ఆంజనేయుడికి ఆధార్ కార్డు..

  సామాన్యులకి ఆధార్ కార్డు కావాలంటే నానా తంటాలూ పడాలి. అదే దేవుడికైతే కనీసం అప్లయ్ కూడా చేసుకోకుండా ఆధార్ కార్డు వచ్చేస్తుంది. ఆధార్ కార్డు అధికార వర్గాలు సాక్షాత్తూ హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశాయి. ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ఇతర వివరాలు కూడా పొందుపర్చారు. ఆయన తండ్రి పేరు పవన్ (వాయుదేవుడు). అక్కడితో ఆగారా... ఆధార్ కార్డులో హనుమంతుడి మొబైల్ ఫోన్ నంబర్‌తో పాటు వేలిముద్ర కూడా ఉంది. ఆయనకి 53 ఏళ్ళని, ఆయన 1-1-1959న పుట్టినట్టు కార్డు మీద వుంది. సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని దంత రాంగఢ్ ప్రాంతానికి బెంగుళూరు నుంచి ఈ ఆధార్ కార్డు వచ్చింది. అయితే అడ్రసు సరిగ్గా లేకపోవడంతో ఎవరికి అందజేయాలో తెలియక పోస్ట్ మాన్ తికమకపడ్డాడు. తీరా అది హనుమంతుడి పేరుతో సృష్టించిన ఆధార్ అని తెలుసుకుని బిత్తరపోయాడు. ఆధార్ కార్డు మీద ఉన్న సెల్‌కు ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో చేసేదేమీ లేక పోస్టు మాన్ దీనిని బెంగళూరుకు తిప్పిపంపాడు.

ఏపీ రాజధానికి లక్ష కోట్లివ్వండి...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14వ ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలో కోరారు. తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్ళడానికి తమ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు వున్నాయని వాటికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, వాటి పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందన్న నమ్మకం వుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవాలని చంద్రబాబు ఆర్థిక సంఘాన్ని కోరారు. రాజధాని నిర్మాణానికి 1,00, 213 కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పు

  శ్రీలంకకి భూకంపం, సునామీల ముప్పు పొంచి వున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతన్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలోని చాలా భాగంలో త్వరలోనే భారీ భూకంపాలు, పెద్దపెద్ద సునామీలు రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2004లో సుమత్రాలో 9.2 తీవ్రతతో వచ్చిన వాటికంటే కూడా ఎక్కువ స్థాయిలో రావచ్చని అంటున్నారు. అప్పట్లో వచ్చిన సునామీ కారణంగా దాదాపు రెండు లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే. శ్రీలంకలో6 తరచు భారీ భూకంపాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో 22 ప్రాంతాల్లో నమూనాలను సేకరించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ రానంత తీవ్రతతో ఈసారి సునామీ వచ్చే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మియామీకి చెందిన శాస్త్రవేత్త చెబుతున్నారు.

అడవిలో హత్య.. మృతురాలు రేషన్ డీలర్

  ప్రకాశం జిల్లాలోని మేళ్ళవాగు అటవీ ప్రాంతంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్ళిన వారు మహిళ మృతదేహాన్ని చూసి భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరుపగా, మరణించిన మహిళ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలర్‌ భ్రమరాంబ అని తేలింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆమెను ప్రకాశం జిల్లాలోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి ఎవరో హత్య చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి ఒక్క రోజులోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కేసీఆర్ నా తండ్రితో సమానం: రాజయ్య

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తండ్రితో సమానమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్‌లో కేసీఆర్ తనతో మాట్లాడిన తీరు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఒకవేళ నేను ఏమైనా పొరపాట్లు చేస్తే నన్ను మందలించడానికి ఆయనకు సర్వాధికారాలు వున్నాయి. హడావిడి ప్రకటనలు చేయవద్దని ఆయన నాకు చెప్పడం ఎంతమాత్రం తప్పుకాదు. ఒక తండ్రిలాగా ఆయన నాకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరంగల్‌లో కేసీఆర్ మాట్లాడిన తీరును కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ దళిత పక్షపాతి. నాకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షే’’ అని రాజయ్య అన్నారు.

అంబులెన్స్‌కి యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

  ప్రాణాపాయ స్థితిలో వున్నవారిని ఆదుకునే అంబులెన్స్‌కి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక పేషెంటును ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్న 108 వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 108 వాహనంలో ఉన్న రోగి అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడి ఆ తర్వాత కాకినాడలోని ఆస్పత్రిలో మరణించారు. సంఘటన స్థలానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అమిత్ షా మీద ఛార్జ్‌షీట్... తిరస్కరణ...

  భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద ఉత్తర ప్రదేశ్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆ చార్జ్ షీట్‌ను తిప్పిపంపింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆరోపణ. తన ప్రసంగం ద్వారా అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ స్థానిక అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కుల మతాల పేరుతో ప్రజలను ఓట్లు అడిగినందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్‌తో పాటు, ప్రభుత్వాధికారి జారీచేసిన ఆదేశాలను పాటించనందుకు ఐపిసిలోని 188 సెక్షన్ కింద అమిత్ షాపై కేసును నమోదయింది. అయితే అసలు ఆ ఛార్జిషీటులో అరెస్టు చేయడానికి సరైన కారణాలు చూపకపోవడమే కాకుండా, అరెస్టు వారెంటును కూడా పోలీసులు కోరలేదని కోర్టు తెలిపింది. ఆ ఛార్జిషీటులో పోలీసులు బలమైన కారణాలు చూపకపోవడంతో కొట్టివేస్తున్నట్లు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.

అమిత్ షా మీద ఛార్జ్‌షీట్...

  భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద ఉత్తర ప్రదేశ్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆరోపణ. తన ప్రసంగం ద్వారా అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ స్థానిక అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కుల మతాల పేరుతో ప్రజలను ఓట్లు అడిగినందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్‌తో పాటు, ప్రభుత్వాధికారి జారీచేసిన ఆదేశాలను పాటించనందుకు ఐపిసిలోని 188 సెక్షన్ కింద అమిత్ షాపై కేసును నమోదయింది.

ఎంసెట్ కౌన్సిలింగ్ గడువు పెంచం: సుప్రీం

  ఎంసెట్ కౌన్సిలింగ్ గడువు పెంచడానికి అనుమతించబోమని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఎంసెట్ విషయంలో తాను గతంలో చేసిన సూచనలకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుండాలని ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమైపోయినందున మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. పదేపదే కౌన్సిలింగ్ గడువు పొడిగించడాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం సమంజసంగా లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో 65 వేల సీట్లు ఖాళీగా వున్నాయని ప్రభుత్వం తెలుపగా, దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి కౌన్సిలింగ్‌ని పొడిగిస్తే ఇంకోసారి పొడిగించాలని అడగరని నమ్మకమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

జీమెయిల్ పాస్‌వర్డ్ అర్జెంటుగా మార్చుకోండి

  మీరు జీ మెయిల్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ పాస్‌వర్డ్‌ని అర్జెంటుగా మార్చేయండి. ఎందుకంటే జీమెయిల్‌కి చెందిన దాదాపు 50 లక్షల వరకు యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు లీకయ్యాయట. అవన్నీ ఆన్లైన్లోకి వెళ్లిపోయాయట. మొత్తం 49.3 లక్షల యూజర్ ఐడీలు, పాస్వర్డ్లతో కూడిన డేటా బేస్ రష్యాకు చెందిన బిట్కాయిన్ అనే సెక్యూరిటీ ఫోరంలో పోస్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వున్న జీ మెయిల్ అకౌంట్స్‌లో 60 శాతం వరకు లాగిన్ వివరాలు లీకయ్యాయని అంటున్నారు. అయితే జీమెయిల్ సంస్థ మాత్రం అలా ఏమీ జరగలేదని అంటోంది. అయినా ఎందుకొచ్చిన గొడవ.. మన జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చుకుంటే ఓ పనైపోతుంది కదా.

సానియాకి కేసీఆర్ మరో కోటి గిఫ్ట్

  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఆ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సానియాకి మరో కోటి రూపాయలు నజరానా ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్డ్ టైటిల్ గెలుచుకున్నందుకు గానూ ప్రభుత్వం గురువారం సానియాకు ఈ పారితోషికం ప్రకటించింది. మరోవైపు సానియాకు గతంలోనే కోటి నజరానాపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. టోర్నీ ముగించుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న సానియా... ‘‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే నేను టైటిల్ సాధించగలిగాను. ముఖ్యమంత్రి నన్ను ఎంతో ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నగదు పురస్కారం నాకు యూఎస్ ఓపెన్‌కు ముందు శిక్షణ పొందేందుకు ఉపయోగపడింది. వివాదాల సమయంలో ప్రభుత్వం నాకు ఎంతో అండగా నిలిచింది. ఆ కృతజ్ఙతతోనే... గెలిచాక నా మనసులో మాటను బయట పెడుతూ ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చా’’ అని చెప్పారు. బాగుంది.

తలుచుకుంటే ఏదైనా సాధిస్తా: కేసీఆర్

  తన జీవితంలో ఇప్పటి వరకు తాను ఓటమి అంటూ ఎరుగనని, తాను తలచుకుంటే దేన్నయినా సాధించి తీరుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చాలామంది తెలంగాణ రాదన్నారు.. సాధించి చూపించాను అని ఆయన గుర్తు చేశారు. ఓటమి అనేది తన జీవితంలో లేదని, తాను అనుకున్నది ప్రతి ఒక్కటీ సాధించానని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మూడున్నర ఏళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై తెలంగాణలో సర్వే నిర్వహిస్తాని చెప్పారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ప్రధాని మోడి కూడా సర్వే గురించి అడిగారని, దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వే నిర్వహించాలని ఆయనకి తాను సూచించానని కేసీఆర్ చెప్పారు.