కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులా, విలీనమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అడుగక ముందే ప్రకటించడం ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గిర కావాలని ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆమె ప్రధానంగా తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరగా విముక్తి పొందాలని కోరుకొంటున్నది. యుద్ధంలో సారధిలేని రధంలాగ ముందుకు సాగుతున్నతమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దలంటే ముందుగా జైల్లో ఉన్న తమ రధసారధిని బయటకు తీసుకురావాలి. అయితే, అందుకు తగిన మూల్యం చెల్లించాలని ఆమెకు తెలిసే ఉంటుంది.   రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్డుతొలగడం లేదా ఆ పార్టీ కనుసన్నలలో పనిచేసేందుకు సిద్ధపడటమే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న ఆ మూల్యం కావచ్చును. అయితే, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి పరిస్థితులు ఇంత ఆశాకరంగా కనిపిస్తున్న ఈ తరుణంలో అతని విడుదలకోసం అతని రాజకీయ జీవితాన్ని, పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించట్లేదు. అందుకే విజయమ్మ రాష్ట్రంలో తమకు అధికారం దక్కితే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు భావించవచ్చును.   అయితే, దక్షిణాదిన కేవలం ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మాత్రమే అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీ, ఈ ఒక్క రాష్ట్రాన్ని కూడా తాంబూలంలో పెట్టి జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే తెలుసు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో అధికారంలోకి రావడం అత్యవసరమే గనుక, విజయమ్మ మాటగా ఇరువురూ సంకీర్ణానికి సిద్దపడక తప్పదు.   అయితే, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఈ తరుణంలో అటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని బహిరంగంగా ప్రకటించడం రెండూ కూడా రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని విజయమ్మకు కూడా తెలుసును గనుకనే, ఆమె ఎన్నికల అనంతరం మద్దతు గురించి మాట్లాడారు తప్ప, ఎన్నికల ముందు పొత్తుల గురించి మాట్లాడలేదు.   ఒకవేళ ఆమె గనుక ఎన్నికల ముందు పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడి ఉంటే, జగన్ మోహన్ రెడ్డిపై ఇంతవరకు సానుభూతి చూపిస్తున్నవారు, ఆయనని అభిమానిస్తున్నవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే కష్టాలు పడుతున్నాడని, తన తండ్రిలా చాల దైర్యవంతుడు గనుకనే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకి వచ్చి పార్టీ పెట్టాడని ఆయనని అభిమానిస్తున్న వారు, ఇప్పుడు ఆయన మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో కలిసి పోతాడని తెలుసుకొన్నపుడు ఆయనకీ, ఆయన పార్టీకి దూరంమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల విజయమ్మ అటువంటి ప్రయత్నాలు ఇటువంటి సమయంలో చేయకపోవచ్చును.   ప్రసుత పరిస్థితుల్లో రెండు పార్టీలు తమ ‘శత్రుత్వం కంటిన్యూ’ చేస్తూనే ఎన్నికల సమయానికి చేతులు కలిపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే ప్రస్తుతం చేయగల పని. అప్పటి పరిస్థితును బట్టి శత్రుత్వమా లేక మిత్రుత్వమా తేల్చుకోవడమే మేలు.

ఆరో కృష్ణుడు ఎందుకు అదృశ్యమయిపోయాడు?

  ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పగానే విపక్షాలు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయలనే ఆలోచనలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకు షర్మిల అంత శ్రమపడి ఎండలో ఊరూరు ఎందుకు తిరుగుతున్నట్లు? ఎందుకు ఈ నాటకం ఆడుతునట్లు?అనే తెదేపా, తెరాసల ప్రశ్నకు అటు నుండి సమాధానం లేదు.   కానీ, విజయమ్మ పంపిన ‘మద్ధతు సంకేతాలను’ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా చక్కగానే అందుకొని తగిన విధంగానే స్పందించిందని చెప్పవచ్చును. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డిని ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నందున శాసన సభ్యుల కోటాలో మండలికి తమ పార్టీ తరపున ఆరో అభ్యర్ధిని నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసినప్పుడు, విజయమ్మ సంకేతాలను ‘సకాలంలో’ అందుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేఖించడంతో ఆఖరి నిమిషంలో ఆరో కృష్ణుడు లిస్టు లోంచి ఆకస్మాతుగ్గా అదృశ్యమయిపోయాడు.   ఒకవేళ కిరణ్ నిలపాలనుకొన్న ఆ ఆరో అభ్యర్ధి కానీ రంగంలో ఉండి ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కగానొక్క అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కష్టమయేది. కానీ, విజయమ్మ పలుకులు కాంగ్రెస్ అధిష్టానం చెవిన సకాలంలోనే పడటం ఆ పార్టీకి మేలు చేసిందని చెప్పవచ్చును.   కానీ, రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఆరో అభ్యర్ధిని నిలబెడితే, ఒకవేళ పార్టీలో జగన్ అనుకూల వర్గం వారు క్రాస్ ఓటింగుకు పాల్పడితే, అప్పుడు అసలుకే మోసం వచ్చి తమ ఐదో అభ్యర్ధి ఓటమి పాలవుతాడనే ఆలోచనతోనే తాము వెనక్కి తగ్గామని చెప్పుకొంటునారు. కారణాలు ఏమయినపటికీ, ఈ ‘ఆరో కృష్ణుడు’ తెర మీదకి రాకమునుపే మాయమయిపోయాడు.

2014 ఎన్నికల హైలైట్ ... నాయకుల స్థానమార్పిడి, వారసుల రంగప్రవేశం

రాబోవు శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇతర ప్రాంత నాయకులు ఈసారి నగరంలో పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పలువురు నాయకులు ఇప్పటినుండే అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ ల నియోజకవర్గాల్లో సమీకరణలు ప్రారంభించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, మెదక్ జిల్లా రామాయంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మైనంపాటి హన్మంతరావు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు మక్తల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఉత్సాహం చూపుతున్నారు. కొడంగల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎం.పి. ఆంజన కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ, మంత్రి ముఖేష్ గౌడ్ తమ వారసులను ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి దించాలని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ముఖేష్ గౌడ్ తాను పార్లమెంట్ ఎన్నికల్లో నిలచిన పక్షంలో గోషామహల్ నియోజకవర్గం నుండి తన కుమారుడుని పోటీకి నిలపాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ తన కుమారుడని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి నిలపాలని ప్రయత్నిస్తున్నారు.

గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం, సిపిఎం, సిపీఐ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించగా తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు గవర్నర్ ప్రసంగ పత్రాలను చింపేశారు. తెలుగుదేశం సభ్యులు గాలి ముడుక్రిష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ దొంగల ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా అంటున్నారని విమర్శిస్తూ ... ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ ను గాంధీభవన్ గా మార్చేస్తున్నారని, గవర్నర్ ఇదివరకు ఇచ్చిన ప్రసంగంలోని హామీలను ఎంతమేరకు అమలు చేశారో చెప్పకుండా దాటవేశారని ధ్వజమెత్తారు. సిపిఎం  శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కరెంట్ కోతలు లేవని, ఊకదంపుడు ప్రసంగంగా ఉందని విమర్శించారు. సిపీఐ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం సాదాసీదాగా ఉందని, తెలంగాణా సమస్యకు పరిష్కారం చూపటం లేదని, హైదరాబాద్ లో సైనిక పాలన సాగుతుందని, ప్రజాసమస్యల ప్రస్తావన, వాటి పరిష్కార వివరాలు లేవని విమర్శించారు.

హైకమాండ్ పై జానారెడ్డి గరం గరం

కేంద్ర హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే నెలరోజుల్లో తెలంగాణాపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఎటూ తేల్చకపోవడంతో పంచాయితీ రాజ్ మంత్రి తెలంగాణావాది కుందూరు జనార్థన్ రెడ్డి హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా తెలంగాణా సమస్య పరిష్కారం కావాలని, నెలరోజుల్లోగా, స్థానిక ఎన్నికల తరువాత తెలంగాణా సమస్యపై అధిష్ఠానం తమ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. జానారెడ్డి, తెలంగాణా మాత్రులు, తెలంగాణా నాయకులు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందేనని  హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు.

