గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు
posted on Mar 13, 2013 @ 12:20PM
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం, సిపిఎం, సిపీఐ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించగా తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు గవర్నర్ ప్రసంగ పత్రాలను చింపేశారు. తెలుగుదేశం సభ్యులు గాలి ముడుక్రిష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ దొంగల ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా అంటున్నారని విమర్శిస్తూ ... ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ ను గాంధీభవన్ గా మార్చేస్తున్నారని, గవర్నర్ ఇదివరకు ఇచ్చిన ప్రసంగంలోని హామీలను ఎంతమేరకు అమలు చేశారో చెప్పకుండా దాటవేశారని ధ్వజమెత్తారు. సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కరెంట్ కోతలు లేవని, ఊకదంపుడు ప్రసంగంగా ఉందని విమర్శించారు. సిపీఐ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం సాదాసీదాగా ఉందని, తెలంగాణా సమస్యకు పరిష్కారం చూపటం లేదని, హైదరాబాద్ లో సైనిక పాలన సాగుతుందని, ప్రజాసమస్యల ప్రస్తావన, వాటి పరిష్కార వివరాలు లేవని విమర్శించారు.