నిర్భయ పేరు చెప్పడానికి సిగ్గుగాలేదు.. తన పేరు జ్యోతిసింగ్..
నిర్భయ ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ విషాదకరమైన ఘటన జరిగి నిన్నటితో మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవీ, బద్రీనాథ్‌లు మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ కూతురి పేరు చెప్పుకోవడానికి తమకి సిగ్గుగా లేదని.. తమ కూతురి పేరు జ్యోతి సింగ్ అని ఆశాదేవీ చెప్పారు. కాగా నిర్భయపై అత్యాచారం చేసిన వారిలో ఒకరు జైలులోనే మరణించగా.. నలుగురికి ఉరిశిక్ష పడింది. ఇక మిగిలిన ఒకడు మైనర్ కారణంగా మూడు సంవత్సరాలు శిక్షపడి ఈనెల 20 తేదీన విడుదల కాబోతున్నాడు. దీంతో తమ కూతురిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన దోషులందరికీ శిక్ష పడింది కానీ.. అందరి కంటే ఎక్కువ హింసించిన వాడిని మాత్రం తక్కువ వయసు అనే కారణం చెప్పి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. అపరాది వయసు 16 ఏళ్లా లేక 18 ఏళ్లా అనేది నాకు తెలియదు.. అతను అత్యంత కిరతకానికి పాల్పడ్డాడు.. నా కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చిందని.. వయస్సు కారణంగా చూపి వదిలేయడం సరికాదు. వయస్సు కారణంగా దోషులు శిక్ష నుంచి తప్పించుకోవద్దు అని అన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ బాల నేరస్తుడిని విడుదల చేయోద్దని.. అతను సమాజానికి ముప్పుగా మారతాడని అన్నారు. దీనికి సంబంధించి మహిళా కార్యకర్తలు, విద్యార్ధులు, ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, అంబేద్కర్ యూనివర్శిటీలకు చెందిన ఫ్యాకల్టీలు, ప్రగతిశీల నేతలు మొత్తంగా 108మంది సంతకాలతో కూడిన ఒక ప్రకటన జారీ కూడా చేశారు.