కొత్త పోప్ ఎన్నికపై అందరి దృష్టి

వాటికన్ సిటీ సిస్టీన్ చాపెల్ లో కార్దినల్స్ కొత్త పోప్ ను ఎన్నుకునేందుకు సమావేశమయ్యారు. బెనడిక్ట్ - 16 రాజీనామా చేయడంతో కొత్తపోప్ ఎన్నిక అనివార్యమైంది. స్వేస్ గార్డ్స్ పర్యవేక్షణలో 115 మంది కార్దినల్స్ చాపెల్ లోకి ప్రవేశించిన తరువాత చాపెల్ తలుపులు మూసివేశారు. కొత్త పాప్ ను ఎన్నుకునే వరకూ వారికి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా సెల్ ఫోన్ జామర్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఇటలీకి చెందిన ఏంజెలో స్కోలా, బ్రెజిల్ కు చెందిన ఓడిలో షేరర్, కెనడాకు చెందిన మార్క్ ఔలేట్ లలో ఒకరు కొత్త పోప్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రియా, హంగేరీ, మెక్సికో, ఫిలిపిన్స్, అమెరికా, దక్షిణాఫ్రికా కార్దినల్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పోప్ గా కేథలిక్ ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం మరోసారి పాశ్చాత్య సంప్రదాయవాదికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'నిర్భయ్' ఫెయిల్

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.వో.) భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ 'నిర్భయ్' ను మంగళవారం ఒడీశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రంలో మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 11.50నిముషాలకు ప్రయోగించారు. నిర్భయ్ 25 నిముషాలు ప్రయాణించి మధ్యలోనే దారితప్పడంతో శాస్త్రవేత్తలు నిర్భయ్ ను మధ్యలోనే నిలిపివేశారు. లక్ష్యసాధనలో విఫలమైన నిర్భయ్ శకలాలు తీరప్రాంతంలోని సరబంత్, గదహరివ్ పూర్ గ్రామాలలోని మామిడి తోటల్లో పడడంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు. తీరప్రాంత భద్రతకోసం ముడుజాగ్రట్ట చర్యగా నిర్భయ్ క్షిపణిని మధ్యలోనే కూల్చివేయవలసి వచ్చిందని, మార్గమధ్యంలోనే నిర్వీర్యం చేసిన క్షిపణిలు నేలపై కూలడం అసాదారణమని, దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని డి.ఆర్.డి.వో. అధికార ప్రతినిధి రవి గుప్తా ప్రకటించారు.

అత్యాచారానికి మరో పసిపాప బలి

కడపజిల్లా చెన్నూరు మండలంలోని శివాలపల్లె ఆర్ ఆర్ పాఠాశాలలో 1వ తరగతి చదువుతున్న గుత్తా మానస అనే 7 సంవత్సరాల పాపను అదే పాఠాశాలలో చదువుతున్న బాలుడు పాపకు మాయమాటలు చెప్పి మంగళవారం సాయంత్రం పెన్నానది ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడకి చేరుకున్న మరో నలుగురు యువకులు బాలికపై అత్యాచారం చేసి బాలికను చంపి పెన్నానదిలో పడేశారు. స్కూలు సమయం అయిపోయినా పాప ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి పదిన్నరకు నది పక్కనే ఉన్న ముళ్ళపొదలో బాలిక శవం కనిపించింది. పోలీసులు నంద్యాల వెంకట శివను ప్రశ్నించగా తనకు ఏమీ తెలీదని ఆటోడ్రైవర్ నంద్యాల శ్రావణ్ పాపను తీసుకుని రమ్మని చెప్పగా తాను పాపను తీసుకుని వెళ్లానని తెలిపాడు. పోలీసులు నంద్యాల శ్రావణ్, శివశంకర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

విద్యార్థులకు శుభవార్త !

గతంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ భారత వైద్యమండలి పరిథిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యూజీ, పిజీ కోర్సుల ప్రవేశానికి నీట్ తప్పనిసరి అని వెల్లడించారు. సుప్రీంకోర్టు 2012 డిసెంబర్ 13న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నీట్, ఎంసెట్ రెండూ హాజరు కావచ్చని గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలు గుండు సుధారాణి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు అజాద్ సమాధానమిస్తూ "ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు, ప్రైవేటు కాలీజీలు నీట్ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులో కేసులు దాఖలు చేశాయి. హైకోర్టులో దాఖలైన పిటీషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల రాజ్యాంగంలో ప్రత్యేక షరతులున్నప్పటికీ ఎంసిఐ చట్టం 1956 నిబంధనలు, నీట్ నిబంధలతో ఎలాంటి వైరుధ్యం ఉండదు. వీటిని రాజ్యాంగం ఏడో షెడ్యూల్ లోని 66వ ప్రవేశ జాబితా కింద రూపొందించాం. టీసీ కేస్ నెంబర్ 101/2012తో పాటు, దానితో ముడిపడిన ఇతర కేసులను పరిశీలించిన తరువాత మెడికల్, డెంటల్ కౌన్సిల్స్ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు యథాతథంగా నిర్వహించుకోవచ్చని, ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని సుప్రీంకోర్టు 2012 డిసెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2013 నీట్, ఎంసెట్ రెండింటినీ రాయవచ్చని'' చెప్పారు.

లోహం ... కాగితం ... ఇప్పుడు ప్లాస్టిక్

యుగాల క్రితం లోహపు కరెన్సీ చలామణిలో ఉండేది. తరువాత కాగితపు కరెన్సీ చలామణిలోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ కరెన్సీ మార్కెట్లోకి విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పది రూపాయల ప్లాస్టిక్ రూపాయల నోటును ఐదు రాష్ట్రాలలో విడుదల చేయనుంది. దేశంలో విభిన్న వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉన్న కోచీ, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాలలో మొదట వీటిని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మంగళవారం రాజ్యసభలో తెలిపారు. వందకోట్ల పదిరూపాయల నోట్లను విడుదల చేస్తామని తెలిపారు. నకిలీ నోట్లను నిరోధించడానికి, నోట్ల జీవితకాలాన్ని పెంచడమే వీటి ధ్యేయమని తెలిపారు.

అవిశ్వాసానికి మేము దూరం ...

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాస రాజకీయ ఎత్తుగడలకు సాయపడకూడదని నిర్ణయించారు. జగన్ బెయిల్ కోసం బేరసారాలు నెరిపెందుకు వైఎస్సార్సీపీ, ప్యాకేజీలు మాట్లాదేకునేందుకు తెరాస ఇటువంటి డ్రామాలు ఆడుతోందని అన్నారు.  తోక పార్టీలను పట్టుకుని ఎందుకు వెళ్ళడం, రేపో  మాపో కాంగ్రెస్ లో విలీనం అయ్యే పార్టీలతో మనం ఎందుకు కలిసి వెళ్ళాలి? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాడదాం. ప్రభుత్వం దిగిరాకపోతే అవిశ్వాస తీర్మానంపై సరైన సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకుందాం అని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు తెలిసింది. తెరాస, వైఎస్సార్సీపి రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి ఎత్తుగడలను, బ్లాక్ మెయిల్, డ్రామాలు ఆడుతోందని దానికి తాము ఎందుకు సహకరించాలని పార్టీ ముఖ్యనేతలంతా భావిస్తున్నట్లు తెలిసింది.

నీ ఊరికొస్తా...నీ వీధికొస్తా...నీ ఇంటి కొస్తా... కిరణ్ కుమార్

  ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో మొదలయిన రెవెన్యు సదసులో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తానూ మెహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటివరకు 7సార్లు వచ్చానని, కానీ, ఇదే జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్న కేసీఆర్ మీ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడని ప్రజలను ప్రశ్నించారు. తానూ ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం జిల్లాకు వస్తుంటే, కేసీఆర్ మాత్రం ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రమే జిల్లాకు వచ్చిపోతుంటాడని హేళన చేసారు. తానూ మహా మొండివాడినని, తానూ దేనికీ వెనుకాడే మనిషిని కానని అన్నారు. తన ప్రభుత్వానికి 5ఏళ్ళు పాలించమని ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు తానెవారికో భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ ను పరోక్షంగా ఉద్దేశించి అన్నారు.   తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాసం పై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా చొరవతీసుకొని తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ఆయన ప్రాతినిద్యం వహించే జిల్లా మెహబూబ్ నగర్ కే వెళ్లి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడం ద్వారా తానూ నిజంగానే తాటాకు చప్పులకి బెదిరేవాడిని కానని ఆయన స్పష్టం చేసినట్లయింది.

