భువనేశ్వరి గారు చెప్పగానె దీక్ష విరమించా౦

        విద్యుత్ సమస్యలపై నిరవధిక దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్స్ లో దీక్షలను విరమించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యేలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనారోగ్యం క్షీణించిన ఎమ్మెల్యేలకు నిమ్స్ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు నిమ్స్ నుంచి ఈఆర్సీకి వెళ్లనున్నారు. నిమ్స్ ఆస్పత్రి వద్ద టీడీపీ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా  దీక్ష విరమించాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి కోరారని చెప్పారు. దీంతో నేతలు దీక్షల ను విరమించారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

టిడిపి నేతల దీక్ష భగ్నం ఫోటోస్

విద్యుత్ సమస్యల మీద ఆందోళన చేస్తున్న టీడీపీ నేతల నిరాహార దీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. గత నాలుగు రోజులుగా హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న 26 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని జాయింట్ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో బలవంతంగా అరెస్టు చేశారు. దీక్షను విరమింపచేసేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం అన్యాయమని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను చికిత్స నిమిత్తం స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చికిత్సకు నిరాకరిస్తున్నారు.          

పెన్నా ప్రతాపరెడ్డిని విచారిస్తున్న సిబీఐ

  వై.ఎస్. జగన్ కంపెనీల్లో పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు సిబీఐ అభియోగం మోపింది. తాజాగా పెన్నా ప్రతాపరెడ్డిని సిబీఐ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో రెండు రోజులపాటు విచారించింది. వై.ఎస్. ప్రభుత్వంలో మార్చి 12, 2008లో అనంతపురం జిల్లా తలారి చెరువు గ్రామంలో 264 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలు,  రంగారెడ్డి జిల్లాలో 548 ఎకరాల మైనింగ్ లీజు, కర్నూలు జిల్లాలో 807 ఎకరాల సున్నపురాయి ప్రోసెసింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. దీనికి ప్రతిఫలంగా పెన్నా ప్రతాపరెడ్డి వై.ఎస్. జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిందనే అభియోగంపై ప్రతాపరెడ్డిని సిబీఐ విచారించింది. విశాఖపట్నంజిల్లాలో వేలకోట్ల రూపాయల విలువచేసే బాక్సైట్ నిక్షేపాలను ఆన్ రాక్ అనే సంస్థకు అప్పగించింది వై.ఎస్. ప్రభుత్వం. ఆన్ రాక్ ప్రాజెక్టులో పెన్నా ప్రతాపరెడ్డి కీలక భాగస్వామిగా ఉన్నారు. పెన్నా ప్రతాపరెడ్డి వై.ఎస్. ప్రభుత్వ హయాంలో భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకుందని సిబీఐ ఆరోపణ.

వైస్సార్సీపీ లో కుమ్ములాటలు

  గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోకవర్గాలకు వైఎస్సార్సీపీ 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపికచేసి వారిని కోఆర్డినేటర్లుగా నియమించింది. ఈ క్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా అంబటి రాంబాబుని నియమించింది. ఈ నియోజకవర్గ నుండి టిక్కెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి, నలందా విద్యాసంస్థల అధినేత వరప్రసాద్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అంబటి రాంబాబు సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. తనకు సత్తెనపల్లి నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తాను నియోజకవర్గంలో కాలుపెడితే చంపేస్తామంటూ ఎవరో ఫోన్ చేస్తున్నారని అంబటి పోలీస్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. నాలుగు స్థానాలలో ఇద్దరేసి కొఆర్డినేటర్లను నియమించింది వైఎస్సార్సీపీ అధిష్ఠానం.

టిడిపి దీక్ష భగ్నం ... నిమ్స్ కు తరలింపు

  నాలుగు రోజులుగా టిడిపి ఎమ్మెల్యేలు కరెంట్ కోతలు, ఛార్జీల పెంపుదలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శనివారం అర్థరాత్రి ఒంటిగంటకు పోలీసులు టిడిపి దీక్షా శిబిరంపై ఆకస్మాత్తుగా దాడిచేసి ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్పీకర్ అనుమతితోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వివిధ ఆసుపత్రుల అంబులెన్స్ లలో వీరిని నిమ్స్ కు తరలించారు. ప్రజా సమస్యలపై తాము ప్రభుత్వానికి విరుద్ధంగా చేపట్టిన నిరాహార దీక్షను ఇలా అర్థరాత్రి భగ్నం చేయడం ఎంతవరకు సబబు అని, హాస్పిటల్ కు తరలించిననంత మాత్రాన తాము దీక్ష విరబించబోమని ఆసుపత్రిలోనే దీక్షలను కొనసాగిస్తామని టిడిపి ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం అన్ని మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపడతామని కూడా వారు తెలిపారు.

