చంద్రబాబు ఆహ్వానం.. కేసీఆర్ అన్నా.. కేటీఆర్ అంకుల్
posted on Oct 19, 2015 @ 4:22PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న వైరం అందరికి తెలిసిందే. రాష్ట్రం విడిపోక ముందు వీరిద్దరి మధ్య ఉన్న వైరం ఒక ఎత్తైతే.. రాష్ట్రం విడిపోయి ఆతరువాత ఓటుకు నోటు కేసు తర్వాత ముదిరిన వైరం ఒక ఎత్తు. ఈ నేపథ్యంలో ఒకరి మీది ఒకరు ఒక రేంజ్ లో డైలాగులు వేసుకున్నారు. అందులో కేసీఆర్ అయితే మరీ కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో తిట్టేస్తూ ఉంటారు. అంత కచ్చితంగా.. అంత సూటిగా తిట్టేస్తుంటారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుదేమో అన్న పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయంగా ఎన్ని గొడవలు ఉన్నా కాని ముఖాముఖి కలిసినప్పుడు మాత్రం రాజకీయ నేతలు బానే ఉంటారు అని చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఇక్కడి పరిస్థితి వేరు ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు కేసీఆర్.. అందులో వారిద్దరు మధ్య ఉన్న వైరం. అలాంటప్పుడు వాళ్లు కలిస్తే ఎలా ఉంటుంది?.. ఎలా సంభాషించుకుంటారు? అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తాయి.
దీనిలో భాగంగానే చంద్రబాబు,కేసీఆర్ ను కలుస్తున్నారు అన్నప్పుడు కూడా అందరికి అలాంటి అనుమానాలే వచ్చాయి. అయితే అనుమానాలన్నింటికి వీరిద్దరూ సమాధానం చెప్పారు. చంద్రబాబు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను ఇంటికి వెళ్లి మరీ పిలుస్తా అని చెప్పిన ప్రకారం నిన్న ఆయన ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా చంద్రబాబును సాదరంగా ఆహ్వానించి పలుసందర్బాల్లో అన్నా అని సంబోధించి అందరిని ఆశ్చర్య పరిచారు. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా రావాలని చంద్రబాబు కోరితే.. అన్నా మీరు స్వయంగా వచ్చి ఆహ్వానించారు.. తప్పకుండా వస్తా అని సమాధానమిచ్చారు. అంతేకాదు రాజధాని పర్యటన పక్కా అని నువ్వు చెబుతావా? లేక నన్ను చెప్పమంటావా? అని సరదాగా చంద్రబాబు కేసీఆర్ ను అడిగితే కేసీఆర్ మీరే చెప్పండన్నా అని సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. చివర్లో కేటీఆర్ ను కూడా ఆహ్వానం అందింది కదా అని అడుగగా కేటీఆర్ కూడా అందింది అంకుల్ అని చెప్పడం గమనార్హం. మొత్తానికి ఎలా కలుస్తారా? ఎలా మాట్లాడుకుంటారా? అని అందరూ ఎదురుచూస్తుండగా వారందరికి ఈ తెలుగు ముఖ్యమంత్రులు షాకిచ్చారు.