వైఎస్ కు రూ. 500 కోట్లు ఇచ్చిన గాలి..!

        దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల ఫండ్‌గానూ గాలి జనార్ధన్‌రెడ్డి వైఎస్‌కు రూ. 500 కోట్లు ఇచ్చారని వార్తలు వస్తున్నాయని పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని గాలి జనార్ధన్‌రెడ్డి సీబీఐ ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసిందని అన్నారు. ఆ డబ్బు వైఎస్ ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారని కేశవ్ అరోపించారు. సీబీఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టుకు వస్తుందని పయ్యావుల పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని కేశవ్ డిమాండ్ చేశారు. కాగా ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌రెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

రామానాయుడి దర్శక అవతారం

        నాలుగున్నర దశాబ్దాలుగా శతాధిక చిత్రాలను నిర్మించిన మూవీమొఘల్ డాక్టర్ డి.రామానాయుడు డైరెక్టర్ అవతారం ఎత్తుతున్నారు. పంజాబీలో ఆయన నిర్మించిన 'సింగ్ వర్సెస్ కౌర్' సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా తో రామానాయుడు డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ సినిమాని తెలుగు లో తన మనవడు దగ్గుబాటి రానా తో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదట ఈ సినిమాని వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు..కాని రాణాతో చేస్తే బాగుంటుందని ఆయన భావించారట. ఆ తరువాత వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఉండాలని..ఈ సినిమాని మల్టీస్టారర్ గా తీయబోతున్నారు. ప్రముఖ రచయిత సత్యానంద్ స్క్రిప్ట్ వర్క్ ను కూడ మొదలుపెట్టారు. మనవడి కోసం తాత దర్శకుడిగా మారడం విశేషమే.

రా౦సింగ్ ది ఆత్మహత్య: పోస్టుమార్టం రిపోర్ట్

        ఢిల్లీలో వైద్య విద్యార్ధిని పై సాముహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రా౦సింగ్ మృతుదేహానికి ఎయిమ్స్ లో శవపరీక్ష నిర్వహించారు. రా౦సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఉరి వేసుకోవడం వల్లనే అతను మృతి చెందాడని వైద్యుల పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 'నిర్భయ' పై సాముహిక అత్యాచారం కేసులో నిందితుడు రా౦సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాంసింగ్ ఆత్మహత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు.      23 ఏళ్ల నిర్భయపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన బస్సులో అతి కిరాతకంగా అత్యాచారం జరిగింది. బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంపై ఢిల్లీ అట్టుడికింది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో మహిళల రక్షణపై చర్చకు ఈ సంఘటన దారి తీసింది. మహిళ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి విధించాల్సిన శిక్షలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరు మీద మహిళల కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది.

కొరివితో తల గోక్కొంటున్న షిండే గారు!

  హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే గతంలో రెండు మూడు సార్లు అనవసరంగా నోరు జారి తానూ ఇబ్బందులలో పడటమే కాకుండా, తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. ఆయన చేసిన ‘నెల రోజుల్లో తెలంగాణా’ వాగ్దానం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులకు గురయిందో అందరికీ తెలిసిందే. చివరికి గులంనబీ ఆజాద్ కలుగజేసుకొని ‘నెలంటే ముప్పై రోజులు కాదు’ అని ఒక కొత్త భాష్యం చెప్పి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసాడు మాహానుభావుడు. నాటి నుండి తెలంగాణా విషయంలో నిశ్చింతగా కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి షిండే మళ్ళీ తన సరికొత్త వ్యాక్యలతో తలనొప్పులు తెచ్చిపెట్టారు.   తెరాస తదితర తెలంగాణా వాదులు ఎన్నికల సీజన్ వచ్చినందున తెలంగాణా అంశాన్ని పక్కన బెట్టడంతో రాష్ట్రంలో బయట వాతావరణంతో బాటు రాజకీయ వాతావరణం కూడా చాలబడి బాగా ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోష పడుతుంటే, హోం మంత్రి షిండేగారు తెలంగాణా పై మళ్ళీ అనవసరంగా నోరు విప్పి అగ్గి రాజేశారు.   “నేను నెలరోజుల్లో తెలంగాణా ప్రకటిస్తానని ఎన్నడూ, ఎవరితోను చెప్పలేదు. కేవలం నెల రోజుల్లో తెలంగాణా అంశంపై నా నివేదిక ఇస్తానని మాత్రమే చెప్పాను. చెప్పిన మాట ప్రకారమే నా నివేదికను కేంద్రానికి అందజేసాను. ప్రస్తుతం దాని మీదే చర్చ జరుగుతోంది. అయినా, తెలంగాణా అంశం ఇప్పటికిప్పుడు తేల్చే విషయం కాదు. తెలంగాణా ఇచ్చినట్లయితే, దేశంలో విదర్భవంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండులు చాలా తలెత్తుతాయి. అందువల్ల నిర్ణయం తీసుకోవాలన్నాకూడా దేశంవ్యాప్తంగా ఏర్పడే పరిస్థితులను పరిగానణలోకి తీసుకొనే నిర్ణయం చేయవలసి ఉంటుంది”అని అన్నారు.   ఆయన ఈ విధంగా పనిగట్టుకొని మరీ తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కోరుండి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. ఈవిధంగా అప్రస్తుత ప్రసంగం చేసి కాంగ్రెస్ తెలంగాణాకు వ్యతిరేఖం అని ఆయనే స్వయంగా చాటింపు వేసుకోన్నట్లు అవుతుంది. కేంద్రంలో ఉన్న ఆయనకు తెలంగాణా వాదులనుండి కొత్తగా వచ్చే ఇబ్బందులేవీ లేకపోవచ్చును, కానీ, ఆయన చేస్తున్న ఇటువంటి ప్రకటనల వల్ల తెలంగాణా కాంగ్రెస్ వాదుల గుండెల్లో మాత్రం రైళ్ళు పరిగెట్టిస్తుంటాయి. స్థానికంగా ఉండే వారికి ఆయన మాటలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.   ప్రస్తుతం తెలంగాణా కావాలని ఎవరూ ఆయన వెంటబడటం లేదు. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాటాలు చేసి చేసి అలిసిపోయున్న తెరాస కూడా ఇక ఎన్నికలే శరణ్యం అని భావిస్తూ, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతుంటే, ఇటువంటి సమయంలో షిండేగారు ఈ అనవసరమయిన ప్రకటనలు చేయడం ఎంత మాత్రం సబబు కాదు. తద్వారా రాష్ట్రంలో అయన పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.

బాలనటుడు తేజ మృతదేహం లభ్యం

    గంగానదిలో గల్లంతైన బాల నటుడు తేజ మృతదేహం లభ్యమైంది. ఉత్తరఖండ్‌లోని రిషికేష్ సాయిఘాట్ దగ్గర తేజ మృతదేహం తేలింది. తేజ పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఉన్న మిరిపిరి అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్‌ వెళ్లిన తేజ గంగానదిలో దిగి గల్లంతయ్యాడు. గాలింపు చేపట్టిన పోలీసులు సాయిఘాట్ వద్ద తేజ మృతదేహాన్ని గుర్తించారు. శవపరీక్ష అనంతరం రేపు తేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. తేజ బాలనటుడిగా మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో నటించాడు. తేజ మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

