బులెట్ ట్రైన్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్: తెదేపా ఎంపి

  అమలాపురం లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా ఎంపి పి. రవీంద్ర బాబు నిన్న కేంద్రప్రభుత్వానికి షాక్ ఇచ్చేరు. నిన్న లోక్ సభలో ఉప పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “ప్రపంచదేశాలతో పోలిస్తే మన దేశ ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలుసు. కనుక కేవలం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు బులెట్ ట్రైన్ వంటి బారీ ప్రాజెక్టులను భుజాలకు ఎత్తుకోవడం సరికాదు. అసలు బులెట్ ట్రైన్ వంటి తలకు మించిన భారం ఎత్తుకోవడం దేనికి? మన దేశంలో 44 కోట్ల మందికి పైగా దారిద్ర్యరేఖకు దిగువనున్నారు. ఆ సొమ్మును వారి సంక్షేమానికి ఖర్చు చేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకొని అడుగు ముందుకు వేయవలసిన అవసరం ఉంది. మనం రక్షణ రంగం మీద ఖర్చు రెండు లక్షల కోట్లు చేస్తున్నాము. ఇరుగుపొరుగు దేశాలతో శాంతి నెలకొల్పుకొనగలిగితే, రక్షణ రంగం మీద ఖర్చు చేస్తున్న ఆ డబ్బు అంతా పేదల సంక్షేమానికి దేశాభివృద్ధికి వినియోగించుకోవచ్చును,” అని అన్నారు.   ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్టు. కనుక దానిని బీజేపీలో, కేంద్రప్రభుత్వంలో, తెదేపాతో సహా ఎన్డీయే కూటమిలో ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయడం లేదు. కానీ తెదేపా ఎంపీ రవీంద్ర బాబు నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పగలగడం విశేషం. అయితే ఆయన ఒక్కరూ అభ్యంతరం చెప్పినంత మాత్రాన్న ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్రం దానిని విరమించుకొంటుందని భావించలేము. కేంద్రప్రభుత్వం అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 98,000 కోట్లతో బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ తో ఒప్పందం కుదుర్చుకొంది. దానిలో 80 శాతం నిధులను జపాన్ సమకూర్చుతుంది. ఈ సందర్భంగా ఎంపీ రవీంద్ర బాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, పోలవరం నిర్మాణం వంటి అంశాల గురించి కూడా కేంద్రప్రభుత్వాన్ని లోక్ సభలో నిలదీశారు.

చంద్రబాబుని డౌట్ అడిగిన కేసీఆర్..అన్నా మీ ఇల్లు మునగదా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆహ్వానం అందించడానికి ప్రత్యేక హెలికాఫ్టర్లో విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలోనే విజయవాడలో తన నివాసానికి వచ్చిన కేసీఆర్ ను చంద్రబాబును సాదరంగా లోపలికి ఆహ్వానించగా..కేసీఆర్ అనంతరం చండీయాగానికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబుని కోరారు.దీంతో చంద్రబాబు కూడా తప్పకుండా వస్తానని కేసీఆర్ కు చెప్పారు.ఇక ఆ తరువాత..ఇద్దరు సీఎంలు కలిసి కాసేపు ఉల్లాసంగా మాటలు కలిపారు.అయితే ఈసందర్భంగా కేసీఆర్ తనకు వచ్చిన ఒక డౌటును నివృతి చేసుకున్నారంట.అదేంటంటే..అన్నా నేను హెలికాఫ్టర్లో వస్తున్నప్పుడు పైనుండి చూశాను..నది నిండుగా ఉంది..మరి అలాంటప్పుడు వర్షాకాలంలో మీ ఇల్లు మునగదా..? రాజధాని ప్రాంతానికి ఇబ్బంది లేదా అని అడిగారంట.దానికి చంద్రబాబు..పైనుండి చూశావు కాబట్టి అలా అనిపిస్తుంది..కానీ అది నిజం కాదు..వీటీపీఎస్ థ‌ర్మల్ విద్యుత్ కేంద్రం అవ‌స‌రాల కోసం న‌దిలో ఆ నీటిమ‌ట్టం నిర్వహిస్తుంటారు..లేక‌పోతే వీటీపీఎస్ ఆగిపోతుంది అని వివరంగా చెప్పారంట.ఇక రాజధాని ప్రాంతానికి అయితే భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తగా ప్రణాళిక సిద్దం చేస్తున్నాం అని చెప్పారంట.మొత్తానికి కేసీఆర్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఓపికగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ కు కోదండరాం ఝలక్..

తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీలోకి ఈమధ్య కాలంలో వలసల పర్వ సాగింది.చాలా మంది నేతలు తమ పార్టీని విడిచి టీఆర్ఎస్ లోకి చేరారు.అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో,కొత్త రాజకీయాలను కోరుకుంటున్నామన్నారు.పార్టీని వదిలి వెళ్లిపోవడం లాంటివి అస్థిరతకు దారి తీస్తాయి..ఏరాజకీయ పార్టీ  ఫిరాయింపులు ప్రోత్సహించినా అది తప్పే అవుతుందని అన్నారు.అంతేకాదు ఆత్మహత్యల నివారణకు పాటలు రాయాలని..సంఘటితంగా ముందుకు వెళ్లాలని..ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.కాగా త్వరలోనే టీ.జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.

దానంపై అధిష్టానం ప్రశంసలు..ఈరకంగా ఐసా..?

తెలంగాణ సీనియర్ నేత దానం నాగేందర్ పార్టీ మార్పుపై జరిగిన హడావుడి అంతా ఇంతాకాదు.దానం పార్టీ మారుతున్నారని ఈమధ్య కాలంలో వార్తలు జోరుగా సాగాయి.దీనికి తోడు దానం కూడా టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపే సరికి ఇక టీఆర్ఎస్ గూటికి వెళ్లడం ఖాయం అయినట్టే అనుకున్నారు.ఇంతలో తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని దానం ట్విస్ట్ ఇచ్చారు.దీంతో కొంత మంది దానంపై విమర్శలు చేస్తే..కొంతమంది మాత్రం ప్రశంసలు కురిపించారు.అందునా దానం చర్యలు చూసి కాంగ్రెస్ అధిష్టానం అతని వైఖరిపై మండిపడుతుంది అనుకుంటే..ఊహించని విధంగా వారే దానంను ప్రశంసించడం అశ్చర్యకరం.టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా దానం మాత్రం పార్టీని వీడకుండా అంటిపెట్టుకున్నారని ప్రశంసించారు.అంతేకాదు నగర కాంగ్రెసు పార్టీలో శిఖరప్రాయమైన నేతగా దానం నాగేందర్‌ను ఢిల్లీ పెద్దలు ప్రశంసిస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు.మొత్తానికి దానం పార్టీ మార్పుపై మళ్లీ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారా అని ఈరకంగా కాంగ్రెస్ పార్టీ ఐస్ చేస్తున్నట్టు ఉంది.

ఆయన నెల క్రితమే అనుమతి కోరారు..డీజీపీ జేవీ రాముడు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ నెలరోజులు సెలవులు కోరడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.విజయవాడలో కాల్ మనీ దందా కోరలు విప్పిన నేపథ్యంలో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ సెలవులపై వెళ్తుండటంతో..కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఈ సందర్బంగా డీజీపీ రాముడు మాట్లాడుతూ కాల్ మనీ కేసులో తప్పుచేసిన వారిని వదిలి పెట్టమని..గౌతమ్ సవాంగ్ నెల రోజుల క్రితమే సెలవులు కావాలని అనుమతి కోరారని..ఆయన స్థానంలో సమర్ధవంతమైన అధికారిని నియమిస్తామని తెలిపారు.నగర ఇంఛార్జ్ సీపీగా సురేంద్ర బాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తా తెలిపారు.అంతేకాదు మేం చేస్తున్న విచారణ వడ్డీ వ్యాపారం పై కాదు అని..కాల్ మనీ పేరుతో మహిళలను వేధించేవారిని వదలిపెట్టమని అన్నారు.కాగా కల్తీ మందు కేసులో నిందితుడు మల్లాది విష్ణువు కోసం దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

కేరళాలో మోడీ.. నన్ను క్షమించండి..!

ప్రధాని నరేంద్రమోడీ కేరళ వాసులకు క్షమాపణ చెప్పారు. మోడీ ఎందుకు క్షమాపణ చెప్పారు అనుకుంటున్నారా..కేరళ పర్యటనలో భాగంగా త్రిసూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు19 నెలలు అయిన తరువాత మొదటిసారి కేరళకు వచ్చానని..అందుకే క్షమాపణ కోరుతున్నానని అన్నారు.అంతేకాదు కేరళలో ఉన్న జీజేపీ నేతలను ఆయన కొనియాడారు.కేరళలో ఉన్న బీజేపీ నేతలకు ఎంతో సహనం ఉంది అందుకే వారిని సహనశీలురుగా అభివర్ణిస్తున్నానని అన్నారు.కేరళ బీజేపీ కార్యకర్తల నుండి ఎంతో నేర్చుకోవాలి..కొంతమంది రాజకీయ ప్రేరేపిత చర్యల వల్ల సుమారు 200మంది బీజేపీ కార్యకర్తలు దారణ హత్యకు గురయ్యారు..అయినా కానీ ఎక్కడా సహనం కోల్పోకుండా ప్రతిచర్యలకు దిగకుండా ఉన్నారు అని వారిని ప్రశంసించారు.కానీ ఇప్పుడు అలా కాదు..పరిస్థితులు మారాయి..కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు'అంటూ వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్ కు సరదా అయిపోయింది..వెంకయ్యనాయుడు

ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈరోజు సీబీఐ దాడులు జరిపిన సంగతి తెలిసిందే.సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేందర్ సింగ్ కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాడులు చేశామని..సీబీఐ స్పష్టం చేసింది.దీనికిగాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మోడీ కావాలనే సీబీఐతో దాడులు చేయించారని..ఇలాంటి చర్యలకు తాను భయపడేది లేదని..ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘాటుగా సమాధానమిచ్చారు.ప్రతి చిన్న విషయానికి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు తగదని..కేజ్రీవాల్ ప్రతి విషయానికి కేంద్రంతో గొడవపడటం సరదాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాదు సీబీఐ ఒక స్వచ్ఛంధ సంస్ధ అని దానిపై రాజకీయ పార్టీల అజమాయిషీ చెల్లదని తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మరోవైపు ఈ దాడులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ కూడా స్పష్టం చేసింది.కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే దాడులు చేశామని సీబీఐ తెలిపింది.

గవర్నర్ ని కలిసిన జగన్..బాక్సైట్ తవ్వకాలపై ఫిర్యాదు..

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి..ఆపార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గవర్నర్ నరసింహన్ కలిశారు. బాక్సైట్ తవ్వకాలు..కాల్ మనీ దందాపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులు నష్టపోతారని అన్నారు.అంతేకాదు ప్రభుత్వం కావాలనే ట్రైబుల్ అథారిటీ కమిటీ వేయడంలేదు..ఏడుగురిలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టే కమిటీ వేయడం లేదని అన్నారు.బాక్సైట్ తవ్వకాలపై మాట్లాడినందుకు గిరిజన ఎమ్మెల్యేపై కేసు పెట్టారు..వారు పెట్టిన కేసులు చెల్లవు అని మండిపడ్డారు.అంతేకాదు విజయవాడ, గుంటూరును మాఫియాకు అడ్డాగా మార్చారు అని విమర్సించారు.

విజయవాడలో చంద్రబాబుకి కేసీఆర్ ఆహ్వానం.. కారణం అదేనా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసి తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి పిలిచిన సంగతి తెలిసిందే.అలాగే తన నివాసానికి వచ్చిన కేసీఆర్ ను సైతం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేసీఆర్ తన యాగానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించగా దానికి చంద్రబాబు సైతం తప్పకుండా వస్తానని చెప్పారు.ఆతరువాత చంద్రబాబు, కేసీఆర్ కలిసి ఓ పదిహేను నిమిషాలు మాట్లాడుకోవడం..అనంతరం చంద్రబాబు కేసీఆర్ కోసం ప్రత్యేకం ఏర్పాటు చేయించిన విందులో పాల్గొనడం ఆతరువాత కేసీఆర్ మళ్లీ హైదరాబాద్ కు రావడం జరిగాయి. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా కేసీఆర్ ఇంత సడెన్ గా..అది కూడా ప్రత్యేక హెలీ కాఫ్టర్ లో వచ్చి ఆహ్వానించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసీఆర్ ఇంత సడెన్ రావడం వెనుక వేరే మర్మ ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఎందుకంటే ఇంకా రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలకి చంద్రబాబు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో కేసీఆర్ అప్పుడైనా చంద్రబాబుని ఆహ్వానించవచ్చు..అయితే ప్రత్యేకంగా విజయవాడకి వచ్చి ఆహ్వానించడంతో మీ ప్రాంతం ఇది..ఇదే మీ రాజధాని అని..హైదరాబాద్ కాదని చెప్పకనే చెప్పడానికి ఇలా చేశారని అంటున్నాయి రాజకీయ  వర్గాలు.అంతేకాదు త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు కూడా కలిసి వస్తుందని ఇలా ప్లాన్ చేశారంట. ఎందుకంటే హెదరాబాద్ సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువ కాబట్టి..వారి దగ్గర కూడా మార్కులు కొట్టేయడానికే ఇలా చేశారంట.మరి అసలు రహస్యమేంటో కేసీఆర్  కే తెలియాలి..