గమనిక: జయప్రదకు రాజమండ్రి టికెట్ కావలెను

  అలనాటి అందాల నటి, ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ యంపీ జయప్రద సమాజ్ వాది పార్టీతో తెగ తెంపులు చేసుకొని బయటపడిన తరువాత మళ్ళీ పుట్టింటి వైపు మనసు మళ్ళడంతో రాష్ట్రానికి తిరిగివచ్చారు. అయితే ఆమె వచ్చి ఏడాది అవుతున్నపటికీ ఇంకా ఏ పార్టీలోను చేరలేదు, కానీ ఇక రాష్ట్ర రాజకీయాలలో దూకేయడం మాత్రం ఖాయం అని ఆమె నాటి నుండి నేటి వరకు చెపుతున్నారు. అయితే ఇంతవరకు ఏ పార్టీ నుండి కూడా ఆమెకు ఆహ్వానం వచ్చినట్లు కనబడలేదు. అయినప్పటికీ, ఆమె తానూ రాజమండ్రీ నుండే పోటీ చేయాలనుకొంటున్నట్లు మాత్రం ప్రకటించేశారు.   అంటే తనని పార్టీలో చేర్చుకోదలచిన వారికి ఆమె ముందుగానే రెండు షరతులు పెట్టినట్లు భావించాలి. పార్టీలో చేరాలంటే టికెట్ ఈయడం, అది కూడా రాజమండ్రీ టికెట్ అయి ఉండాలి. అసలు ఆమెను ఏ పార్టీ ఆహ్వానించనప్పుడు, ఇక టికెట్ ప్రసక్తి ఎందుకు? ఇప్పటికే, అన్ని పార్టీలలో ఏళ్ల తరబడి చేస్తున్న సీనియర్లు, ఆ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న వారు చాలా మంది ఉండగా, హట్టాతుగా ఊడిపడిన ఆమెకు టికెట్, అది కోరుకొన్న చోటి నుండే ఎవరు ఇస్తారు? అని ఆమె ఆలోచించారో లేదో తెలియదు కానీ, తన రెండు షరతుల వలన ఆమెకు ఏ పార్టీలోకి ప్రవేశించే అవకాశాలు లేకుండా చేసుకొన్నారు.   కానీ, ఆమె ఒకనాడు తనతో కలిసి సినిమాలలో నటించిన చిరంజీవి అభయ ‘హస్తం’ అందుకొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా కలిసి మాట్లాడగల చిరంజీవి ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఆమెను జయప్రదంగా పార్టీలో అయితే ఆయన చేర్పించగలడు కానీ, కాంగ్రెస్ పార్టీకి పాత కాపు, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు అని పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సీటు క్రింద మంట పెట్టే సాహసం చేయగలడా? చేస్తే కాంగ్రెస్ అధిష్టానం సమ్మతిస్తుందా? పార్టీకి పాతకాపయిన ఉండవల్లిని కాదనుకొని అకస్మాత్తుగా ఊడిపడిన జయప్రదకు టికెట్ ఎందుకు ఈయాలి అని అడిగితే చిరంజీవి దగ్గర సరయిన సమాధానం ఉందా?   ఏది ఏమయినప్పటికీ, జయప్రద ఇన్నేళ్ళ రాజకీయానుభవంలో ఈ మాత్రం చిన్న విషయం నేర్చుకోకనే రాజమండ్రీకి టికెట్ పుచ్చుకోవాలని బయలుదేరి వచ్చేసారా? అయినా నిన్ననే, ముఖ్యమంత్రి ఏదో సందర్భంలో “క్యూలో చాలా మంది ఉన్నారు. దయచేసి మీ సమయం వచ్చే వరకు వేచి చూడండి” అని ఒక ప్రకటన కూడా చదివినిపించినట్లు సమాచారం.మరటువంటప్పుడు ఆమె ఏ జీవిని నమ్ముకొంటే మాత్రం ఏమి లాభం ఉంటుంది?   ఆమెకు రాజమండ్రీ మీద అంతగా ఆసక్తి, తన గెలుపు మీద నమ్మకం ఉంటే హాయిగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసుకొని గెలిచేస్తే, ఆనక కేంద్రంలో ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా తగిన మూల్యం చెల్లించి మరీ ఆమెను తమ పార్టీలో చేర్చుకొంటుంది. గనుక, ఇక స్వంతంత్ర అభ్యర్ధిగా నిలబడి ఎన్నికలలో జయప్రదం అయిపోవడమే ఆమెకు మేలు.