వైఎస్ విజయమ్మ ఇంటర్వ్యూకి సవరణలున్నాయి

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మొన్న తానూ ఎకనామిక్స్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు పై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో ఈ రోజు ఆమె కొన్ని సవరణలు ఇచ్చారు.   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ “నా ఇంటర్వ్యు వివరాలను ఆ పత్రిక లోపలి పేజీలలో సరిగ్గానే ప్రచురించినప్పటికీ, మొదటిపేజీలో మాత్రం వేరే అర్ధం వచ్చేలా హెడ్డింగ్ పెట్టి ప్రచురించింది. ప్రతిపక్షాలు అది పట్టుకొని రాద్ధాంతం మొదలుపెట్టారు. వారిలో ఎవరూ కూడా నా ఇంటర్వ్యు వివరాలను కనీశం పూర్తిగా చదివి ఉండరు. అందుకే, మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మన పార్టీ 2014సం. ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఏర్పడే మూడో ఫ్రంటుకో లేదా బీజేపీయేతర మరో పార్టీకో మద్దతు ఇస్తామని చెప్పాను. కానీ, ఆపత్రిక ఆ విషయాన్ని మరో విధంగా ప్రచురించింది. దానిని పట్టుకొని ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి,” అని అన్నారు ఆమె.   అయితే, ఇప్పుడు చెపుతున్నదానికి, మొన్న ఆ పత్రికకు చెప్పినదానికి మధ్య ఉన్న తేడా ఏమిలేదు. కాకపొతే ఆమె ఈసారి ‘కాంగ్రెస్ నేతృత్వం పనిచేస్తున్న యు.పీ.యే.ప్రభుత్వానికి మా మద్దతు’ అనే వాఖ్యానికి బదులు ‘మరో పార్టీకి మద్దతు ఇస్తామని’ చెప్పారు. కేంద్రంలో బీజేపీకి తాము మద్దతు ఈయమని ఆమె స్పష్టం చేసిన తరువాత, ఇక మిగిలింది కేవలం కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేస్తున్న యు.పీ.యే.ప్రభుత్వo మాత్రమే. ఇక, 3వ ఫ్రంటు ఉనికే లేనప్పుడు, ఆమె ఎంత డొంకతిరుగుడుగా చెప్పినా దానర్ధం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పడమే.   అయితే, ఆమె ఆ పని చేసేందుకు ఒక సంవత్సరం వృధా చేయడం వలన, ఆమె కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అంతకాలం జైల్లోనే కాలం వెళ్ళదీయక తప్పదు. అందువల్ల, 2014సం.లో చేయాలనుకొన్న ఆ పనేదో ఇప్పుడే చేసినట్లయితే, కనీసం ఆమె కుమారుడు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే అవకాశం అయినా ఉంటుంది. 2014సం.లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా, ఇప్పుడు కలిపినా ఛ్చీ కొట్టేవారు ఎప్పుడు ఛ్చీ కొట్టకమానరు. అందువల్ల ఏడాది కాలం వృధా చేసుకొని, అంతవరకు జగన్ మోహన్ రెడ్డిని జైలులో కుమిలిపోయేలా చేసే బదులు ఆ పనేదో ఇప్పుడే చేసేసి వీలయినంత ఎక్కువ ప్రయోజనం పొందడం వివేకం కదా? కేంద్రంలో ఏ పార్టీ వస్తుందో తెలియదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండువేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తాను చెబితే ఎకనామిక్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలో ఒకరకంగా రాశారని, లోపల పేజీలో మాత్రం కరెక్టుగానే రాశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు.పార్టీ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆమె ప్రసంగింఆచరు.ఆయా పక్షాల నేతలు తన ఇంటర్వ్యూను పూర్తిగా చదవకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.అయితే ఈ వివరణలో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తేకుండా విజయమ్మ జాగ్రత్తపడ్డారు.కేంద్రంలో వస్తుందో లేక, మరే పార్టీ వస్తుందో తెలియదని, అందువల్ల అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మద్దతు ఇస్తామని ఆమె అన్నారు.లోక్ సభకు ముప్పై నుంచి ముప్పై మూడు స్థానాలు, శాసనసభకు రెండువందల స్థానాలు తమ పార్టీకి వస్తాయని చెప్పినట్లు కూడా ఆమె పేర్కొనడం విశేషం.