కాంగ్రెస్ సభలకు జనాలు కావలెను
posted on May 2, 2014 @ 7:21PM
గుంటూరులో మొన్నమిట్ట మధ్యాహ్నం నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి నిర్వహించిన సభకి భగభగ మండుతున్న ఎండలని కూడా లెక్క చేయకుండా జనం పోటెత్తారు. అది చూసి మోడీ కూడా చాలా ఆశ్చర్యపోయారు. సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పుకొని తనపై ఇంత ఆప్యాయత చూపుతున్న సీమాంధ్ర ప్రజల ఋణం తప్పకుండా తీర్చుకొంటానని హామీ ఇచ్చారు. ఈరోజు అదే ప్రాంతంలో సోనియాగాంధీ సభ కూడా జరిగింది. జనాలకి ఎండ వేడి తగలకుండా షామియానాలు వేసారు. సుఖంగా కూర్చొనేందుకు కుర్చీలు వేసారు. దాహం తీర్చుకోవడానికి చల్లటి నీళ్ళ ప్యాకెట్లు కూడా అందించారు. కానీ పాపం జనాలే లేరు. మహా అయితే ఓ రెండు వేలమంది హాజరయి ఉంటారేమో! వారిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నేతలె ఎక్కువగా కనబడ్డారు. మిగిలిన వారిలో రోజుకూలి లెక్కన వచ్చిన వారే అధికంగా కనిపించారు. సభలో దాదాపు మూడొంతులు కుర్చీలు ఖాళీగ కనబడ్డాయి. కాంగ్రెస్ నేతలు ప్రసంగిస్తుంటే వాటి మధ్య చిన్న పిల్లలు పరుగులు తీస్తూ హాయిగా ఆడుకోవడం నయనానందకరంగా ఉంది. బహుశః ఆ ఖాళీ కుర్చీలను చూసి సోనియాగాంధీకి కూడా రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి అర్ధమయిందేమో అందుకే "రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రజలను ఎంతగా బాధించిందో అర్ధమైందని" అన్నారు.
చిరంజీవి ప్రసంగం మొదలు పెట్టె ముందు జనాలు కొంచెం హుషారుగా ఈలలు, కేకలు వేసారు. కానీ ఆ తరువాత ఆయన ప్రసంగిస్తునంత సేపు చీమ చిట్టుకుమంటే ఒట్టు. ఇక సోనియా ప్రసంగిస్తుంటే ఉన్న జనాలు కూడా మెల్లగా జారుకోవడం కనబడింది. ప్రజాభిప్రాయాన్ని, స్వంత పార్టీ నేతలనీ ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసి, ప్రజలను, స్వంత పార్టీలో సీనియర్ నేతలను కూడా వదులుకొన్నాక, ఇప్పుడు ప్రజలను రమ్మంటే ఎందుకు వస్తారు? ఇది స్వయంకృతాపరాధమే.