అంబటి నిన్ను చంపేస్తాం

        వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ఈ మధ్య విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.“సత్తెనపల్లిలో అడుగుపెట్టావంటే నిన్ను చంపేస్తాం” అని అంబటి కి రోజు ఫోన్ లు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక చివరికి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అంబటికి జిల్లాలో తనకంటూ ఓ నియోజకవర్గం లేదు.ఆయన సత్తెనపల్లి నుండి పోటీచేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇక్కడ టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారట. అయితే స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఊరుకునేదిలేదని సత్తెనపల్లి వాసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో పార్టీలో ఆయనకు పోటీగా ఉన్నవారే ఈ కాల్స్ చేశారని భావిస్తున్నారు. వరసగా పది రోజుల నుండి ఇలా బెదిరింపు టెలిఫోన్ కాల్స్ రావడం పట్ల అంబటి తట్టుకోలేక ఫిర్యాదు చేశారట.

త్రిశంకు స్వర్గంలో వల్లభనేని వంశీ

  కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్లు విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుండి తొలగింపబడటానికి వల్లభనేని వంశీకి కూడా అన్నే కారణాలున్నాయని చెప్పవచ్చును. అన్నిటి కంటే ప్రప్రదానంగా చెప్పుకోవలసింది ఆయన దుందుడుకు స్వభావం, ఎవరినీ ఖాతరు చేయని లక్షణం అని పార్టీ కార్యకర్తలు అంటారు. తత్ఫలితంగా కృష్ణా జిల్లాలో ఆయనను వ్యతిరేఖించేవారే ఎక్కువయిపోవడంతో ఆయన పదవి కోల్పోయారని చెప్పవచ్చును. ఆయనను వ్యతిరేఖించే వారిలో మైలవరం శాసన సభ్యుడు మరియు కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, కేశినేని నాని ఉన్నారు. వీరిరువురి ఒత్తిడి వలనే చంద్రబాబు వంశీని విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించి, దానిని కేశినేని నాని అనుచరుడయిన నాగుల్ మీరాకు కట్టబెట్టారు.   పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వంశీకి తెదేపా కార్య నిర్వాహక సంఘానికి కార్యదర్శిగా పదవి ఇచ్చినపటికీ, గత ఏడాది ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు వంశీ వెళ్లి ఆయనను కలవడం నేటికీ పార్టీలో ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నాటి నుండి వంశీ పై పార్టీకి అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడూ వంశీ స్నేహితులయిన వంగవీటి రాధ కృష్ణ, కొడాలి నాని ఇద్దరూ వైకాపాలోకి మారిన తరువాత కూడా వంశీ వారితో స్నేహం కొనసాగిస్తుండటం వారి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.   ఈ నేపద్యంలో వంశీ పార్టీలో తనకు సరయిన గౌరవం లేదని భావించడం సహజమే. అందువల్లే ఆయన వైకాపా వైపు చూస్తున్నాడని పుకార్లు చెలరేగడంతో వంశీ వెంటనే స్పందిస్తూ తనకు చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలలో గన్నవరం నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, ఒకవేళ ఆయన మాట తప్పితే తానూ పార్టీని, రాజకీయాలను విడిచిపెట్టి ఇంటి దగ్గర కూర్చోంటాను తప్ప వైకాపాలో చేరబోనని ప్రకటించారు. అంతే కాకుండా తనకు గన్నవరం సీటు మీద తప్ప ప్రస్తుతం తనకు అప్పగించిన పదవిపై ఏమాత్రం ఆసక్తి, ఇష్టం లేదని, ఒకవేళ పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే తానూ ఈ పదవిని కూడా వీడి సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు.   పార్టీకి ఇన్నేళ్ళ సేవలందించిన తరువాత ఈ రోజు ఇటువంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ఇక తెలుగు దేశం పార్టీలో ఎన్నాళ్ళు కొనసాగగలడు? ఒకవేళ పార్టీ వీడి బయటకి వస్తే ఇప్పుడు చెపుతునట్లు రాజకీయ సన్యాసం చేస్తాడా లేక జగన్ మోహన్ రెడ్డి పంచన జేరుతాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది?   ఏది ఏమయినప్పటికీ, చంద్రబాబు ఆయనకీ గన్నవరం టికెట్ ఇస్తార లేదా అనే విషయం మీదనే అంతా ఆధారపడిఉంది. టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన పార్టీని వీడటం 100 శాతం ఖాయం. ఒకవేళ ఇచ్చిన తరువాత కూడా పార్టీలో ఇవే పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది గనుక అప్పుడు ఆయన ఏమి చేస్తారో చూడాలి. ఏమయినప్పటికీ, వంశీ పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్నట్లే ఉందని చెప్పవచ్చును.

