన్ పంచన చేరిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సోనియాగాంధీకి దాసోహమంటూ రాష్ట్ర విభజనను సమర్దించిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణీ ఇరువురుకీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చవి చూడబోతున్నారు. ఇక పవన్ తన ప్రియ శత్రువు బొత్ససత్యనారాయణపై ప్రత్యేక శ్రద్ద వహిస్తారని చెప్పనవసరం లేదు. గతంలోనే అనేకమార్లు బొత్స అవినీతి గురించి విమర్శలు చేసారు. ఈరోజు విజయనగరం నడిబోడ్డులో నిలబడి పవన్ కళ్యాణ్ బొత్సపై విమర్శలు గుప్పిస్తే, ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. పాపం బొత్స!