కేసీఆర్ పాలన కంటే ఆంధ్రుల పాలనే బాగుందట!!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో పథకాన్ని ప్రకటిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నప్పటికీ కొంతమంది తెలంగాణ ప్రజలు, నాయకులు మాత్రం ఆయనను సరిగా అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తోంది. కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రకటించారన్న ఆనందం కూడా వారిలో కనిపించడం లేదు. అదేంటోగానీ కేసీఆర్ సొంత జిల్లాలో కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణను సాధించడం కోసం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన దగ్గర్నుంచి కేసీఆర్ చేసిన కృషి ఏమిటో, సాధించిన అభివృద్ధి ఏమిటో అందరికీ స్పష్టంగానే కనిపిస్తోంది. తాను ప్రకటించిన పథకాల ద్వారా తెలంగాణ ప్రజలలో ఉత్సాహాన్ని ఎంతో పెంచారాయ. అయితే కొంతమందిలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన కంటే ఆంధ్రుల పాలనే ఎంతో బాగుందని అంటున్నారు. అది కూడా ఎవరో కాదు.. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ డీసీసీబీ ఉపాధ్యక్షుడు మామిళ్ళ ఆంజనేయులు. ఆంధ్రుల పాలన ఉన్న సమయంలో ఏదైనా పని చేసేముందు లాభ నష్టాలను బేరీజు వేసుకుని చేసేవారని, కానీ కేసీఆర్‌లో మాత్రం అలాంటివేవీ కనిపించడం లేదని ఆయన అంటున్నారు. కేసీఆర్ మెదక్ జిల్లాకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, మెదక్ జిల్లా నుంచి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మెదక్ జిల్లాకే నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. పోచారం ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారని, అదే జరిగితే మెదక్ జిల్లాకి ఎంతో నష్టం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాలో ఆడుకుంటున్నారని ఆయన విమర్శించారు.