ఘనంగా టిడిపి 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

        రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.   సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈనాడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.   తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తమకు అధికార కాంక్ష లేదని, టీడీపీ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ముషారఫ్‌కి బూటు దెబ్బలు

      పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మద్ధతుదారులతో సింధ్‌ హైకోర్టు బయటకు వస్తుండగా ఆయనపై శుక్రవారం ఓ ఆగంతకుడు బూటు విసిరారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ నిశ్చేష్టులయ్యారు. బెయిల్ నిమిత్తమై ముషారఫ్ సింధ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు 15 రోజులపాటు బెయిల్‌ పొడిగించింది. తీర్పు పూర్తైన అనంతరం కోర్టునుంచి బయటకు వస్తున్న ముషారఫ్పై ఈ దాడి జరిగింది.   నాలుగేళ్ల  ప్రవాస జీవితం అనంతరం ఇటీవల ముషారఫ్ స్వదేశానికి వచ్చారు. ఆయన వస్తే తాము చంపేస్తామని తాలిబన్ ఉగ్రవాదులు హెచ్చరించినా ఆయన భయపడలేదు. తీవ్రవాదుల హెచ్చరికలకు తాను భయపడడని ఆయన అన్నారు. అయితే ఆయన వచ్చిన నాలుగురోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన భారీ భద్రత నడుమనే కోర్టుకు వచ్చారు. అగంతకుడు విసిరిన బూటు కూడా ఆయనకు తగలలేదు.  