మోడీది పిరికిపంద చర్యలు.. కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆఫీస్ పై సీబీఐ దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ఆఫీస్ ను సీజ్ చేసినట్టు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మోడీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే సీబీఐ దాడులు చేయిస్తున్నారు..కక్షపూరితంగానే మోడీ సర్కార్ సీబీఐ దాడులు చేయిస్తోంది..ప్రధాని మోడీది పిరికిపంద చర్యలు అని మండిపడ్డారు.ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ దాడులు చేసింది..ఇలాంటి వాటికి భయపడేది లేదు అని అన్నారు. అయితే సీబీఐ మాత్రం సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేంద్రసింగ్ కార్యాలయంలోనే దాడులు జరిపాం..కొన్ని కంపెనీలకు రాజేంద్రసింగ్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయి..కంపెనీల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించాం అంతే..కేజ్రీవాల్ ఆపీసులో కాదు అని చెబుతున్నారు.

ఏపీ.. కాల్ మనీ ప్రకంపనాలు..

ఏపీలో కాల్ మనీ ప్రకంపనాలు మొదలయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ, వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలో వడ్డీ వ్యాపారులు, కార్యలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్ లో ఉన్న వడ్డీ వ్యాపారుల కార్యలయ్యాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఇందులో భాగంగా మాచవరం పోలీసులు ఐదుగురు కాల్ మనీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక గుంటూరు, శారదాకాలనీ వడ్డి వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లో..అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫైనాన్షియర్లపై దాడులు జరిపి పలు కీలకపత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాదీనం చేసుకున్నారు.అలాగే ప్రకాశం జిల్లా, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాలలో పోలీసులు వడ్డీ వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు.కాల్ మనీ వ్యాపారులపై తనకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.

"కాల్ మనీ"..జగన్ సైలెంట్ అందుకేనా..?

ప్రస్తుతానికి ఏపీలో పొలిటి"కాల్ మనీ" వార్ జరుగుతుంది.దీనికి సంబంధించి ఇప్పటికే ఎంతో మంది నేతల పేర్లు కూడా బయటపడుతున్నాయి.దీనిలో కొంత మంది తెలుగు తమ్ముళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే  ఎప్పుడు అధికార పక్షం తప్పులు దొరుకుతాయా..ఎప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేద్దామా అని ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ ఎదురుచూస్తుంటారు.అలాంటిది ఇప్పుడు కాల్ మనీ దందాలో టీడీపీ నేతల పేర్లు వినిపిస్తున్నా జగన్ ఎందుకు ఏమాత్రం నోరు మెదపడంలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే జగన్ కు తమ పార్టీ నేతలపై ఉన్న నమ్మకంతోనే ఈ విషయంలో అధికార పార్టీపై నోరు జారడంలేదట.ఒకవేళ ఇప్పుడు కనుక తను అధికార పార్టీపై విమర్శలు చేసి..తరువాత పొరపాటున విచారణలో వైకాపా పార్టీ నేతల పేర్లు ఏవైనా భయటపడితే అప్పుడు పరువుపోతుందని ఆలోచిస్తున్నారంట.అంతేకాదు ఈ కేసుకు సంబంధించి అటు పోలీసు విచారణలో ఎవరెవరి పేర్లు వస్తున్నాయో చూసుకుంటుండడంతో పాటు తాను స్వయంగా దీనిపై వివరాలు తెప్పించుకునే పనిలోనూ ఉన్నారట.ఇంక రెండు రోజులు ఆగి..తమ నేతల పేర్లు లేని పక్షంలో ఆ తరువాత ప్రభుత్వం పై విమర్శలు చేయోచ్చులే అని భావిస్తున్నారంట.మొత్తానికి జగన్ కు తమ బంగారాల మీద అంత నమ్మకం ఉందన్నమాట.

మల్లాది విష్ణువుకి మరో దెబ్బ.."కాల్ మనీ" లో కూడా..!

ఇప్పటికే కల్తీ మందు వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ కేసు విషయంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మల్లాది విష్ణు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు.ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.ఇప్పుడు మళ్లీ ఏపీలో సంచలనమైన కాల్ మనీ కేసులో కూడా ఈయన చేయి ఉన్నట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో సులోచన అనే మహిళ.. మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ తమకు రూ.లక్ష అప్పుగా ఇచ్చి బదులుగా రూ.4లక్షలు వసూలు చేశారని..తన ఇంటిని కూడా లాక్కున్నారంటూ మలాది విష్ణు..అతని అనుచరుడు గణేష్ పై ఫిర్యాదు చేసింది.దీంతో ఈ వ్యవహారంలో కూడా మల్లాది విష్ణువు పేరు బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు కాల్ మనీ దందాపై జులుం విసిరారు.కాల్ మనీ బాధితులు ఎవరూ డబ్బులు తిరిగి చెల్లించొద్దంటూ..ఇలాంటి అవినీతి,అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.ఏది ఏమైనా కల్తీ మద్యం విషయంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాది విష్ణువుకి కాల్ మనీ వ్యవహారంతో మరో ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కాల్ మనీ కేసులో ఏపీ సీఎస్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఈవ్యవహారంపై జనవరి 18 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.