చంద్రబాబు, కేసీఆర్ షేక్‌హ్యాండ్!!
ఇప్పటి వరకు మనకి ఏడు ప్రపంచ వింతలు మాత్రమే తెలుసు... ఇప్పుడు ఎనిమిదో వింత జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. గత కొన్నేళ్ళుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు, కేసీఆర్ ఉప్పు-నిప్పు మాదిరిగా వున్నారు. ఇటీవలి కాలంలో అయితే పరిస్థితి మరింత ముదిరింది. ఈ పరిస్థితి ఎంతగా ముదిరిందంటే, ఒకరు ఉన్న చోటికి మరొకరు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ ఒక ప్రదేశంలో కలిశారు. చిరునవ్వులు చిందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ ఎనిమిదో వింతకు బేగంపేట విమానాశ్రయం వేదిక అయింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తోపాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ వీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడటంతో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ ఇద్దరు నాయకులూ ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ హోదాలో ఒకరినొకరు కలుసుకోవడం ఇదే ప్రథమం. షేక్‌హ్యాండ్ అయిన తర్వాత రాష్ట్రపతి విమానం వచ్చేలోపు నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్ మధ్య సరదా సంభాషణ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇది కలయా.. నిజమా.. నో డౌట్ ఇది కల కాదు.. నిజం!!