పేర్ని నానికి చెక్ పెట్టేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్

  కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చి వైకాపాలోకి జంపు చేసిన కాంగ్రెస్ శాసన సభ్యుడు పేర్నినాని చాలా కీలకమయిన బాధ్యతలు చేపట్టవచ్చుననే గొప్పకలలు కంటూ ఆ పార్టీలోకి దూకితే అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నగనిపిశెట్టి గోపాల్ వంటి వారు అనేక మంది వచ్చే ఎన్నికలలో మచిలీపట్టణం అసెంబ్లీ, పార్లమెంటు నియోజక వర్గలాపై చాల ఆశలు పెట్టుకొని ఉండటంతో, హట్టాతుగా ఊడిపడిన పేర్నినాని రాకతో కలవరం చెందుతున్నట్లు సమాచారం. అదే విషయం ఇటీవల వారు నిర్వహించిన బందరు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో చర్చకు కూడా వచ్చినట్లు సమాచారం. వారిలో కొందరు నేతలు వైకాపా అధిష్టానం తమను కాదని కొత్తగా వచ్చిన పేర్నినాని మాటకే ఎక్కువ విలువీయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపద్యంలో పేర్నినానికి వైకాపాలో కుదురుకోవడానికి మరి కొంచెం సమయం పట్టవచ్చును.   ఇక, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పేర్ని స్థానంలో ఆయనకి సమఉజ్జీలను నియమించుకొని, వచ్చే స్థానిక ఎన్నికలలోపుగానే నియోజక వర్గంలో ఆయన ప్రాదాన్యత పూర్తిగా తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంత్రి కె. పార్థ సారథి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, మాజీఎంపీ బాడిగ రామకృష్ణలను ముగ్గురికీ బందరు నియోజక వర్గంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పేర్ని నానికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయాయి.   2004లో బందరు నుంచి ఎంపీగా గెలుపొందిన బాడిగ రామకృష్ణ ఆ తరువాత ఎన్నికలలో ఓటమి పాలవడంతో, ఆయన తన రాజకీయ కార్యకలాపాల జోరు కొంచెం తగ్గించుకొన్నారు. కానీ, మారిన రాజకీయ నేపద్యంలో, పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవవడంతో ఆయన ఇటీవలే బందరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా మునిసిపల్ కమిషనర్‌ను కలిసి తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. అంతే కాకుండా మునిసిపాలిటీకి రెండు నీళ్ళ ట్యాంకర్లను కూడా అందజేశారు.   మరో వైపు నుండి మంత్రి కె. పార్థ సారథి, వేదవ్యాస్ వంటి వారు కూడా తమ కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ విధంగా ముగ్గురు ఉద్దండులయిన కాంగ్రెస్ నేతలు బయట నుండి పేర్నినాని పరిధిని కుచించే ప్రయత్నాలు మొదలుపెడితే, మరో వైపు వైకాపాలో నేతల నుండి వ్యతిరేఖత కూడా ఎదుర్కోవడం పేర్నినానికి కత్తి మీద సామే అవుతుంది.   ఎన్నికలు దగ్గిర పడుతున్నకొద్దీ పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రతరం అయినప్పుడు మరి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆయనకే టికెట్ ఇస్తారో లేక మరెవరయినా దానిని ఎగరేసుకుపోతారో చూడాలి. అదే గనుక జరిగితే పేర్నినాని పని రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది. అయితే, నియోజక వర్గంలో మంచి పలుకుబడి, అనుచరుల మద్దతు ఉన్న పేర్నినానికే పార్టీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. గానీ, అంతవరకు ఎదురయ్యే ఒత్తిళ్ళను భరించడమే ఆయనకు ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చును.

యువతితో బిజెపి ఎమ్మెల్యే లాడ్జ్ లో రాసలీలలు

        కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులు సమయం ఉండగా బీజేపీకి గట్టి ఎదుదెబ్బ తగిలింది. ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ఓ యువతితో లాడ్జ్ లో రాసలీలలు ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు రహస్యంగా సీసీటీవి కెమెరాల్లో బంధించి మీడియాకు విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం చెలరేగింది.   ఈ ఎమ్మెల్యే భార్య కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందులో రఘుపతిభట్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు పోలీసుల దర్యాప్తులో వుంది. తాజాగా మరో మరో సెక్స్ స్కాంలో అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ సీడీలో ఉన్నది తాను కాదని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని, ఏదో ఒకటి తేలే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని రఘుపతి భట్ స్పష్టం చేశారు.

టిడిపి ఆవిర్భావ దినోత్సవం

        తెలుగుదేశం పార్టీ 32వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అన్ని మండలాల్లో వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పెదపుడిలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సంధర్బంగా పార్టీలకి సేవలందించిన సీనియర్లను చంద్రబాబు సన్మానించనున్నారు. విద్యుత్ సమస్యలపై పాత ఎమ్మెల్యే నివాస సముదాయ ప్రాంగణంలో నిరశన దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

