విద్యార్థులకు శుభవార్త !

గతంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ భారత వైద్యమండలి పరిథిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యూజీ, పిజీ కోర్సుల ప్రవేశానికి నీట్ తప్పనిసరి అని వెల్లడించారు. సుప్రీంకోర్టు 2012 డిసెంబర్ 13న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నీట్, ఎంసెట్ రెండూ హాజరు కావచ్చని గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలు గుండు సుధారాణి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు అజాద్ సమాధానమిస్తూ "ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు, ప్రైవేటు కాలీజీలు నీట్ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులో కేసులు దాఖలు చేశాయి. హైకోర్టులో దాఖలైన పిటీషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల రాజ్యాంగంలో ప్రత్యేక షరతులున్నప్పటికీ ఎంసిఐ చట్టం 1956 నిబంధనలు, నీట్ నిబంధలతో ఎలాంటి వైరుధ్యం ఉండదు. వీటిని రాజ్యాంగం ఏడో షెడ్యూల్ లోని 66వ ప్రవేశ జాబితా కింద రూపొందించాం. టీసీ కేస్ నెంబర్ 101/2012తో పాటు, దానితో ముడిపడిన ఇతర కేసులను పరిశీలించిన తరువాత మెడికల్, డెంటల్ కౌన్సిల్స్ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు యథాతథంగా నిర్వహించుకోవచ్చని, ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని సుప్రీంకోర్టు 2012 డిసెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2013 నీట్, ఎంసెట్ రెండింటినీ రాయవచ్చని'' చెప్పారు.

Teluguone gnews banner