ఆరో కృష్ణుడు ఎందుకు అదృశ్యమయిపోయాడు?
posted on Mar 13, 2013 @ 8:12PM
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పగానే విపక్షాలు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయలనే ఆలోచనలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకు షర్మిల అంత శ్రమపడి ఎండలో ఊరూరు ఎందుకు తిరుగుతున్నట్లు? ఎందుకు ఈ నాటకం ఆడుతునట్లు?అనే తెదేపా, తెరాసల ప్రశ్నకు అటు నుండి సమాధానం లేదు.
కానీ, విజయమ్మ పంపిన ‘మద్ధతు సంకేతాలను’ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా చక్కగానే అందుకొని తగిన విధంగానే స్పందించిందని చెప్పవచ్చును. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డిని ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నందున శాసన సభ్యుల కోటాలో మండలికి తమ పార్టీ తరపున ఆరో అభ్యర్ధిని నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసినప్పుడు, విజయమ్మ సంకేతాలను ‘సకాలంలో’ అందుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేఖించడంతో ఆఖరి నిమిషంలో ఆరో కృష్ణుడు లిస్టు లోంచి ఆకస్మాతుగ్గా అదృశ్యమయిపోయాడు.
ఒకవేళ కిరణ్ నిలపాలనుకొన్న ఆ ఆరో అభ్యర్ధి కానీ రంగంలో ఉండి ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కగానొక్క అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కష్టమయేది. కానీ, విజయమ్మ పలుకులు కాంగ్రెస్ అధిష్టానం చెవిన సకాలంలోనే పడటం ఆ పార్టీకి మేలు చేసిందని చెప్పవచ్చును.
కానీ, రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఆరో అభ్యర్ధిని నిలబెడితే, ఒకవేళ పార్టీలో జగన్ అనుకూల వర్గం వారు క్రాస్ ఓటింగుకు పాల్పడితే, అప్పుడు అసలుకే మోసం వచ్చి తమ ఐదో అభ్యర్ధి ఓటమి పాలవుతాడనే ఆలోచనతోనే తాము వెనక్కి తగ్గామని చెప్పుకొంటునారు. కారణాలు ఏమయినపటికీ, ఈ ‘ఆరో కృష్ణుడు’ తెర మీదకి రాకమునుపే మాయమయిపోయాడు.