చేతులుకాలేక ఆకులు పట్టుకొన్న ప్రభుత్వం

  మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ కలిసి బాబ్లీ ప్రాజెక్టుపై ఇంతకాలంగా నిద్రపోతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిద్రలేపగలిగాయి. నెల రోజుల క్రితం సుప్రీం కోర్టు మన రాష్ట్రానికి వ్యతిరేఖంగా బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించినప్పుడు దానివల్ల మన రాష్ట్రానికి ఎంత మాత్రం నష్టం లేదని బల్ల గుద్ది వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో బాబ్లీపై సుప్రీం కోర్టులో పునర్విచారణకు పిటిషను వేసేందుకు అంగీకరించడమే కాకుండా అవసరమయితే ప్రతిపక్షాలను స్వయంగా డిల్లీ తీసుకువెళ్ళి కేంద్రం మీద రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు కూడా అంగీకరించారు. అయితే, ఇదే సమావేశం సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నపుడే నిర్వహించి అన్ని పార్టీలను కలుపుకొని ఆనాడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ రోజు బాబ్లీ ప్రాజెక్టు ఉండేదికాదు.   రాష్ట్ర ప్రయోజనాలను కాపడుకోవలాసిన సమయంలో కూడా ప్రతిపక్షాలను సంప్రదించడానికి ముఖ్యమంత్రికి అహం అడ్డుపడటంతో మహారాష్ట్ర పని సులువయిపోయింది. అదీ గాక దేనినయినా రాజకీయ అంశంగా చూసే మన రాజకీయ పార్టీల దురలవాటు కూడా ఈ అనరధానికి మరో కారణం అని చెప్పవచ్చును. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్లీపై మహారాష్ట్ర అక్రమ నిర్మాణం చేపడుతున్నపుడు దానిని ఆపడానికి ప్రయత్నించలేదు.   మహారాష్ట్రను అడ్డుకొంటే అక్కడ తన వోటు బ్యాంకుకు గండి పడుతుందని కేంద్రం నిర్లిప్తత వహిస్తే, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దానితో రాజకీయచదరంగం ఆడుకొన్నాయి. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన అధికార కాంగ్రెస్ పార్టీనే ఇందుకు పూర్తిగా తప్పు పట్టవలసి ఉంటుంది. జరిగిన తప్పు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నపటికీ అహంభావంతో, బేషజాలతో ఇంతకాలం వితండవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తీరికగా అఖిల పక్షం పెట్టి సలహాలు కోరడం, సుప్రీం కోర్టులో పునర్విచారణకు పిటిషను వేసేందుకు అంగీకరించడం, ప్రతిపక్షాలను డిల్లీకి తీసుకువెళతానని హామీలు ఈయడం కేవలం ప్రతిపక్షాలను శాంతింప చేయడానికి మాత్రమే పనికి వస్తాయి తప్ప, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నుండి అక్రమంగా నీళ్ళని వాడుకోకుండా ఆపలేవు. ఇది కేవలం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం తప్ప మరొకటి కాదు.   కనీసం ఇప్పటికయినా ప్రభుత్వానికి ఈవిషయంలో చిత్తశుద్ధి కానీ పశ్చాతాపం కానీ లేకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి, అసమర్ధతకు , నిర్లక్ష్యానికి రైతన్నలు మూల్యం చెల్లించవలసి రావడం దారుణం.

ఎన్టీఆర్ ను వెంటాడుతున్న ఫ్లెక్సీ పాలిట్రిక్స్

        యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్లెక్సీ లా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేది లేదని గతంలోనే స్పష్టం చేశారు. జగన్ పార్టీ వైఎస్ఆర్.కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ ఫ్లెక్సీ లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టడం మాత్రం మానడం లేదు. లేటెస్ట్ గా షర్మిలా పాదయాత్ర స్వాగతం చెబుతూ విజయవాడలో కట్టిన ఫ్లెక్సీలో వైకాపా నేతలతో ఎన్టీఆర్ ఉండడం కలకలం రేపుతోంది.   వైకాపా ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఉండడం ఇది మొదటిసారి కాదు. కొన్నిరోజుల క్రితం మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో జగన్, కోడాలి నాని తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్...జగన్ మీద అభిమానంతో ఆ ఫ్లెక్సీ నేనే పెట్టానని ఓ అభిమాని వివరణ ఇవ్వడంతో వ్యవహారం సద్దుమనిగింది. ఆ వివాదం ముగిసి రెండు రోజులు కాకముందే మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో ప్రత్యక్షమవడంతో..టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పార్టీ ఓట్ల కోసం ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ వివాదం పెద్దది కాకముందే..ఎన్టీఆర్ అభిమానులు పోలీసులకు పిర్యాదు చేసి ఎన్టీఆర్ వున్న ఫ్లెక్సీ ని తొలగించారు.

