బీజేపీ పతనం మొదలయిందా...?
బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇప్పటివరకూ ఉత్తరాదిన విజయాలను మూటగట్టుకున్న బీజేపీకి ఇప్పుడు పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. 'అజ్మీర్, ఆల్వార్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. రెండు చోట్లా లక్షకు పైగా మెజార్టీ సాధించింది. అదే విధంగా 'మండల్‌ఘర్' అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార బిజెపి అభ్యర్థిపై 10వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
దీంతో బీజేపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఎంటో అర్ధంచేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీపై ఉన్న వ్యతిరేకత అర్ధమైంది. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. ఇక బీజేపీ చచ్చీ చెడీ గెలిచింది. అప్పుడే బీజేపీ పతనం ఇక మొదలైంది అనుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ద్వారా అది నిజమని రుజువైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి అంశాలు ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈరోజు బడ్జెట్ చూసిన తరువాత బీజేపీపై ఇంకా మండిపడుతున్నారు. ముఖ్యంగా కామన్ మెన్ కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది ఏం లేదు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి అయితే ఈ బడ్జెట్ లో ఎలాంటి ఊసెత్తలేదు. ఆంధ్రుల రాజధాని అమరావతికి కోసం కానీ, మెట్రో రైలుకు కానీ..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ..ఎటువంటినిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇచ్చిన హామీల్లో బడ్జెట్‌లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా బడ్జెట్‌లో హామీలు ఇవ్వలేదు. ఆంధ్రా దాదాపు 12500కోట్లు ఇవ్వాలని కోరితే...వంద కోట్లు మాత్రమే కేటాయించింది. తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మరి ఓట్లు రానిచోట..ఎందుకు నిధులు ఇవ్వడం ఎందుకని అనుకున్నారనుకుంటా.. మళ్లీ రెండు రాష్ట్రాలపై చిన్నచూపు చూపించింది కేంద్రం. తెలంగాణలో అయితే బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు... ఇక ఏపీలో టీడీపీతో మిత్రపక్షం కాబట్టి ఆ నాలుగు సీట్లయినా దక్కాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక టీడీపీ కూడా బీజేపీ చేసిన పనికి.. ఆపార్టీతో తెగదెంపులు చేసుకునే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. టీడీపీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. మొత్తానికి బీజేపీ పతనం మొదలైనట్టే కనిపిస్తోంది..