శ్రీలంకకు సైన్యం సంగతి రాజీవ్ సొంత నిర్ణయం: నట్వర్
posted on Aug 1, 2014 @ 1:29PM
శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపించే నిర్ణయం రాజీవ్ గాంధీ సొంతగా తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన తన కేబినెట్‌ని ఎంతమాత్రం సంప్రదించలేదని, అధికారుల సలహా కూడా తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తెలిపారు. ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో ఇందిరాగాంధీ కుటుంబం గురించి వ్యక్తంచేసిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపించడం అనే అంశం చివరికి రాజీవ్ గాంధీ హత్యకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ సొంతగా తీసుకున్నారు. ఆయన చావుకు ఆయనే కారణమయ్యారు. ఈ విషయాన్ని నట్వర్ సింగ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే కోరగానే రాజీవ్ గాంధీ ఎంతమాత్రం ఆలోచించకుండా సైన్యాన్ని శ్రీలంకకి పంపారని నట్వర్ చెప్పారు. శ్రీలంక ప్రభుత్వంతోగానీ, ఎల్.టి.టి.ఇ. అధినేత ప్రభాకరన్‌తోగానీ రాజీవ్ గాంధీ వ్యవహరించిన విధానం సమర్థనీయం కాదని అన్నారు. ఈ విషయాలను తాను ప్రశ్నిస్తే రాజీవ్ గాంధీ తనను కసురుకున్నారని నట్వర్ వెల్లడించారు.