టిడిపి దీక్ష: క్షీణించిన ఎమ్మెల్యేల ఆరోగ్యం

        విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో జైపాల్ యాదవ్, అనసూయ, సత్యవతి, రాథోడ్, సీఎం రమేష్, శ్రీరాం రాజగోపాల్, దేవినేతి ఉమ, కె. శ్రీధర్, ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పేర్కొన్నారు. వారికి తక్షణం వైద్య సహాయం అందించాలని డాక్టర్లు పోలీసులకు సూచించారు. కాగా టీడీపీ నేతలు వైద్య సహాయానికి నిరాకరిస్తూ, తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.   మరోవైపు విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే విద్యుత్ సమస్యలకు కారణమని వారు ఆరోపించారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, సకాలంలో కరెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.  

జగన్ పార్టీలోకి జోగి రమేష్

      కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ జగన్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమంయలో జోగి రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఆఖరు నిమిషం వరకు తాను ప్రభుత్వానికి అండగా ఉంటానని చెప్పిన జోగి రమేష్ చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు లేచి నిలబడి కాంగ్రెసుకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తాను జగన్ పార్టీలోకి వెళ్తానని ప్రకటించారు.   ఈరోజు జోగి రమేష్ చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ ను ములాఖత్ సమయంలో కలిశారు. పెడన నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు రమేష్ కు జగన్ హామీ ఇచ్చారని సమాచారం.  

రాహుల్ భజన చేయోద్దంటే వినరూ...

  పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతోగానీ పోవంటారు పెద్దలు. అదేవిధంగా అధిష్టానానికి భజన చేయడానికి అలవాటు పడిపోయిన కాంగ్రెస్ ప్రాణులు రాహుల్ గాంధీ ఎంత వద్దని మొట్టుకొంటున్నా ఆయన భజన చేయడం ఆపలేకపోతున్నారు. ఆయన పార్టీని, ఇంకా వీలయితే దేశాన్ని సమూలంగా మార్చిపారేద్దామని కలలుగంటుంటే, అది అంత వీజీ కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార వికేంద్రీకరణ జరిగి దేశంలో మారుమూలనున్న పార్టీ కార్యకర్తకి కూడా పార్టీలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తుంటే, ‘అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ రాహుల్ గాంధీ తప్ప మరెవరికీ అధికార పగ్గాలు చెప్పట్టే యోగ్యత, హక్కు లేవని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు దిగ్విజయ్ సింగు వంటి సీనియర్ నేతలు.   “రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి పదవి చేపట్టనని ఎవరితో ఎన్నడూ అనలేదు. ప్రధాని పదవి కంటే ప్రజా సంక్షేమానికే తానూ అధిక ప్రాదాన్యం ఇస్తానని ఆయన అంటే, మీడియా దానిని వక్రీకరించి “ఆయన ప్రధాని పదవి మీద ఆసక్తి లేదు, మన్మోహన్ సింగు తరువాత ఎవరు ప్రధాని బాధ్యతలు చేపడతారు?” అంటూ ఒక పెద్ద చర్చ కూడా మొదలుపెట్టేసింది. అయితే, వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభిస్తే, తప్పనిసరిగా ఆయనే ప్రధాని పదవి చెప్పట్టాలని నేను కోరుకొంటాను."   "అసలు పార్టీ అధ్యక్ష పదవిని , ప్రధాన మంత్రి పదవిని ఒకరే చేపట్టడం మంచిదని నా అభిప్రాయం. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంతవరకు ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్నడూ కల్పించుకోలేదు. అయినప్పటికీ యుపీయే-1&2 లలో రెండు అధికార కేంద్రాలు ఉండటం వలన ప్రజలలో, పార్టీలో, ప్రభుత్వంలో కూడా కొంత గందరగోళం ఏర్పడినట్లు నేను భావిస్తున్నాను. అందువల్ల పార్టీని, ప్రభుత్వాన్ని ఒకరే నడిపిచినట్లయితే ఆ బాధ్యతలు చెప్పటిన వ్యక్తికి రెంటి మీద పూర్తి ఆదిపత్యం కలిగి ఉండటమే కాకుండా, దానివల్ల ఆ రెండు వ్యవస్థల మధ్య చక్కటి సమన్వయం కూడా ఏర్పడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం,” అంటూ తన రాహుల్ గాంధీ భజన కార్యక్రమం ముగించారు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దిగ్విజయ్ సింగు.